రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సై ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 26 మంది అభ్యర్థులు సత్తాచాటారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న కసితో పట్టుబట్టి చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇంటిని వదిలి.. కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ పేదింటికి చెందిన కుసుమాలు తమ కలలను సాకారం చేసుకున్నారు. కొందరు అభ్యర్థులు మొదటి ప్రయత్నంలోనే కొలువు కొట్టారు. వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆనందాల్లో మునిగితేలుతున్నారు. ఉద్యోగ కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కొలువులు సాధించిన వారిని ఉపాధ్యాయులు, నాయకులు, గ్రామస్తులు అభినందించారు.
– మహబూబ్‌నగర్ నెట్వర్క్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ)
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 7 : తెలంగాణ రాష్ట్ర పో లీసు నియామక బోర్డు ఎస్సై తుది ఫలితాల్లో ఉమ్మడి జి ల్లా విద్యార్థులు సత్తాచాటారు. జోగుళాంబ జోన్లో 26 మంది ఎస్సైలుగా ఎంపికైనట్లు డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 587 పోస్టులకు గానూ 434 మంది పురుషులు, 153మంది మహిళలు ఎంపికయ్యారన్నారు.
చీకటి బతుకులో వెలుగు నింపిన ‘తారక’..
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 7 : తండ్రి గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తల్లి వ్యవసాయ కూలి పనులు చేస్తున్నది. ఇలాంటి చీకటి బతుకుల్లో పెరిగిన అడ్డాకుల మండలంలోని బలీదుపల్లికి చెందిన బి.వెంకటేశ్వరమ్మ, వెంకటేశ్‌యాదవ్ కూతురు తారక ఎస్సై తుది ఫలితాల్లో సివిల్ కేటగిరి, జోన్-7 జోగుళాంబ పరిధిలో జనరల్ మహిళా విభాగంలో ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సతీమణి సింగిరెడ్డి వాసంతి తారకను అభినందించారు.
స్నేహితులిద్దరూ సాధించారు..
వడ్డేపల్లి, ఆగస్టు 7 : మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు హైదరాబాద్‌లో ఒక రూమ్ అద్దెకు తీసుకొని శిక్షణ పొంది పట్టుదలతో చదివి ఎస్సైలుగా ఎంపికయ్యారు. రామాపురం గ్రామానికి చెందిన బాబురెడ్డి, మధులతల కుమారుడు ఇంద్రారెడ్డి సివిల్ ఇంజినీర్‌గా సిద్దిపేటలో పనిచేస్తున్నప్పటికీ ఎస్సై కావాలనే లక్ష్యంగా బాల్యమిత్రుడైన అదే గ్రామానికి చెందిన హోజల్ జయన్న, పద్మావతిల కుమారుడు ఆర్ఎన్ చంద్రశేఖర్‌తో కలిసి హైదరాబాద్‌లో అద్దె గదిలో ఉంటూ చదివి ఎస్సైగా ఎంపికయ్యారు. 251 మార్కులు సాధించి బెటాలియన్ ఎస్సైగా ఇంద్రారెడ్డి, 248 మార్కులతో ఏఆర్ ఎస్సైగా ఆర్ఎన్ చంద్రశేఖర్ ఎంపికయ్యారు. దీంతో వారిని తల్లితండ్రులు, స్నేహితులు అభినందించారు.
భిక్షగాడి కుమారుడు ఎస్సైగా..
పెబ్బేరు, ఆగస్టు 7 : తండ్రి భిక్షాటన చేస్తుండగాచ తల్లి పాతబట్టల మూట నెత్తిన పెట్టుకొని ఊరూరా తిరుగుతూ విక్రయిస్తున్నది. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో ని కిష్టారెడ్డిపేట బుడగజంగాల కాలనీలో నివాసముంటున్న తిరుపతమ్మ, బుచ్చన్నల కుమారుడు కిరణ్‌కుమార్ ఎలాంటి కోచింగ్ లేకుండా స్వతహాగా ఎస్సై పరీక్షకు సన్నద్ధమై ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో కిరణ్‌కుమార్‌ను సన్మానించారు.
