వేరుశనగ పంటను పండించడంలో వనపర్తి జిల్లా రికార్డును మూటగట్టుకున్నది. కానీ నేడు మళ్లా వెనక్కి వెళ్తున్నది. గతంలో ఉన్న సాగుబడుల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఏడాది పూర్తిగా తగ్గిపోయింది. ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడం కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సబ్సిడీపై పల్లీ పంపిణీకి చెక్ పెట్టడంతో రైతన్నలు పంట సాగుకు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. దీంతో వేరుశనగ సాగు గణనీయంగా పడిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేయడంతో నాడు వేల ఎకరాల్లో పండిన పల్లీ.. నేడు కాంగ్రెస్ హయాంలో గణనీయంగా తగ్గిపోయింది.
– వనపర్తి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి వనరులు కల్పించింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా అన్ని చర్యలు తీసుకున్నది. రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా, సబ్సిడీపై విత్తనాలు.. పండిన పంటకు మద్దతు ధర చెల్లింపు.. పుష్కలంగా సాగునీరు.. వంటి చర్యలతో వ్యవసాయం పండుగలా సాగింది. అంతకుముందు వనపర్తి జిల్లాలోని 14 మండలాలకుగానూ కేవలం కొన్ని మండలాలకు మాత్రమే జూరాల ఆధారిత నీరు అందేది. మిగితా మండలాలకు అందని పరిస్థితి. తెలంగాణ ఏర్పడ్డాక సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వడం, పెండింగ్ ప్రాజెక్టులను సైతం పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీరందించారు.
దీంతో ఒక్కసారిగా సాగుబడులు భారీగా పెరిగాయి. జిల్లాలో జియోగ్రాఫికల్ ప్రకారం 5.40 లక్షల ఎకరాల భూములుంటే.. వీటిలో 4.31 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైనవిగా వ్యవసాయశాఖ అంచనాలున్నాయి. ఈ మేరకు గడిచిన వానకాలంలో 2.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేశారు. ఇందులో 1.96 లక్షల ఎకరాల్లో కేవలం వరిని సాగు చేశారు. దీని మేరకు ఎక్కువ శాతం రైతులు వరి వైపు మొగ్గు చూపుతుండగా.. ఇతర పంటలను కేవలం పదుల సంఖ్యలోనే సాగుబడులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఐదారేళ్ల వెనక్కి వెళితే వేరుశనగను 60 వేల ఎకరాలకుపైగా సాగు చేసిన రైతులు ప్రస్తుతం పూర్తిగా తగ్గించారు.
జిల్లాలో రైతాంగం వేరుశనగ సాగుకు పూర్తిగా దూరమవుతోంది. గతంలో 60 నుంచి 70వేల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశారు. కేఎల్ఐ, భీమా ఎత్తిపోతల నీళ్లు సమృద్ధిగా రావడంతో కొత్త ఊపులో భారీగా వేరుశనగ పంటను వేసుకున్నారు. లోతట్టు ప్రాంతం మొదలుకొని ఎత్తయిన గుట్టల ప్రాంతాల్లోని భూముల్లో సహితం వేరుశనగను పండించారు. పెద్దమొత్తంలో సాగుబడులు చేసిన పరిస్థితుల నుంచి రైతులు క్రమంగా ఒక్కొక్క ఏడాది వెనక్కి తగ్గుతూ వచ్చారు. ఇలా గతేడాది యాసంగిలో 18 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తే.. ఈ ఏడాదిలో కేవలం 10వేల ఎకరాల్లోనే సాగు చేసిన అంచనా ఉంది. ఇలా ఇంత భారీ మొత్తంలో పల్లీ పంటకు దూరం కావడానికి రైతులు ఎన్నో కారణాలు చెబుతున్నారు.
వేరుశనగ సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. గతంలో విత్తనాలు వేసే సమయంలో సబ్సిడీపై గ్రామాల్లో లారీల కొద్దీ వేరుశనగను పంపిణీ చేసే పరిస్థితులు ఉండేవి. క్రమంగా సబ్సిడీ ప్రోత్సాహం దూరం కావడం.. విత్తన ధరలు భారీగా పెరగడంతో రైతన్నలు ప్రత్యామ్నాయ దిశగా అడుగులు వేస్తున్నా రు. ఎకరాలో 80 నుంచి 100 కేజీల విత్తనాలను రైతు వేయాలంటే తక్కువలో తక్కువ రూ.10 వేలు (ఎరువులు మినహా) ఖర్చు అవుతోంది. గతంలో సబ్సిడీ ఇస్తుండడంతో రైతులకు భారం అనిపించలేదు. దీనికి తోడు పొలాల్లో అడవి పందులు, కోతుల బెడద సైతం ఆటంకంగా మారాయి. అలాగే మద్దతు ధరలు అం తంతే ఉండటం, తెగుళ్ల బాధలు వెరసి సాగుకు అన్నదాత దూరమయ్యే పరిస్థితులు దాపురించాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో.. అందులో వనపర్తి ప్రాంతంలో పండించే వేరుశనగ పంట అఫ్లోటాక్సిన్ రహితంగా పండుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్‌రెడ్డి ఉన్న సమయంలో శాస్త్రవేత్తల ద్వారా పరీక్షలు చేయించగా ఈ నిజం వెల్లడైంది. ఇక్కడి వేరుశనగలో ఫంగస్ లేకపోవడంతో మార్కెట్లో పల్లీలకు డిమాండ్ ఏర్పడింది. క్వాలిటీ, రుచితోపాటు ఇతర డ్రై పౌడర్స్కు ఈ వేరుశనగను ఉపయోగించే అవకాశం ఉండడంతో ప్రాధాన్యత అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంతలా నాణ్యతగా ఉన్న వేరుశనగ పంట సాగు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రశ్నార్థకమవుతోంది.
