గర్భిణులు మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో మద్యం తాగితే.. పుట్టబోయే బిడ్డ మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. తాజాగా, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకులు గర్భిణుల్లో మద్యం అలవాట్లు, దాని పరిణామాలపై ఓ అధ్యయనం నిర్వహించారు. న్యూరో ఫార్మకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో.. పలు ఆందోళనకర విషయాలను వెల్లడించారు. గర్భిణులు తక్కువ మొత్తంలో మద్యం తాగినా.. నవజాత శిశువుల మెదడు దెబ్బతినే అవకాశం ఉన్నదని చెప్పుకొచ్చారు.
కొత్త విషయాలు నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకోవడం, ప్రవర్తన నియంత్రణకు బాధ్యత వహించే మెదడులోని సర్క్యూట్లు మద్యం వల్ల దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. ఈ మార్పులు ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ లాంటి దీర్ఘకాలిక సమస్యలను పెంచుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, గర్భధారణ సమయంలో ఏ స్థాయిలోనైనా ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం కాదని అంటున్నారు. అమెరికాలో ఏటా 6,00,000 కంటే ఎక్కువ మంది శిశువులు ప్రినేటల్ డ్రగ్స్‌కు గురవుతున్నారని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గర్భిణులకు సంపూర్ణ అవగాహన కల్పించాలనీ, వారు మద్యానికి దూరంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.