అందం, ఆరోగ్యం అంటే స్త్రీలకు ముందుగా గుర్తొచ్చేవి పొడవాటి, నల్లని, ఒత్తయిన జుట్టు. కేశాలకు తగిన పోషణ అందించడం కోసం మార్కెట్లో లభించే రకరకాల నూనెలను వాడుతుంటారు. అయితే వీటిల్లో ఎకువ ప్రయోజనం చేకూర్చేది ఏదని వెతికినప్పుడు ఎకువగా రోజ్ మేరీ, ఆముదం నూనెల పేర్లు వినిపిస్తాయి. చాలామంది ఏండ్లుగా తమ శిరోజాల సంరక్షణకు వీటిని వాడుతున్నారు. ఈ రెండిటిలో ఏది జుట్టుకు ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం.
రోజ్ మేరీ ఆయిల్: ఈ నూనెలో ఐరన్, క్యాల్షియం, విటమిన్ బి లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిని వాడటం వల్ల జుట్టు కుదుళ్లకు లోపలి నుంచి పోషణ లభిస్తుంది. జుట్టు నిగనిగలాడుతూ కాంతిమంతంగా మారుతుంది. జుట్టు పెరుగుదలలో చక్కటి ఫలితాలుంటాయి. త్వరగా పొడిబారే జుట్టు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆముదం: చాలామంది ఇళ్లల్లో లభించే ఆముదం నూనెలో ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇది వాడటం వల్ల జుట్టుకు అవసరమైన పూర్తి పోషణ అందుతుంది. జుట్టు రాలడం, చిట్లి పోవడం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుదుళ్లు బలపడతాయి. జుట్టు పెరగాలని కోరుకునేవారు ఆముదం నూనె ఎంచుకోవచ్చు.