తండ్రి పంచాయతీ కార్మికుడు.. కొడుకు ఎస్సై
మదనాపురం, ఆగస్టు 7 : మండలంలోని గోపన్‌పేట గ్రామ పంచాయతీ కార్మికుడు వెంకటన్న, సాయమ్మల కుమారుడు కావలి భాస్కర్ సివిల్ కేటగిరి జోన్-7 జోగుళాంబ పరిధిలో జనరల్ కేటగిరీలో ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. కాగా, రెండు నెలల కిందట ప్రకటించిన ఆర్ఆర్బీ ఫలితాల్లో ట్రాక్‌మెన్ ఉద్యోగం పొందాడు. భాస్కర్‌ను సర్పంచ్ ఆంజనేయులు, తల్లిదండ్రులు అభినందించాడు.
కానిస్టేబుల్ కుమారుడు ఎస్సైగా..
పాన్‌గల్, ఆగస్టు 7 : మండలంలోని కేతేపల్లికి చెందిన రాజేందర్‌రెడ్డి, అరుణ దంపతుల కుమారుడు గిరి మనోహర్‌రెడ్డి సివిల్ఎస్సై పోస్టుకు ఎంపికయ్యారు. తండ్రి రాజేందర్‌రెడ్డి ప్రస్తుతం వనపర్తి సీఐ కార్యాలయంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గిరిమనోహర్రెడ్డిని గ్రామస్తులు అభినందించారు.
తండ్రి మేస్త్రీ.. కొడుకు ఎస్సై
భూత్పూర్, ఆగస్టు 7 : మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు గెగ్యాతండాకు చెందిన డెగావత్ రాములునాయక్ ఎస్సై పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. రాములునాయక్ తండ్రి సూర్యనాయక్ మేస్త్రీ పనిచేస్తుండగా, తల్లి బుజ్జి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నది. రాములునాయక్ ఉద్యోగం సాధించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
ఏఆర్ కానిస్టేబుల్ ఎస్సైగా ఎంపిక..
వెల్దండ, ఆగస్టు 7 : మండలంలోని బొల్లంపల్లికి చెందిన కాన్గుల శేఖర్ ఎస్సై ఉద్యోగానికి అర్హత సాధించాడు. బొల్లంపల్లికి చెందిన శేఖర్ హైదరాబాద్‌లోని జోనల్ -6లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్సై పరీక్షలో అర్హత సాధించి హైదరాబాద్‌లో చార్మినార్ జోన్-6 నుంచి ఎస్సైగా అర్హత పొందాడు.
బెటాలియన్ ఎస్సైగా నరేశ్..
చిన్నంబావి, ఆగస్టు 7 : మండలంలోని వెల్టూరు గ్రామానికి చెందిన మద్దిలేటి గద్వాల, వనపర్తి పట్టణాల్లో పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి పంపిణీలో భాగంగా మద్దిలేటికి భూమి వచ్చింది. దీంతో వ్యవసాయం చేసుకుంటూ తన కుమారులను ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కుమారుడు అజయ్‌కుమార్ ఎంబీఏ చదువుతూ ఎస్సై పరీక్ష రాశాడు. ఫలితాల్లో బెటాలియన్ ఎస్సైగా ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అగ్నిమాపక విభాగంలో ఎస్సైగా..
మల్దకల్, ఆగస్టు 7 : మండలంలోని బిజ్వారానికి చెందిన బతుకన్న, రూతమ్మల కుమారుడు సునీల్ అగ్నిమాపక విభాగంలో ఎస్సైగా ఉద్యోగం పొందా డు. దీంతో సర్పంచ్, గ్రామస్తు లు, తల్లిదండ్రులు సునీల్ అభినందించారు.
నాగనూలు విద్యార్థి ఎంపిక..
నాగర్‌కర్నూల్, ఆగస్టు 7 : నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరిధిలోని నాగనూలుకు చెందిన రాజశేఖర్ ఎస్సై ఉద్యోగం సాధించాడు. వెంకట్రాములు, నాగమ్మ దంపతుల కుమారుడైన రాజశేఖర్ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకొని పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.
అయిజకు చెందిన జాహంగీర్..
అయిజ, ఆగస్టు 7 : అయిజ మున్సిపాలిటీకి చెందిన జాహంగీర్ సివిల్ ఎస్సైగా ఎంపికయ్యారు. ఆర్డీఎస్లో వర్క్ ఇన్స్పెక్టర్గా విధు లు నిర్వహిస్తున్న శాలిపాష, మెహరాజున్నీసా దంపతుల తనయుడు జాహంగీర్ ఎస్సైగా ఎంపికకావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఎన్సీసీ కోటాలో కృష్ణాజీ ఎంపిక..
