గద్వాల, జూన్ 26 : రైతుల శ్రమకు ఫలితం దక్కాలంటే ఆది నుంచే రైతన్నలు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి సూచిస్తున్నారు. దుక్కి దున్ని మొదలు పంట చేతికి వచ్చేవరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలి. కొనే ప్రతి వస్తువు విషయంలో, చేసే ప్రతి పని విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఎరువులు , విత్తనాలు, పురుగుల మందు కొనుగోళ్లలో జాగ్రత్తలు అవసరం. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు , సలహాలతో ముందుకు సాగితే రైతన్న అనుకున్న దిగుబడి సాధించవచ్చు. ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. వానకాలం పంటల సాగుకు రైతు సమాయత్తం అవుతున్నాడు.
అయితే వేసే పంట ఏదైనా ముందుగా చేయాల్సింది విత్తనాల కొనుగోలే. ఈ విషయంలో అప్రమత్తత పాటించక పోతే పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎందుకంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనేక ప్రైవేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రచార ఆర్భాటలతో రైతులను ఆకర్శించే ప్రయత్నం చేస్తుంటాయి. సీజన్ మొదలైంది అంటే చాలు నకిలీ, కల్తీ విత్తనాలు, ఎరువులు , పురుగుల మందులు మార్కెట్‌ను ముంచెత్తుతాయి. జిల్లాలో నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు గుర్తించేందుకు ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాలు దుకాణాలు తనిఖీ చేస్తూ కల్తీఎరువులు, విత్తనాలు అమ్మే వారిపై చర్యలు తీసుకోవడానికి పూనుకున్నది. ఈ నేపథ్యంలో వాటిని కొనుగోలు చేసే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
సీజన్ వస్తుందంటే చాలామంది వ్యాపారులు గ్రామాల్లో తిరుగుతూ నాసిరకం విత్తనాలు అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు. విత్తనాలు కొనేముందు రైతులు వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన అధికృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. బస్తాపై రకం పేరు లాట్‌నెంబర్ గడువుతేది గమనించాలి. కొనుగోలు బిల్లుతోపాటు నెంబర్, విత్తన రకం గడువు తేది ఉండేలా డీలర్ సంతకం తీసుకోవాలి. అలాగే రైతు సంతకం బిల్లుపై ఉండేలా చూసుకోవాలి . విత్తనాన్ని ఎన్నుకునే ముందు వ్యవసాయఅధికారి సూచనలు తీసుకోవాలి. ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేసినా తప్పక బిల్లు తీసుకోవాలి.
బిల్లుపై పేరు, విత్తన రకం తేది తదితర వివరాలుండాలి . పంటసాగు పూర్తయ్యేవరకు బిల్లు దాచి ఉంచాలి. ఒక వేళ విత్తనాలు నాసిరకం అని తేలితే రుజువులతో జిల్లా వినియోగదారరుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. విత్తన సంచులపై ముద్రించిన సమాచారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నదా లేదా అనే విషయాన్ని పరిశీలించాలంటే విత్తన సంచి, ప్యాకెట్ ధ్రువీకరణ సంస్థపేరు చిరునామా ఉండాలి . విత్తన రకం జన్యుస్వచ్ఛత వివరాలు విత్తనాలకు సంబంధించి ఇతర గుర్తింపు చిహ్నాలు ఉండాలి. విత్తన ఉత్పత్తిదారుని పేరు, చిరునామా విత్తనాలను ఎప్పటివరకు వాడుకోవాలో తెలిపే సమాచారం ట్యాగ్ ఇచ్చిన తేది వంటి వివరాలుండాలి. పత్తి విత్తనాలలో జిన్నింగ్ చేసి ప్యాకింగ్ చేసిన వాటిని కొనుగోలు చేయరాదు .
నాణ్యమైన ఎరువులనే వాడాలి .అక్కడక్కడ కొందరు దళారులు, వ్యాపారులు నాసిరకం ఎరువులను విక్రయిస్తూ రైతులను మోసం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రైతులు కొన్ని మెళకువలు పాటిస్తే నకిలీలను నివారించే అవకాశం ఉంది. లైసెన్స్ ఉన్న దుకాణంలోనే ఎరువులను కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ఎరువులకు ఒరిజినల్ బిల్ పొందాలి బిల్లును దాచాలి. మిషన్ కుట్టు ఉన్న ఎరువుల సంచులను మాత్రమే కొనాలి. బస్తాపై ప్రామాణిక పోషకాలు ఉత్పత్తిదారుని వివరాలుండాలి. రైతులు తప్పనిసరిగా బస్తాను తూకం వేయించి తీసుకోవాలి. అధికారుల సిఫారసుల మేరకు కొనాలి. కొనుగోలు చేసిన ఎరువుల విషయంలో అనుమానం వస్తే వెంటనే వ్యవసాయఅధికారులకు సమాచారం అందించాలి.
చీడ పీడల నివారణకు వాడే క్రిమిసంహారక మందుల కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ అధికారులు సూచించే వాటినే కొనుగోలు చేయాలి . లైసెన్స్ లేని దుకాణాల నుంచి కొనరాదు . అవసరానికి మించి మందులు నిల్వ చేసుకుంటే చెడిపోతాయి. లేబుల్ లేని మందు సీసా, డబ్బా, ప్యాకెట్ సంచులను కొనరాదు. మందు లేబుల్ మీద ప్రకటించిన మందు పేరు, రూపం, మందు శాతం, పరిమాణం, విష ప్రభావం తెలిపే గుర్తులు, వాడకంలో సూచనలు తీసుకోవాలి. విరుగుడు మందులు, బ్యాచ్ నెంబర్లు, వాడాల్సిన గడువు తయారు చేసిన సంస్థ పేరు రిజిస్ట్రేషన్ విషయాలను పరిశీలించాలి. తప్పనిసరిగా అన్ని వివరాలతో బిల్లులు పొందాలి. వాడిన మందు సీసా, డబ్బా, ప్యాకెట్ సంచులను విధిగా ధ్వంసం చేసి లోతైన గుంటలో పూడ్చాలి మందులు కలిపిన పాత్రలను ఇతర అవసరాలకు వాడొద్దు. ఈ సూచనలు, సలహాలు పాటిస్తే రైతులు మోసపోకుండా అనుకున్న స్థాయిలో దిగుబడులు సాధించవచ్చు.
వానకాలం సీజన్ ప్రారంభమైన వేళ రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో మండల వ్యవసాయశాఖ అధికారిని సంప్రదించాలి. వారు సూచించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు మాత్రమే రైతులు వాడాలి, రైతులు దుకాణాల్లో కొనుగోలు చేసిన వాటికి తప్పని సరిగా రసీదు పొందాలి. గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మడానికి ప్రయత్నిస్తే తమ దృష్టికి తీసుకురావాలి.
– జిల్లా వ్యవసాయశాఖ అధికారి, వీరప్ప