రైతుభరోసా సాయాన్ని ప్రభుత్వం అరకొరగానే అందిస్తున్నది. మొదలై 40 రోజులు దాటినా ఇప్పటి వరకు చాలా మంది ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబం ధించి మొత్తం 1,95,164 మంది రైతులు వివిధ పంటలు సాగు చేశారు. వీరిలో 1,68,250 రైతులకు రైతుభరోసా నిధులు రూ. 165,72,06,084 ట్రెజరీకి పంపినట్లుగా సర్కారు చెబుతోంది. వీరిలో మార్చి 2వ తేదీ వరకు 1,22,937 మందికి రూ.91, 23,74,261 బ్యాంకుల్లో జమయ్యాయి. ఇంకా 72 వేల మందికి సాయం అందాల్సి ఉన్నది.
వనపర్తి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సర్కారు రైతన్నకు వెన్నుదన్నుగా నిలువగా.. ఏడాదిన్నర పాలనలోనే కాంగ్రెస్ సర్కారు రైతన్నకు వెన్నుపోటు పొడిచింది. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పా.. ఆచరణలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ ఫలితంగానే నిత్యం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితులు దాపురించాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏడాదికి రైతుభరోసా పెట్టుబడి సాయంగా రూ.15వేలు ఇస్తామని గొప్పలు చెప్పి తీరా రెండు పంటలు ఎగ్గొట్టి చివరకు రూ.12వేలు ఇస్తామని చెప్పారు. అందులోనూ కేవలం కొందరికి మాత్రమే ఇవ్వగా, ఇంకా చాలా మంది రైతులకు రాకపోవడంతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రైతు భరోసానే కాకుండా 8నెలలుగా అర్హత ఉండి రుణమాఫీ కాని రైతులు సైతం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. మూడెకరాల వరకే వేశామంటూ చెబుతున్నా రైతులకు స్పష్టత లేదు.
వనపర్తి జిల్లాలో 1,95,164 మంది రైతులు యాసంగి సా గుబడులను చేపట్టారు. ఇలా సాగు చేసిన రైతులకు ప్రభు త్వం రైతు భరోసాను అందిస్తామని ప్రకటించింది. గతంలో కంటే మరో మూడు వేలు అధికంగా ఎకరాకు ఇస్తామని ఎ న్నికల ముందు హామీ ఇచ్చినా తీరా అది అమలు చేయలేదు. ప్రతి ఏటా రెండు పంటలకు టంచన్‌గా రైతుబంధు తీసుకున్న అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో నిరాశలో పడ్డారు. హామీల ప్రకటనలు…ప్రసంగాల హోరులో కాంగ్రెస్ నాయకులను నమ్మిన రైతులకు రైతుబంధును అందించడంలో ఇక్కట్లకు గురి చేస్తూ వస్తున్నారు.
జిల్లాలో 1.95 లక్షల మంది రైతులుంటే.. వీరిలో 1,68,250 రైతులకు రైతుభరోసా నిధులు రూ. 165,72,06,084లు ట్రెజరీకి పంపినట్లుగా ప్రభుత్వం చెబుతున్నది. అలాగే వీరిలో మార్చి 2వ తేదీ వరకు 1,22,937 మందికి రూ.91, 23,74,261 బ్యాంకుల్లో జమ అయినట్లు లెక్కఉన్నాయి. వీరిలో 714 మంది రైతులకు బ్యాంకుల్లో అకౌంట్లు సక్రమంగా లేకపోవడం, ఇతర కారణాలతో రూ.46,52,044 జమ అవ్వలేదని గుర్తించారు. అకౌంట్లలో పడ్డాయని అధికారులు చెబుతు న్నా చాలా మంది రైతులు బ్యాంకులకు వెళ్లి పడలేదని తెలుసుకొని నిట్టూర్చుస్తూ వెనుతిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే.. తప్పా చేతల్లో లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చెబుతున్న లెక్క ప్రకారం ఇంకా 72 వేల మంది రైతులకు రైతు భరోసా అందలేదు.ఇప్పటికే వేశామని చెబుతున్న లెక్కల్లోని రైతులే వందలాది మంది బ్యాంకుకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు.ఇప్పటి వరకు మూడెకరాల భూములున్న రైతుల వరకే భరోసా వేసినట్లు ప్రభుత్వమే చెబుతున్నది.ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటన్నది అంతుబట్టడం లేదు.యాసంగిలో నాట్లు వేసిన రైతులు రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఏదో సరే సర్కార్ వేస్తుంది కదా అనుకుంటే వేసిన రైతులది ఒక బాధ ఉంటే,ఇంకా వేయని రైతులది మరోబాదలా ఉంది. వీటన్నిటినీ పరిశీలిస్తే…గడువులేని రైతు భరోసాగా ప్రభుత్వ వ్యవహారం కనిపిస్తున్నదని రైతన్నలు విమర్శలు చేస్తున్నారు.
