Mucus | వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా సీజన్ మారినప్పుడు, చల్లని ఆహారాలను తీసుకున్నప్పుడు శరీరంలో సహజంగానే కఫం చేరుతుంది. దీన్నే శ్లేష్మం అని కూడా అంటారు. సాధారణంగా చాలా మంది తరచూ చల్లని ద్రవాలను తాగుతుంటారు. దీని వల్ల కఫం అధిక మొత్తంలో తయారవుతుంది. ఇది ఇబ్బందులకు గురి చేస్తుంది. శరీరంలో కఫం అధికంగా చేరడం వల్ల ముక్కు దిబ్బడతోపాటు దగ్గు, జలుబు వస్తాయి. కొందరికి జ్వరం వస్తుంది. చిన్నారులకు అయితే కఫం తరచూ వస్తుంది. కొన్ని రకాల మందులను వాడడం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. కొందరికి కఫం శరీరంలో ఎల్లప్పుడూ ఉంటుంది. దీంతో వారు దగ్గుతూ ఉంటారు. లేదా తరచూ జలుబు చేస్తుంటుంది. అయితే శరీరంలో కఫం అధికంగా ఉన్నవారు పలు చిట్కాలను పాటిస్తుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. దీంతో శ్వాసకోశ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది.
శరీరంలో కఫం అధికంగా ఉన్నవారు రోజూ గోరు వెచ్చని నీళ్లను తాగుతుండాలి. అల్లం, కమోమిల్, పెప్పర్మింట్ వంటి హెర్బల్ టీలను సేవిస్తున్నా ఫలితం ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తరచూ తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. వీటి వల్ల శరీరంలో కఫం కరిగిపోతుంది. అలాగే చికెన్ సూప్ లేదా కూరగాయల సూప్‌ను తాగుతుండాలి. వీటిల్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ వల్ల కఫం కరుగుతుంది. అలాగే కఫాన్ని కరిగించడంలో అల్లం కూడా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ హిస్టామైన్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి అధికంగా ఉన్న కఫాన్ని బయటకు పంపించడంలో సహాయం చేస్తాయి. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఈ సమస్యను తగ్గిస్తాయి. రోజూ ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
రోజూ ఆహారంలో పచ్చి ఉల్లిపాయలను తింటున్నా మేలు జరుగుతుంది. వెల్లుల్లి, ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. దీని వల్ల శరీరంలో అధికంగా కఫం ఉత్పత్తి కాకుండా అడ్డుకోవచ్చు. అలాగే మన వంట ఇంట్లో ఉండే పసుపు కూడా ఈ సమస్య నుంచి మనల్ని బయట పడేలా చేస్తుంది. పసుపులోనూ శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల వాపులను తగ్గిస్తాయి. దీంతో శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పాలలో పసుపు కలుపుకుని రాత్రి పూట తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. పసుపును గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి కూడా తాగవచ్చు. అలాగే తరచూ కారం తినే వారిలోనూ కఫం చేరదు. ఎండు మిర్చి లేదా ఎండు కారం తింటే క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలోని కఫాన్ని కరిగిస్తుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. దీంతో శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. చేపలు, అవిసె గింజలు, చియా విత్తనాలు, వాల్ నట్స్, అవకాడోలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శ్వాసనాళాల వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల కఫం కరిగిపోతుంది. శ్వాస సరిగ్గా లభిస్తుంది. ముక్కు దిబ్బడ, జలుబు నుంచి సైతం ఉపశమనం పొందవచ్చు. అలాగే అధిక కఫం ఉన్నవారు తరచూ పైనాపిల్‌ను తింటుంటే ఉపయోగం ఉంటుంది. ఇందులో ఉండే బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మ్యుకోలైటిక్గా కూడా పనిచేస్తుంది. కనుక పైనాపిల్‌ను తింటుంటే కఫాన్ని కరిగించుకోవచ్చు. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తీసుకుంటుంటే శరీరంలోని అధిక కఫాన్ని కరిగించుకుని శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.