గద్వాల అర్బన్, డిసెంబర్ 24: వివాహేతర సంబంధానికి అడ్డుతగులతున్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసిన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. 24గంటల్లో నిందితులను పట్టుకొని పోలీసులు కేసును ఛేదించారు. జిల్లాకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రంగస్వామి హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లాకేంద్రానికి చెందిన ఎండీ అబ్దుల్లా(35) కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అబ్దుల్లా శుక్రవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు.
మెడచుట్టూ నల్లని గాయాలు ఉండటంతో సోదరుడు హాజీ గద్వాలటౌన్ పోలీస్‌స్టేషన్‌లో అబ్దుల్లా భార్యపై ఫిర్యాదు చేశాడు. అప్పటికే ఆమె పరారీలో ఉన్నది. గద్వాల సీఐ చంద్రశేఖర్ జిల్లాకేంద్రంలోని నల్లకుంటకాలనీకి చేరుకొని విచారణ చేశారు. శనివారం ఉదయం 10:45గంటలకు జిల్లాకేంద్రంలోని ధరూర్ మెట్టు తిక్కసాబ్దర్గా వద్ద అబ్దుల్లా భార్య సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అబ్దుల్లాతో 15ఏండ్ల కిందట మహబూబ్‌బీతో పెద్దల సమక్షంలో పెబ్బేరు మండలం బూడిదపాడులో వివాహమైంది.
బతుకుదెరువు కోసం కొడుకు హైమద్‌ను తీసుకొని 12ఏండ్ల కిందట గద్వాలకు వచ్చి నల్లకుంటకాలనీలో కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. అబ్దుల్లా మద్యం సేవించి భార్యను అనుమానించేవాడు. నిత్యం గంజి నుంచి కూరగాయలు సరఫరా చేసే ఆటో రఫీతో మహబూబ్బీకి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు హెచ్చరించాడు. వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను శుక్రవారం గుడ్డముక్కతో గొంతుచుట్టూ నులిమి హత్య చేశారు. అనంతరం అబ్దుల్లా సోదరులకు ఫోన్‌చేసి ఫిట్స్ వస్తున్నదని సమాచారం అందించింది. హత్యకు కారకులైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించిట్లు డీఎస్పీ తెలిపారు. గుడ్డముక్క, బైక్, రెండు ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్, ఎస్సై షూకుర్ తదితరులు పాల్గొన్నారు.