ఏడేళ్లకే సకల విద్యల్లో రాణిస్తున్న గురు సూర్యచంద్
నిత్యం శ్లోకాలు, స్తోత్రాల పఠనం
జనరల్ నాలెడ్జ్లోనూ చురుకుదనం
అబాకస్ అన్ని లెవల్స్‌లో టాప్
పోచమ్మమైదాన్, మే 3 : పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఈ బాలుడు అన్నింట్లో ప్రతిభ చూపుతున్నాడు. చదువుతో పాటు ఆటపాటల్లో ఆరితేరాడు. దేశభక్తి, భక్తిభావం పాటలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నిత్యం శ్లోకాలు పఠించడం, స్తోత్రాలు వల్లించడం అలవాటుగా చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల తర్ఫీదుతో జనరల్ నాలెడ్జ్లోనూ ప్రతిభ చూపుతున్నాడు. అలాగే, అబాకస్‌లో అన్ని లెవల్స్‌లోనూ పట్టు సాధించాడు. సర్కారు బడిలో మూడో తరగతి చదువుతున్న ఏడేళ్ల దొంతుల గురు సూర్యచంద్ అనే బాలుడి చురుకుదనం ఇది.
గ్రేటర్ వరంగల్ చార్‌బౌళి ప్రాంతానికి చెందిన దొంతుల రామ్మోహన్-తేజస్వీని దంపతుల కుమారుడు గురు సూర్య చంద్ చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్లోనూ ప్రత్యేకత చాటుతున్నాడు. ఎల్బీ నగర్‌లోని ప్రభుత్వ చార్‌బౌళి పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న గురు సూర్య చంద్ దేనినైనా ఒకసారి వినగానే వెంటనే చెబుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. పాఠశాలలో అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్టు ర్యాంకు తెచ్చుకుంటూ చదువులో రాణిస్తున్నాడు. ఫస్టు క్లాసు నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ తనదైన శైలితో ముందుకు వెళ్తున్నాడు. వయసు చిన్నదైనా ఆటపాటల్లో అందెవేసిన చేయిగా నిలుస్తున్నాడు. చదువుతో పాటు రాయడం, బోధనేతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పలు బహుమతులను అందుకుని, తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
నిత్యం శ్లోకాలు, స్తోత్రాలు..
ఇంటి దగ్గర నిత్యం శ్లోకాలు, స్తోత్రాలు వల్లె వేయడం గురు సూర్యచంద్కు వెన్న తో పెట్టిన విద్య. అమ్మమ్మ సుధాత్రి వద్ద యూకేజీ నుంచే వీటిని నేర్చుకుంటూ పట్టు పెంచుకున్నాడు. ముఖ్యంగా 20 వరకు వివిధ రకాల శ్లోకాలతో పాటు పద్యాలు వినిపిస్తాడు. హనుమాన్ చాలీసా అవలీలగా చెప్పేస్తాడు. ముఖ్యంగా సూర్యాష్టకం, లింగాష్టకం, నవగ్రహాలు, కృష్ణాష్టకం, లక్ష్మి అష్టోత్తర స్తోత్రాలను భక్తిభావంతో వినిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అలాగే, రోజూ పొద్దున్నే ఏకాగ్రత కోసం కుటుంబ సభ్యుల సమక్షంలో మెడిటేషన్, ఆరోగ్యం కోసం పలు రకాల ఆసనాలు వేయడం కూడా అలవాటు చేసుకున్నాడు.
జనరల్ నాలెడ్జ్లోనూ…
చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్లోనూ తనకంటూ ప్రత్యేకత చాటుతున్నాడు. ఇండియాలోని 29 రాష్ర్టాల పేర్లు, వాటి రాజధానులను టకటకా చెబుతాడు. తెలంగాణ రాష్ట్రంలోని మంత్రుల పేర్లు, వారి శాఖలను అడగగానే చెప్పేస్తాడు. అలాగే, దాదాపు 30 రకాల జంతువులు, పక్షులు, పుష్పాల పేర్లను చకచకా వల్లిస్తాడు.
ఆన్లైన్ క్లాసుల్లోనూ ఫస్టు…
కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసులు వింటూ వాటిని అర్థం చేసుకుంటున్నాడు. ఇంటి వద్ద తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువులో రాణిస్తున్నాడు. అలాగే, తా ను నేర్చుకున్నదానిని బుక్‌లో రాసి, వాట్సాప్ ద్వారా క్లాస్ టీచర్‌కు పంపిస్తూ, మిగతా విద్యార్థుల కన్నా ముందు వరుసల్లో నిలుస్తున్నాడని చార్‌బౌళి పాఠశాల హెచ్ఎం సర్వసతీదేవి తెలిపారు.
అబాకస్లోనూ ప్రతిభ
అబాకస్ అంటే గురు సూర్య చంద్‌కు ఎంతో ఇష్టం. అబాకస్ ద్వారా లెక్కలను నిమిష్లాల్లో చెప్పేస్తాడు. ఇప్పటికే అబాకస్‌లో ఐదు లెవల్స్ నేర్చుకుని, మేధాశక్తిని పెంచుకున్నాడు. అడిషన్, సబ్‌స్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్, డెసిమల్స్ను పెన్ను, కాగితం లేకుండానే చేతి వేళ్ల ద్వారా చెప్పడం అలవాటు చేసుకున్నాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న లెక్కలైనా ఇట్టే చెబుతూ ప్రతిభ చాటుతున్నాడు. గతేడాది షార్ప్ కిడ్స్ అబాకస్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి సంపాదించాడు.
అన్ని రంగాల్లో రాణిస్తూ…
బాలుడైన గురు సూర్యచంద్ పేరుకు తగ్గట్టుగానే అన్ని రంగాల్లో రాణిస్తున్నాడు. గురు పౌర్ణమి రోజు జన్మించడం వల్ల గురు అని, సూర్యుడిలాగా ప్రకాశించాలని సూర్య అనే పేరు పెట్టారు. అలాగే, చంద్ రావడానికి పూర్వీకుల పేరు ఉపయోగించారు. ఏది ఏమైనా సర్కారు బడిలో చదువుతున్న బాలుడు పేరుకు తగ్గట్టుగా చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండ డం విశేషం.