జడ్చర్ల టౌన్, మార్చి 16 : పట్టణంలోని రాజీవ్‌నగర్‌కాలనీలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఓ వ్యక్తి కేసుకు సం బంధించి వచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగానే హత్యకేసులో నింధితులు పట్టుబడ్డారు. ఆదివారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్చర్ల సీఐ కమలాకర్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌నగర్ కాలనీలో నివాసముంటున్న కోటయ్య (50) హమాలీ పనిచేసేవాడు.
అదే కాలనీలో నివాసముంటున్న రాజ్‌కుమార్‌తో తన భార్య అలివేలకు వివావేత ర సంబంధం కొనసాగుతున్నట్లు కోటయ్య గుర్తించి వారిద్దరినీ మందలించాడు. దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కోటయ్యను ఎలాగైనా తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 23వ తేదీన కోటయ్య షాద్‌నగర్‌లో ఫంక్షన్‌కు వెళ్లాడు. రాత్రి 11:30 గంటల వరకు కోటయ్య ఇంటికి రాకపోవటంతో అతడు తిరిగిరాడని భావించి అలివేలు, రాజ్‌కుమార్ ఇంట్లో కలిసి ఉన్నారు. ఈ తరుణంలో ఆకస్మాత్తుగా కోటయ్య ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
దీంతో ఈ విషయం ఇతరులకు తెలుస్తోందన్న భయంతో నిందితుల్దిరూ కలిసి కోటయ్య మెడకు చున్నీతో చుట్టి చంపి, ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న పాతఇంటికి తీసుకెళ్లి సహజంగా చనిపోయినట్లు అతడిని పడుకోబెట్టి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత నిందితురాలు అలివేలు తన పిల్లలు, బంధువుల వద్దకెళ్లి తన భర్త ఇంటికి రాలేదని గాలిస్తూ పాత ఇంట్లో పడి ఉన్న కోటయ్యను చూసి దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
కోటయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి బంధువు నాగయ్య జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఓ వైపు పోలీసులు విచారణ చేపడుతున్న క్రమంలో మృతుడు కోటయ్యది సహజమరణం కాదని, గొంతు నులిమటంతో చనిపోయినట్లుగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. దీంతో పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి మృతుడి భార్య అలివేలను అదుపులోకి తీసుకొని విచారించారు. హత్య చేసినట్లు నిందితులిద్దరూ అంగీకరించినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితులిద్దరినీ జడ్చర్ల కోర్టులో హాజరుపర్చనున్నట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్సై చంద్రమోహన్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.