హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో రిజర్వేషన్ల అమలు తీరును సమీక్షించాలని రాష్ట్ర బీసీ కమిషన్ నిర్ణయించింది. బుధవారం ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. పెండింగ్ దస్త్రాల పరిష్కారానికి అవసరమైన సమాచారాన్ని సంబంధిత విభాగాల నుంచి తెప్పించాలని అధికారులను కమిషన్ ఆదేశించింది.
23న ఎస్పీడీసీఎల్, 24న జెన్కో, ట్రాన్స్‌కో, 26న ఎన్పీడీసీఎల్ కార్యాలయాలను సందర్శించి రిజర్వేషన్ల అమలు తీరుపై సమీక్షించాలని కమిషన్ నిర్ణయించింది. రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నట్టు బీసీ ఉద్యోగ సంఘాలు గతంలో కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది.