Rangavallikalu | వాకిట్లో చూడచక్కని రంగవల్లిక అమరితే ఆ అందమే వేరు. ఆ అందానికి మించి ఆశ్చర్యాన్ని కలిగించేలా ముగ్గుల్ని ఆవిష్కరిస్తారు ముంబైకి చెందిన ప్రముఖ కోలం ఆర్టిస్ట్ హేమా కణ్ణన్ ( Hema Kannan ). తామరపువ్వు గీసినా, తీగల ముగ్గు వేసినా ఆ పనితనానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నవరాత్రి దేవీ రూపాలు, సీతారాముల చిత్రాలు, పురాణ కథలు.. ఆమె రంగోలీలో అందంగా ఒదిగిపోతాయి. ముగ్గుల్లో దైవికతను, మార్మికతను జొప్పించడంలో హేమ తర్వాతే ఎవరైనా! ఆ చుక్కల చమక్కులు, రంగుల హంగులు హేమాజీ మాటల్లోనే..
నా ముగ్గులు మాట్లాడతాయి. ముచ్చట్లు చెబుతాయి. ముగ్గు ఒక సంప్రదాయ కళ మాత్రమే కాదు. అదో మానసిక ఆనందాన్ని కలిగించే వ్యాపకం. ముగ్గు మీద ఆసక్తి ఉంటే.. అంతా అయ్యేసరికి మనం అలసిపోం, అనిర్వచనీయ ఆనందంలో ఉంటాం. ముగ్గుతో నా అనుబంధం చిన్నప్పుడే మొదలైంది. అమ్మ, అమ్మమ్మ వేసేప్పుడు కళ్లింతలు చేసుకుని చూసేదాన్ని. నా వంతుగా చిన్నచిన్న ముగ్గులు వేసేదాన్ని. అమ్మ ముగ్గులు నాకు స్ఫూర్తినిచ్చాయి. అలా, నా మనసు వాటి మీదికి మళ్లింది. నేను కూడా ఎందుకు వేయకూడదు? అనిపించింది. ఓ గురువు సాయంతో సాధన ప్రారంభించాను. ఆశ్చర్యంగా.. ఒక్కొక్కటీ ఒక్కో కళాఖండంలా వచ్చేవి. వాటిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టేదాన్ని. జనానికి విపరీతంగా నచ్చేవి. చూడగానే ప్రశాంతంగా అనిపిస్తున్నదని చెప్పేవారు. దీంతో, ‘లోటస్శక్తి ( the lotus shakti )’ పేరిట ఇన్స్టాగ్రామ్ పేజీ తెరిచి పోస్ట్ చేయడం ప్రారంభించాను. అందులో నాకు యాభైవేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఎంతో ఇష్టమైన ఈ వ్యాపకం కోసం రోజూ మూడు నాలుగు గంటల సమయాన్ని వెచ్చిస్తాను. కొవిడ్‌లో ఒంటరితనాన్ని దూరం చేయడంలో ముగ్గు కీలకంగా వ్యవహరించింది. ఆ సమయంలోనే నా ముగ్గులకు అభిమానులూ పెరిగారు. చాలామంది తమకూ నేర్పమని అడగడంతో ఆన్లైన్ పాఠాలు మొదలుపెట్టాను. బయట కూడా వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నాను. ముగ్గు వేయడం అంటే, ఇంట్లోకి మంచిశక్తిని ఆహ్వానించినట్టు అని పెద్దలు చెబుతారు. నిజమే ముగ్గు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మానసిక ప్రశాంతత కోరుకునేవారు ముగ్గేయడం తప్పక నేర్చుకోవాలి. దగ్గర్లోని పాఠశాల పిల్లలకూ వారానికి ఒక గంట బోధిస్తున్నాను. దీనివల్ల చిన్నారులలో సృజనాత్మకత పెరుగుతుంది. చుక్కల లెక్కలూ, త్రికోణాలూ చతురస్రాల జ్యామితులూ, చుట్టుకొలతల అంచనాలూ అన్నీ ఇందులో ఉంటాయి. ఇవన్నీ చదువుల్లోనూ పనికొస్తాయి. స్ఫూర్తి దాయక వ్యక్తుల్ని పరిచయం చేసే టెడెక్స్ వేదిక మీదా ప్రసంగించాను. నేను వేసిన ముగ్గులతో ‘ఆత్మశక్తి’ పేరిట పుస్తకం అచ్చువేయించాను. ముగ్గు మహిళ అంతరంగ వ్యక్తీకరణ అని భావిస్తాన్నేను.
“Daily labour App | క్యాబ్‌ల కోసమే కాదు లేబర్స్ కోసమూ ఓ యాప్.. క్రియేట్ చేసిన జనగామ బిడ్డ”
“komera ankarao | మనుషులకు ఆయువునిచ్చే అడవులకు అండగా మారిన తెలుగోడు”