రంగారెడ్డి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రోజురోజుకూ గన్ కల్చర్ పెరిగిపోతున్నది. కొందరు తుపాకులతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలూ ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో భూములు, ప్లాట్ల ధరలు గణనీయంగా పెరగడంతో భూవివాదాలు తలెత్తుతున్నాయి. వివాదాల్లో రౌడీషీటర్లు తలదూర్చి బెదిరింపులకు పాల్పడుతూ సెటిల్మెంట్లు చేస్తున్నారు.
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధుల్లో విస్తరించి ఉన్న జిల్లాలో గన్‌కల్చర్ పెరిగిపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దానిని ఆదిలోనే అంతమొందించాలని జంట కమిషనరేట్ల సీపీలు వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, నార్సింగి, ఆదిబట్ల తదితర ఠాణాల పరిధుల్లో తుపాకులతో బెదిరింపులకు పాల్పడిన ఘటనలపై కేసులు నమోదు చేశారు. కానీ, బయటికి రాని మరెన్నో కేసులు లోపలే మగ్గిపోతున్నాయి. ఇటీవల కొందరు రియల్టర్లు రౌడీషీటర్లను పెంచి పోషిస్తున్నారు. వారికి తుపాకులను కొని ఇస్తున్నారు. లైసెన్స్‌లు లేకుండానే తుపాకులు వాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధికొచ్చే ఇబ్రహీంపట్నం ఠాణాలో ఓ రౌడీషీటర్ రెచ్చిపోయి ఓ వ్యక్తిపై తుపాకీ గురిపెట్టి రూ.2,50,000 వసూలు చేసిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆదిబట్ల ఠాణా పరిధిలోని మంగల్‌పల్లిలో జరిగింది. నల్గొండ జిల్లాలోని చింతపల్లికి చెందిన ఓ రౌడీషీటర్ ఆ జిల్లాలోని నాంపల్లి మండలానికి చెందిన నాగరాజు అనే వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని మంగల్‌పల్లి సమీపంలోకి తీసుకెళ్లి తుపాకిని తలకు గురిపెట్టి రూ.2,50,000 వసూలు చేసినట్లు బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా..
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అతడికి గన్ ఎలా వచ్చింది.? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్నా అంశంపై విచారించేందుకు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నాగరాజు వద్ద ఉన్న ఏటీఎం కార్డు ద్వారా రూ. 2,50,000 మంగల్‌పల్లి, శేరిగూడ తదితర ప్రాంతాల్లోని ఏటీఎంలలో డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని కర్ణంగూడ వద్ద గతేడాది ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి తన వద్ద పనిచేసే వ్యక్తికి తుపాకి ఇప్పించి ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపించాడు. ఇబ్రహీంపట్నం పరిధిలో ఓ భూవివాదంలో వారిని హత్య చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు మట్టారెడ్డి అనే రియల్ఎస్టేట్ వ్యాపారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నార్సింగి ఠాణా పరిధిలోని మణికొండలో ఓ స్థల వివాదంలో గాలిలోకి కాల్పు లు జరపడం తీవ్ర కలకలం రేపింది. మణికొండ సమీపంలోని పంచవటి కాలనీలో ఓ స్థల వివాదంలో కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి తుపాకితో గాలిలో కాల్పు లు ఆ స్థలంలో ఎప్పటినుంచో ఉంటున్న వారిని భయపెట్టి బయటికి పంపించి గేటుకు తాళం వేశాడు. ఈ ఘటనపై బాధితులు రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశారు.
జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట, తుక్కుగూడ, ఆదిబట్ల, నార్సింగి, రాజేంద్రనగర్, శంకర్పల్లి, కందుకూరు, మహేశ్వరం, షాద్‌నగర్ వంటి ప్రాం తా ల్లోని భూవివాదాల్లో రౌడీషీటర్లు జోక్యం చేసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో కొందరు ఉద్దేశపూర్వకంగానే భూ వివాదాలకు తెరలేపుతున్నారు. ఎన్నో ఏండ్లుగా ప్లాట్లు, భూములు తమ పేర్లపై ఉన్నా కొంతమంది రియల్ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసి వివాదాలకు తెరలేపుతున్నారు. అనంతరం రౌడీషీటర్లను రంగంలోకి దింపి బాధితులను భయభ్రాంతులకు గురిచేసి సెటిల్మెంట్లు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. రౌడీషీటర్ల వ్యవహార శైలిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు
జిల్లాలోని కొంగరకలాన్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బీహార్ రాష్ట్రంలో తుపాకులు కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు. వారిని బీహార్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన ఈ యువకులపై ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలిసింది.