మహబూబ్‌నగర్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఫార్మా కంపెనీ నెలకొల్పేందుకు భూసేకరణపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్, కాడ స్పెషల్ ఆఫీసర్‌తోపాటు మరికొందరిపై స్థానికులు దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తెల్లవారుజామున గిరిజన తండాలపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 2:30 గంటల సమయంలో దాదాపు 300 మంది పోలీస్ బలగాలతో చేరుకున్నారు. ఇండ్లలోంచి బయటకు లాగి అదుపులోకి తీసుకొన్నారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, రోటిబండతండాను చుట్టుముట్టి అరెస్టుల పర్వం కొనసాగించారు. కాళ్లావేళ్లా పడినా పోలీసులు కనికరించలేదు. ఇళ్లల్లో ఉన్న మగవాళ్లందరినీ లాక్కెళ్లారు. అర్ధరాత్రి ఒక్కసారిగా భారీగా పోలీసు బలగాలు తండాల్లోకి ప్రవేశించడంతో స్థానికులు భయాందోళన చెందారు. అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేయడం ఏమిటని స్థానిక మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో రెండు గ్రామాలు నిర్మానుశ్యంగా మారాయి.
పథకం ప్రకారం ముందుగా పోలీస్ అధికారులు విద్యుత్ సరఫరాను తొలగించారు. ఆ తర్వాత ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించి సెల్ఫోన్లు పనిచేయకుండా ఉదయం వరకు నెట్‌వర్క్‌ను ఆపేయించారు. ఇదంతా దాడి చేసిన వారిని అరెస్టు చేయడానికే.. అయితే తమ భర్తలు, కొడుకులు, మనమళ్లను తీవ్రవాదుల్లా రాత్రి వేళల్లో వచ్చి తీసుకెళ్లడం ఏమిటని మహిళలు నిలదీశారు. ‘ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వం.. అంటే ఇంత దౌర్జన్యం చేస్తారా’..? అంటూ నిలదీశారు.
‘తీసుకెళ్లి జైల్లో పెట్టి.. మమ్మల్ని చంపిన తర్వాత ఫార్మా కంపెనీలు పెట్టండి’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదుపులో తీసుకున్న గ్రామస్తులను బేషరతుగా వదలాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనలో కుట్రకోణం దాగుందని పోలీసులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం గమనార్హం. అంతేకాకుండా దీనికి కారకుడైన వారి కాల్ డేటాను సేకరించి ఇదంతా పథకం ప్రకారం చేసినట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
సీఎం నియోజకవర్గంలో పోలీస్‌రాజ్యం నడుస్తుందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా లగచర్లలో బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీఆర్ఎస్ బృందాన్ని వికారాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ డీకే అరుణ బుధవారం లగచర్లకు వెళ్లి బాధితులను పరామర్శించి వారికి మద్దతు తెలిపేందుకు వెళుతున్నట్లు మీడియాకు వివరించారు.
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం రోటిబండతండా, లగచర్లలో అర్ధరాత్రి పోలీసులు గ్రామాల్లోకి ప్రవేశించి కనపడిన వాళ్లందరినీ అదుపులోకి తీసుకొన్నా రు. కొందరి ఇండ్లల్లోకి చొరబడి బయటికి తీసుకొచ్చి చితకబాదుతూ డీసీఎం వాహనంలో ఎక్కించా రు. కాళ్లావేళ్లా పడినా వినకుం డా అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అరెస్టుల పర్వం కొనసాగింది. అదుపులోకి తీసుకున్న వారందరినీ పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదని, ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకొని కలెక్టర్, ఇతర అధికారులపై పలువురు దాడులు చేసిన విషయం విదితమే. ఈ ఘటనకు పాల్పడిన నాలుగు కేసులు నమోదు చేసినట్లు వికారాబాద్ ఎస్పీ ప్రకటించారు.
లగచర్లలో అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన సురేశ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనకు తానే కారణమని పోలీసు యంత్రంగా ఆరోపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం తమ భూములను లాక్కోవద్దని సురేశ్ కొన్ని నెలలుగా గిరిజన తండాలను ఏకం చేసి ఆందోళన చేపడుతున్నారు. ఈ ఫార్మా క్లస్టర్‌పై ఎక్కడ ప్రజాభిప్రాయం జరిగినా అక్కడికి గిరిజనులను తీసుకువెళ్లి వారితో ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలతో సంబంధం ఉన్నదని పోలీసులు ఆరోపిస్తూ కాల్‌డేటా సేకరించినట్లు సోష ల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అసలు వ్య వహారాన్ని కప్పిపుచ్చేందుకు సీఎంవో ఆదేశాలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత లు మండిపడుతున్నారు.