రైతుబంధు మొత్తం పంటలు పండని భూములకే బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిందని తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ ఏకంగా ఈ పథకాన్ని ఎత్తివేయాలని ఎత్తులు వేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుబంధు అంతా బోగస్ అంటూ రైతులకు ఉపయోగం లేదని,కేవలం బినామీలకు మాత్రమే లాభం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెట్టారు. తీరా ప్రభుత్వంలోకి కాంగ్రెస్ వచ్చిన అనంతరం రైతుబంధు పడిన భూముల లెక్కలను తీశారు.
జిల్లాలో ప్రతి సీజన్‌కు బీఆర్ఎస్ సర్కార్ 226 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. ఈ లెక్కన అధికారులు జిల్లాలో గుర్తించిన రోడ్లు,రియల్ ఎస్టేట్ రంగంలోని ప్లాట్లు,భీమా కాల్వలను గుర్తించి తీసివేస్తే 3415 ఎకరాలు లెక్కలో నుంచి తొలగించారు. వీటిలో కేవలం రెండు మండలాలు పెబ్బేరు,వనపర్తిలలోనే 1200 ఎకరాలున్నాయి. మిగిలిన మండలాల్లో వంద ఎకరాలకు అటు..ఇటుగా ఉన్నాయి. ఇలా ప్రతి సీజన్‌కు ప్రభుత్వం వేస్తున్న రైతుబంధు డబ్బులకు పర్సంటేజీ లెక్కన తీస్తే ….కేవలం ఒక్క శాతం నిధులు మాత్రమే సేద్యం చేయని భూములకు వచ్చినట్లు లెక్క తేలింది. బదనాం జాస్తీ…ఆచరణలో నాస్తీ అన్నట్లు లెక్కలు తేలిన అనంతరం రైతుబంధు దుర్వినియోగం అయ్యిందనే ప్రసంగాలు మూగబోయాయి.
అయిజ, మార్చి 6 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఆర్డీఎస్ ఆయకట్టుతోపాటు క ర్నూల్ జిల్లాలో సాగైన పంటల కు.. పలు గ్రామాలకు తాగునీటి కోసం నీటిని వదులుతున్నారు. ఆర్డీఎస్, కేసీ కెనాల్ 4 వేల క్యూసెక్కులు వదలనున్నట్లు ఈఈ విజయ్‌రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రతి ఎకరానికి రూ.15వేలు ఇస్తానని చెప్పి కోత పెట్టి రూ.12వేలకు చేసిండ్రు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతున్నా ఇప్పటికీ రైతుభరోసా ఊసే లేదు. నాకు 2.09 ఎకరాల భూమి ఉన్నది. మూడు పంటల నుంచి రైతుభరోసా జాడలేదు. ఇంతకూ రైతుభరోసా వస్తదా, రాదా అన్న అనుమానం నెలకొన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నది. కానీ కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు.
– ఎస్.శాంతన్న రైతు, దొడగుంటపల్లి, పెద్దమందడి
నాకు రెండెకరాల 34గుంటల భూమి ఉన్నది. పెట్టుబడులకు అరిగోస పడాల్సి వస్తున్నది. రూ.15వేలు పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్ ఓట్లప్పుడు చెప్పిండ్రు. ఇప్పుడేమో రూ.12 వేలంటూ అవి కూడా ఇస్తలేరు. మూడెకరాల వరకు డబ్బులిచ్చినమని సర్కారోళ్లు చెబుతుండ్రు. నాకున్న రెండెకరాల 34గుంటలకే ఇప్పటికీ డబ్బులు జమకాలేదు. మిగతా రైతుల పరిస్థితి ఎట్లుందో, ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఇంతకుముందే కేసీఆర్ సారు పాలనే బాగుండే. పెట్టుబడికి ఠంచన్‌గా డబ్బులు ఇస్తుండే. కరోనా టైంలో కూడా డబ్బులు పడినయి.
– మాసన్న, రైతు, కొత్తపల్లి గ్రామం, మదనాపురం మండలం