తల్లిదండ్రులకు తమ బిడ్డలందరిపై సమాన ప్రేమ ఉంటుంది. కొందరి విషయంలో ఈ ప్రేమలో తేడాలు ఉంటాయి. కొంతమంది పేరెంట్స్‌కి ఒక ఫేవరెట్ కిడ్ తప్పకుండా ఉంటారట. చెప్పిన మాట వింటున్నారనో, చదువులో ముందున్నారనో.. ఒకరిపై ఎక్కువ ప్రేమను కురిపిస్తారట. అయితే, తల్లిదండ్రుల్లో ఇలాంటి పక్షపాతం.. మరో బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. దీర్ఘకాలంలో వారిలో మానసిక ఒత్తిడి పెరిగి.. నెగెటివ్ ఆలోచనలతో ప్రవర్తిస్తారంటూ మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిల్లలపై ప్రేమను పంచడంలో కొందరు తల్లిదండ్రులు పక్షపాతంతో వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా, ఇద్దరు-ముగ్గురు పిల్లలున్న కుటుంబాల్లో.. చాలామంది ఒక్కరిద్దరినే ప్రత్యేకంగా చూస్తుంటారు. వారిపైనే అదనపు శ్రద్ధ చూపుతుంటారు. ప్రశంసలు కురిపిస్తుంటారు. వారు అల్లరి చేసినా అంతగా కోపగించుకోరు. మరోబిడ్డపై మాత్రం చీటికిమాటికి అరుస్తుంటారు.
ఇలాంటి వ్యవహారశైలి వల్ల పిల్లల్లో మానసిక ఉద్రేకం పెరుగుతుందని పలు పరిశోధనలు తేల్చాయి కూడా. ‘ది జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ సైకాలజీ’ అధ్యయనం ప్రకారం.. తల్లిదండ్రుల అభిమానం తక్కువగా ఉండే పిల్లలు ప్రతికూల ఆలోచనలతో పెరుగుతారట. వారిలో భావోద్వేగ మద్దతు తక్కువగా ఉంటుందని, తోబుట్టువులతో పేలవమైన సత్సంబంధాలు కలిగి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమలోని పక్షపాతం.. పిల్లల్లో దీర్ఘకాలిక ఆగ్రహాన్ని పెంచుతుందట. తోబుట్టువులపై అసూయతోపాటు ఉద్రిక్తతకు ఆజ్యం పోస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
చాలా కుటుంబాల్లో తెలియకుండానే ‘ఫేవరెట్ కిడ్’ ప్రభావం కనిపిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమలో తేడా లేకపోయినా.. చిన్నచిన్న సందర్భాల్లో ఈ పక్షపాతం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒకరితో ఎక్కువ ఓపికగా ఉండటం, అదనపు ఆప్యాయతను చూపడం చేస్తుంటారు. నిజానికి తాము అలా ప్రవర్తిస్తున్నామని తల్లిదండ్రులు కూడా గ్రహించకపోవచ్చు. కానీ, మరో బిడ్డ మాత్రం.. ఇలాంటి విషయాలను సూక్ష్మంగా గమనిస్తారట. తల్లిదండ్రులు తమను తక్కువగా చూస్తున్నారనే భావన.. పిల్లల్లో నెగెటివ్ ఆలోచనలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫలితంగా, దీర్ఘకాలంలో వారిలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గుతుందనీ, ఆగ్రహావేశాలు పెరుగుతాయనీ అంటున్నారు. యుక్తవయసుకు వచ్చేసరికి తోబుట్టువుల మధ్య సంఘర్షణలతోపాటు ఘర్షణలకూ దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే.. పిల్లలపై చూపే ప్రేమలో ఎలాంటి తేడాలూ ఉండకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, అమ్మాయి-అబ్బాయి మధ్య ఆప్యాయతలో పక్షపాతం చూపొద్దని సలహా ఇస్తున్నారు.