గద్వాల, మే 4 : ఆరుగాలం వ్యయప్రయాసాలకోర్చి రైతులు పండించిన పంటలు మిల్లర్లకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కాసులు కురిపిస్తున్నాయి. సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.500ల బోనస్ ఇస్తామని చెబుతున్నా కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట రైతులను నిర్వాహకులు నిండా ముంచుతున్నారు. ధాన్యం 14నుంచి 17శాతం తేమ ఉంటే తరుగు తీయకుండా కొనుగోలు చేయాలి. నిబంధనలను తుంగలో తొక్కి గద్వాల, ధరూర్, కేటీదొడ్డి మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలుకు తెస్తే తీరా ఏదో ఒక సాకు చెబుతూ మాకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా కొనుగోలు కేంద్రాల్లో 40కేజీల బస్తాను నింపి వరిధాన్యం తూకం వేస్తారు. సంచి బరువు 580గ్రాములు ఉంటుంది. నిబంధనల ప్రకారం 40.580 గ్రాముల తూకం వేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి 40కేజీల బస్తాకు 41.600 గ్రాముల తూకం వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని వాపోతున్నారు. ఇలా 40కేజీల బస్తాకు కేజీ అదనంగా తీయడం వల్ల క్వింటాకు రెండున్నర కేజీలు అదనంగా రైతుల ధాన్యం తూకం వేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
కొనుగోలు సెంటర్లో ఎక్కువ తూకం వేసిన ధాన్యం రికార్డుల్లో తమకు అనుకూలమైన రైతుల పేరిట నమోదు చేసి వాటిని కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు మిల్లర్లకు విక్రయిస్తున్నారు. దీనిపై వచ్చే బోనస్‌ను మిల్లర్లతోపాటు కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు పంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు, ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు కలిసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇంత జరుగుతున్నా తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు పత్తా లేకుండా పోతున్నారు.
ఎక్కువ తూకం ఎందుకు వేస్తున్నారని రైతులు ఎవరైనా ప్రశ్నిస్తే మీ ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంది, ఇంకా ఆరబెట్టాలని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ, పీఏసీసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. యాసంగి సీజన్లో లక్షా 75వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటి వరకు అన్ని కొనుగోలు సెంటర్ల ద్వారా 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారులు చెప్పారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో అకాల వర్షాలతో నష్టపోతున్నామని వాపోతున్నారు.