నాగర్‌కర్నూల్, జూన్ 17 : తనపై వస్తున్న అవినీతిని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొందరు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తూ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. బిజినేపల్లి మండలంలో రూ.100 కోట్లతో చేపట్టే మార్కండేయ లిఫ్ట్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని, ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలతో గిరిజనుల పాదాలను అభిషేకిస్తామన్నారు. గిరిజనుల బతుకులకు భరోసా కల్పించే ప్రాజెక్టు చేపడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
రూ.35 కోట్లతో మిషన్ భగీరథతో తాగునీరు, రూ.90 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, టౌన్‌హాల్, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు, గ్రంథాలయం, బ్రిడ్జి, రోడ్లు.. ఇలా రూ.400 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు. మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభోత్సవం చేయించనున్నట్లు తెలిపారు. గతంలో కళ్లారా చూస్తామా లేదా అనుకున్న అభివృద్ధిని తాము చేతల్లో చూపించామన్నారు. కొందరు బుద్ధి మందగించినోళ్ల మాటలను లెక్కచేయనని, నా జెండా, ఎజెండా నాగర్‌కర్నూల్ అభివృద్ధే అని అన్నారు. సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే పెద్దోడివి అవుతావనుకుంటే నీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. నాగర్‌కర్నూల్ ప్రజలకు ఏం చేయాలో నాకంటూ ఓ విజన్ ఉందని, ఆ దిశగా అభివృద్ధి చేస్తూ పోతానన్నారు. ఇప్పటికే విద్య, వైద్యంపై దృష్టి సారించడం జరిగిందని, త్వరలో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలను తీసుకువస్తానన్నారు. శనివారం బిజినేపల్లిలో నిర్వహించే కేటీఆర్ బహిరంగసభకు నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంత్‌రావు, మున్సిపల్ చైర్మన్ కల్పన ఉన్నారు.