జిల్లాలో వేరుశనగ సాగుబడులు భారీగా ఉన్నందునా ఈ ప్రాంతంలో వేరుశనగ పరిశోధన కేంద్రంతోపాటు రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న నిరంజన్‌రెడ్డి కేంద్రం ఏర్పాటుకు శ్రీకా రం చుట్టారు. ఇందులో భాగంగా పెద్దమందడి మండ లం వీరాయిపల్లిలో సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిం చే దిశగా అడుగులు పడ్డాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి శాస్త్రవేత్తల బృందం అప్పట్లో గ్రామానికి వచ్చి పరిశీలన చేసింది. తర్వాత ప్రభుత్వం మారడంతో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు ప్రయత్నం అటకెక్కింది.
వనపర్తి రైతులు పంట మార్పును నిరంతరం చేపడుతుంటారు. అయితే వేరుసెనగ పంట సాగుబడి చాలా వరకు తగ్గింది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఆడవిలో జంతువుల బాధలు ఎక్కువగా ఉండడం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు. అందుకే వేరుశనగ సాగుబడిలో కొంత మార్పు కనిపిస్తుంది.
– గోవింద్‌నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి, వనపర్తి
బుడ్డలు పండితేనే ఆదాయంలో రైతులు పెద్దగా అవుతాడని మా చిన్న తనంలో పెద్దలు చెప్పేటోళ్లు.. కానీ ఇప్పుడు సాగు చేస్తే పైసలు కూడా మిగలని పరిస్థితి. వేసుకు న్నా మనుషుల నుంచి.. జంతువుల నుంచి పంటను కాపాడుకోవాలంటే పొద్దస్తమానం పొలం వద్దే కావలి కాయాలే.. అంతే కా కుండా పిరం పెట్టుబడులు.. కూలీ రేట్లను తలచుకుంటే భయమైతుంది.. అందుకే వరి పంట మాత్రమే వేసుకుంటున్నాం.
– కుర్వ విమలన్న, రైతు, అమరచింత
గత ప్రభుత్వం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు ఇస్తుండ్రి. ఇప్పుడు ఇస్తలేరు. దీని వల్ల బయట విత్తనాలు కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. విత్తనాల కొనుగోలు, ట్రాక్టర్‌కు, కలుపు కూళ్లు, బుడ్డల నూర్పిడికి మోత్తం కలిసి ఎకరా పంట సాగు చేయాలంటే రూ. 30 వేల వరకు ఖర్చు అవుతుంది. అధికంగా పెట్టుబడి అవుతుండడం, వాతావరణం సహకరించక అధిక వర్షాలు పడటం, తెగుళ్లతో దిగుబడి తక్కువగా రావడం వల్ల రైతులు వేరుశనగ సాగు చేయాలంటే ఆసక్తి చూపడం లేదు. అందుకే సాగు విస్తీర్ణం తగ్గుతోంది. గత ప్రభు త్వంలో వ్యవసాయ అధికారులు సకాలంలో కే-6 రకం వేరుశనగ విత్తనాలు క్వింటాకు 45 శాతం సబ్సిడీపై రూ.4,500 అందజేసేది.
దీంతో రైతులకు విత్తనాల కొనుగోలులో పైసలు ఆదా అవుతుండే. విత్తనాలు బయట కొనాలంటే మొత్తం ధర పెట్టాలి. సాగు ఖర్చులకు భయపడి ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు. నేను 4 ఎకరాల్లో పల్లీ వేశాను. అధికఖర్చు, అధిక వర్షాలు, తెగుళ్లతో దిగుబడి చాలా తక్కువగా వచ్చింది. 31 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది.. తక్కువ ధరకే అమ్మాను.. కష్టంపోను పెట్టుబడి మీన పడింది.
– ఆర్.భాస్కర్, రైతు, గోపాల్పేట, వనపర్తి జిల్లా