అయిజ, నవంబర్ 13 : అయిజ మున్సిపాలిటీ రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ ఏసీబీ వలకు చిక్కడంతో అయిజ పట్టణంలో కలకలం రేగింది. అయిజ మున్సిపాలిటీ రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వరప్రసాద్ ఏసీబీకి పట్టుపడ్డారని తెలియడంతో ము న్సిపల్ అధికారులతోపాటు, ఇతర శాఖల అధికారుల్లో గుబులు రేగింది. గురువారం రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల మున్సిపాలిటీ ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వరప్రసాద్, అక్కడే అవుట్ సో ర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ వంశీకృష్ణలను ఏసీబీ అధికారులు రూ.75 వేలు లంచం తీ సుకుంటుండగా కాపుకాసి పట్టుకున్నా రు.
ఆదిబట్ల మున్సిపాలిటీలో మో త్కూర్ ఆనంద్ అనే వ్యక్తి నాలుగంతస్తుల ఇంటి నిర్మాణం కోసం టీఎస్ బీపాస్‌లో దరఖాస్తు చేశారు. ఎప్పటికీ టీఎస్ బీపాస్ ద్వారా అనుమతులు మంజూరు కాకపోవడంతో బాధితుడు ఆనంద్ టౌన్ ప్లానింగ్ అధికారులను కలిశారు. రూ.లక్షన్నర ఇస్తే అన్ని అమతులు వస్తాయని, టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్, అవుట్ సోర్సింగ్ అసిస్టెంట్ వంశీకృష్ణలు చెప్పారు. అం త ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పగా, కనీసం లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం ఆదిబట్ల మున్సిపాలిటీలో విధులకు హాజరుకావాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ విధులకు హాజరుకాకుండా బాధితుడికి ఫోన్ చేసి, అడిగిన నగదును తన అసిస్టెంట్‌కు అందజేయాలని బాధితుడికి టౌన్ ప్లానింగ్ అధికారి ఫోన్లో సూచించాడు. దీంతో బాధితుడు ఏ సీబీ అధికారులను కలిసి విషయం చెప్పాడు.
దీంతో రంగంలోకి దిగిన ఏ సీబీ అధికారులు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో కాపుకాసి, అవుట్ సోర్సింగ్ అసిస్టెంట్ వంశీకృష్ణకు ఆనం ద్ రూ.75 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన మ రో ఏసీబీ టీం టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్‌ను ఆయన ఇంటి దగ్గర పట్టుకుని మున్సిపాలిటీకి తరలించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏ సీబీ అధికారులు వెల్లడించారు. వరప్రసాద్ అయిజ మున్సిపాలిటీలో రెగ్యులర్‌గా సోమవారం, ఆమనగర్లో ఇన్చార్జి అధికారిగా మంగళ, బుధవారా ల్లో, ఆదిబట్లలో గురు, శుక్ర, శనివారాల్లో విధులు నిర్వహిస్తున్నారు.