అయిజ, సెప్టెంబర్ 10 : అయిజ మండలంలో పిడుగు పాటు తీవ్ర విషాదం నింపింది. బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతోపాటు భారీ ఉరుములు ఉరుమడంతో సీడ్పత్తి క్రాస్ చేసేందుకు వచ్చిన కూలీలు వర్షం నుంచి రక్షించుకునేందుకు తాటిచెట్టు కిందకు చేరడంతో తాటిచెట్టుపై ఒక్కసారి పిడుగు పడటంతో అక్కడ ఉన్న ఏడు మందికి షాక్ తగలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మరొకరు గాయాలతో బయటపడ్డారు. మండలంలోని భూంపురం గ్రామంలో తిమ్మప్ప అనే రైతు పొలంలో సీడ్పత్తి పని చేసేందుకు దాదాపు 20 మంది భూంపురం, పులికల్ గ్రామాలకు కూలీలు వెళ్లారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురడవంతో తలదాచుకునేందుకు తాటిచెట్టు కిందకు కొందరు, వేపచెట్టు కిందకు వెళ్లారు. తీవ్ర శబ్దంతో కూడిన పిడుగు తాటిచెట్టుపై పడటంతో తాటిచెట్టు కిందకు చేరిన భూంపురం గ్రామానికి సర్వేశ్ (19), పార్వతి (38) పులికల్ గ్రామానికి చెందిన సౌభాగ్య (38) అక్కడిక్కడే మృతి చెందగా, అదే గ్రామానికి రాజు, జ్యోతి, భూంపురానికి చెందిన కావేరిలకు తీవ్ర గాయాల య్యాయి. పిడుగు శబ్దాలకు తేరుకున్న తోటి కూలీలు, గ్రామస్తులు క్షతగాత్రులను వెంటనే అయిజలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు.
డాక్టర్లు పరీక్షించి ముగ్గురు అప్పటికే మృతి చెందారని, పులికల్కు చెందిన రాజు, జ్యోతి భార్యాభర్తలు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండడంతో గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, భూంపురానికి చెందిన కావేరిని కర్నూల్ దవాఖానకు తరలించారు. భూంపురానికి చెంది న తిమ్మప్పకు స్వల్ప గాయాలు కావడంతో అయిజలోనే చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధు మిత్రు లు అయిజలోని ప్రైవేటు దవాఖానకు భారీగా చేరుకున్నారు. దవాఖాన ప్రాంగణం మృతుల కుటుంబాల రోదనలతో మిన్నంటింది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకున్నది.
భూంపురం గ్రామానికి చెందిన తిప్పమ్మ, ఆంజనేయులుకు సర్వేశ్ (19) కుమారుడు కాగా, ఇద్ద రు ఆడపిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడిపెట్టించా యి. మృతురాలు పార్వతి (38) భర్త 18 ఏండ్ల కిందటే ప్రమాదంలో కాలు పోగొట్టుకోవడంతో కుటుంబం ఆమెపై ఆధారపడి జీవిస్తున్నది. ఆమె ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని కూలీనాలి చేస్తూ నెట్టుకొస్తుంది. పులికల్కు చెందిన సౌభాగ్య (35) భర్త తిమ్మోతి మేస్త్రి పని చేస్తుండగా, ఆమె కూలి పనులకు వెళ్తుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల దవాఖానకు తరలించారు.