ఫార్మా బాధితులను సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీఆర్ఎస్ బృందాన్ని వికారాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. వారిని మన్నెగూడ వద్ద నిలువరించి వెనక్కి పంపించి వేశారు. గ్రామానికి వెళితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, అందుకే వెనక్కి పంపినట్లు పోలీసు యంత్రాంగం ప్రకటించింది. కాగా సీఎం సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం ఏకంగా కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేసిన ఘటనను పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకొన్నారు. దీనిపై అదనపు డీజీ మహేశ్ భగవత్‌కు నివేదిక సమర్పించాలని డీజీపీ ఆదేశించారు. లగచర్లలో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీని గిరిజనులు వ్యతిరేకించడంతో దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్ర రాజధానిలో వికారాబాద్ జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. మొత్తంపైన సీఎం సొంత నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న కంపెనీపై సర్వ త్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అర్ధరాత్రి 2 గంటలకు 30 మంది పోలీసులు మా ఇంటి తలుపును కొట్టారు. నేను తలుపు తెరిచిన వెంటనే నా భర్తను పోలీసు లు బలవంతంగా తీసుకెళ్లారు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. నా భర్తను తీసుకెళ్లొద్దని ఎం త చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. మా ఆయన ఉదయం.. సాయంత్రం పాలబండికి పోతాడని, ఆయన ఎవరి జోలికిపోడన్నా.. పోలీసులు వినిపించుకోలే. పోలీస్ వచ్చి డోరు తీస్తారా..? పగలగొట్టలా? అని బెదిరించారు. తండాలో ఎవరూ లేరు.. నాకు ఏమైనైతే.. ఎవరు చూసుకుంటారు.. మా భూములు ఉన్నాయి.. అని మాపై దౌర్జన్యం చేస్తున్నారు. మా ఊరుపై బాంబు వేసి మా అందరి ని చంపేసి భూములను తీసుకోండి. నా భర్తను రాత్రి వరకు అప్పగించపోతే నేనే చనిపోతాను..
– జ్యోతి, పులిచర్ల తండా
మంగళవారం కొడుకు పుట్టినరోజు కావడంతో తన భర్తతో వెంకటేశ్‌తో కలిసి నేను లగచర్లలోని అత్తగారింటికి వచ్చాం. అర్ధరాత్రి దాటాక అకస్మాత్తుగా పోలీసులు ఇంటిపైకి వచ్చి మా ఆయన్ను అరె స్టు చేసి తీసుకెళ్లారు. ఎందుకు అరె స్టు చేస్తున్నారు.. ఉదయం ఇం ట్లో మా కొడుకు బర్తుడే ఉన్నదని చెప్పి నా వినిపించుకోలేదు. మా ఇంటాయన అరెస్టుతో ఇంట్లో శు భకా ర్యం నిలిచిపోయింది. ఇంట్లో ఎ లాంటి పండుగ జరుపుకోకుండా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నానంటూ కన్నీరు పెట్టుకున్నది.
– తుడుం భాగ్యశ్రీ, లగచర్ల
ఉన్నత అధికారులపై దాడి చేశారని చెబుతూ లగచర్ల, రోటిబండతండాలో అర్ధరాత్రి అరెస్టుల పర్వం కొనసాగింది. తెల్లవారుజామున ఈ రెండు తండాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. కదిలిస్తే కన్నీళ్లే సమాధానమిస్తున్నాయి. తమ వాళ్లేమైనా తీవ్రవాదులా.. అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లడానికి అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. తీసుకు వెళ్లిన వారిని బేషరతుగా వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాయకష్టం చేసి సంపాదించిన భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. విలువైన భూములు ఇచ్చి ఫార్మాసిటీలో బాత్రూంలో కడగాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా ఫార్మసిటీకి భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పిన పాపానికి ఆ తండాలపై ప్రభుత్వం కక్ష కట్టిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.