జడ్చర్ల టౌన్, ఆగస్టు 7 : మండలంలోని నసుర్లాబాద్కు చెందిన లింగోజీ, జయమ్మ దంపతుల రెండో కుమారుడు కృష్ణాజీ ఎంఏ జర్నలిజం కోర్సు ప్రవేశపరీక్ష రాసి ఉస్మానియా యూనివర్సిటీలో సీటు దక్కించుకుని చదువుతున్నాడు. అక్కడే ఎస్సై ఉద్యోగం కోసం ప్రిపేరై పరీక్ష రాయగా, ఎన్సీసీ కోటాలో ఎస్సైగా ఎంపికయ్యాడు. తండ్రి లింగోజీ చికెన్షాపు నడిపిస్తున్నాడు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి కృష్ణాజీ ఎస్సైగా ఎంపిక కావడంతో అధ్యాపకులు సన్మానించారు.
కోదండాపూర్‌కు చెందిన శశిధర్..
ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 7 : ఇటిక్యాల మండలం కోదండాపూర్‌కు చెందిన శశిధర్ ఎస్సైగా ఎంపికయ్యారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
రెండో ప్రయత్నంలో ఎస్సైగా..
ఉండవెల్లి, ఆగస్టు 7 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై ఫలితాల్లో ఉండవెల్లికి చెందిన రాఘురాములు, మంగమ్మ దంపతుల కుమారుడు వేణుగోపాల్ ఉద్యోగం సాధించాడు. మొదటి సారి ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష రాయగా ఎంపిక కాలేదు. రెండోసారి సివిల్ ఎస్సైగా ఎంపికకావడంతో గ్రామస్తులు అభినందించారు.
కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా..
వంగూరు, ఆగస్టు 7 : మండలంలోని ఉప్పల్పహాడ్కు చెందిన జిల్లెల్ల నరేశ్ సివిల్ ఎస్సైగా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, మల్లయ్యలు కూలి పనులు చేస్తూ చదివించారు. నరేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి బీటెక్ పూర్తి చేశాడు. 2008లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందాడు. ఎస్సై పరీక్ష రాసి ఉద్యోగం పొందడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు.
మెరిసిన పేదింటి కుసుమాలు..
పెద్దకొత్తపల్లి, ఆగస్టు 7 : ఎస్సై ఫలితాల్లో మండలానికి చెందిన పేదింటి కుసుమాలు మెరిశాయి. పెద్దకొత్తపల్లికి చెందిన బాలస్వామి, లక్ష్మి దంపతుల కూతురు టి.రేవతి సివిల్ కేటగిరి జోన్-7 జోగుళాంబ పరిధిలోని జనరల్ కేటగిరీలో ఎస్సై ఉద్యోగం సాధించింది. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేసింది. అలాగే మండలంలోని మారెడుమాన్దిన్నెకు చెందిన మేకల లింగస్వామి ఎస్సై ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం రిజర్వు కానిస్టేబుల్‌గా లింగస్వామి విధులు నిర్వహిస్తున్నారు. వీరి ఎంపికపై జెడ్పీటీటీ గౌరమ్మ, బీఆర్ఎస్ నాయకులు నర్సింహ, రాజశేఖర్, నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.
గ్రూప్-1కు ప్రిపేరై.. ఎస్సైగా ఎంపిక
గద్వాల అర్బన్, ఆగస్టు 7 : జిల్లా కేంద్రానికి చెందిన పద్మావతి, వీరారెడ్డి దంపతుల కూ తురు వీణా స్రవంతి ఎస్సై పరీక్షలో 242 మార్కులు సాధించి ఉద్యోగానికి ఎంపికైంది. గ్రూప్-1లో శిక్షణ తీసుకుంటూ ఎస్సై పరీక్ష రాసి ఎంపికైనట్లు ఆమె తెలిపింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, స్థానికులు ఆమెను అభినందించారు.
ఎస్సైగా గోపల్దిన్నెవాసి..
వీపనగండ్ల, ఆగస్టు 7 : మండలంలోని గోపల్‌దిన్నెకు చెందిన కుమ్మరి భాస్కర్ రెండో కూతురు బి.స్వాతి ఎస్సై ఉద్యోగం పొందింది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.