గురువారం 03 డిసెంబర్ 2020
Mahabubabad - Nov 22, 2020 , 02:16:01

కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

  • కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

మహబూబాబాద్‌  రూరల్‌, నవంబర్‌ 21: కొవిడ్‌-19  నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో పీహెచ్‌సీ వైద్యులతో కరోనా రాఫిడ్‌ టెస్టులు, కాన్పుల ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణపై ఆయన మాట్లాడుతూ ప్రతి పీహెచ్‌సీ పరిధిలో 100 నుంచి 150 మందికి పరీక్షలు తప్పని సరిగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 

తీగలవేణి పంచాయతీలో సర్పంచ్‌ కబడ్డీ క్రీడలు నిర్వహించడంతో పాజిటివ్‌ కేసులు పెరిగేందుకు దోహదపడిందని నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కురవి మండలంలో నిర్వహించనున్న  కందికొండ జాతర నిలుపుదలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మీ సేవ సెంటర్లు, రేషన్‌ షాప్‌లు కరోనా నియంత్రణలో తప్పని సరిగా సహకరించాలన్నారు.  కాన్పుల ప్రగతి పైన మాట్లాడుతూ నిర్ధేశించిన ప్రగతిని సాధించని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై  చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వ సిబ్బంది స్థానికంగా ఉండక పోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత రక్తదానం చేయడంలో ముందుండాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి శ్రీరాం, ఏరియా దవాఖాన కో ఆర్డినేటర్‌ భీంసాగర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో కోటా చలం, భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.

తడి,పొడి చెత్తపై అవగాహన ఉండాలి

  తడి పొడి చెత్త పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని కలెక్టర్‌ విపీ గౌతమ్‌ అధికారులను సూచించారు. శనివారం ఆయన మండల పరిధిలోని లక్ష్మీపురం తండా, బ్రాహ్మణపల్లి, కొమ్ముగూడెం గ్రామ పంచాయతీల్లో పర్యటించారు. శ్మశాన వాటికలు, డంప్‌ యార్డ్‌, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. సెగ్రిగేషన్‌ షెడ్లను పరిశీలిస్తూ తడి, పొడి చెత్తలను వేరు చేయు విధానంపై పంచాయతీ సెక్రటరీని అడిగి తెలుకున్నారు.  అభివృద్ధి నిర్మాణ పనుల జాప్యంపై  సంబందిత అధి కారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  డంప్‌ యార్డ్‌లో నిల్వ ఉన్న నీటిని పరిశీలిస్తూ తక్షణమే నీటిని తొలగించాలని వర్షపు నీరు డంప్‌ యార్డ్‌లోకి రాకుండా చుట్టూ కందకాలు తవ్వించాలన్నారు. పల్లె పకృతి వనాల్లో నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. ఎంపీడీవో రవీందర్‌, పంచాయతీ రాజ్‌ ఈఈ మహేశ్‌, సర్పంచ్‌లు షఫియుద్దీన్‌, భూక్యా సింధూ భాస్కర్‌ నాయక్‌, నెహ్రూ నా యక్‌ పాల్గొన్నారు.

ప్రతి కూలీకి కనీసం రూ. 200..

  జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రతి కూలీకి రూ.200 వచ్చేలా ఆరు గంటలు పని చేయించాలని కలెక్టర్‌ విపీ గౌతమ్‌ ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై, రైతు కల్లాలు ప్రగతిపై సమీక్షించారు. ఉపాధి హామీ పనుల్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది కూలీలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.  కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో ఉపాధి  పనులు కావాలని విజ్ఞప్తులు వస్తున్నాయని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించి ఆదుకోవాలన్నారు. రైతు కల్లాలు డిసెంబర్‌ 15 నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ సన్యాసయ్య,డీఆర్డీవో పీడీ విద్యా చందన, ఛతృనాయక్‌, జిల్లా పంచాయతీ అధికారి లత తదితరులు పాల్గొన్నారు.