జడ్చర్ల, అక్టోబర్ 7: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. జడ్చర్లలోని బాదేపల్లి పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో నాబార్డు నిధులు రూ.1.87కోట్లతో నిర్మించిన (2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం) గోదాంను శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోదాంల నిర్మాణానికి స్థలం ఇచ్చిన రైతులు, సహకరించిన వారితోపాటు సింగిల్‌విండో పాలకవర్గాన్ని మంత్రి, ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. అనంతరం ఇటీవల బీజేపీ నాయకులు రాష్ట్రంలో హంగ్ వస్తుందని చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. హంగు లేదు.. బొంగు లేదు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ అనుకూల విధానాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. దీంతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు.
రాష్ట్రంలో ఇదివరకు ఉన్న వేర్‌హౌస్ గోదాంల నిల్వ సామర్థ్యం 4లక్షల మెట్రిక్టన్నులేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70లక్షల సామార్థ్యానికి పెంచామన్నారు. జడ్చర్ల పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్ ఆరెకరాల భూమిని తీసుకొని 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాంను నిర్మించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, సర్పంచ్ ప్రణీల్‌చందర్, కౌన్సిలర్లు లత, నవనీత, కొండల్, ముడా డైరెక్టర్ ఇంతియాజ్‌ఖాన్, శ్రీకాంత్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్లు నర్సింహారెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులున్నారు.
ప్రతి కుటుంబానికి లబ్ధి
సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం బలీదుపల్లి, కన్మనూరులో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంబండ వర్గాల అభివృద్ధితో ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. దేశమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి వనపర్తి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, అడ్డాకల్ ఎంపీపీ నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ పెద్దమందడి మండల అధ్యక్షుడు వేణుయాదవ్, సర్పంచులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.