Foods For Lungs Health | మన శరీర కణాలకు ఆక్సిజన్‌ను అందించడంతోపాటు శరీర భాగాల్లో పేరుకుపోయిన విష, వ్యర్థ వాయులను బయటకు పంపించడంలో ఊపిరితిత్తులు ఎంతో సహాయం చేస్తాయి. వీటి వల్ల శరీరంలోని క్రిములు బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలతో అవస్థలు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా కాలుష్యం వల్ల చాలా మందికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. గాలి కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే పొగ తాగడం లేదా పొగ తాగేవారి పక్కన ఉండడం, దీర్ఘకాలికంగా మందులను వాడడం, మరీ చల్లగా ఉండే ఆహారాలను తీసుకోవడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల కూడా ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకుంటే దాంతో ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
మనం రోజువారి ఆహారంలో వివిధ రకాల బెర్రీ పండ్లను తింటుంటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలు బెర్రీ పండ్ల జాబితాకు చెందుతాయి. కనుక వీటిని రోజూ తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, ఆంథోసయనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో దోహదం చేస్తాయి. అలాగే సిట్రస్ ఫలాలను రోజూ తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. నారింజ, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్ ఈ జాబితాకు చెందుతాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లో ఉండే కణాల వాపులను తగ్గిస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది.
ఎరుపు, పసుపు లేదా నారింజ రంగులో ఉండే క్యాప్సికంలను తింటున్నా ఉపయోగం ఉంటుంది. వీటిల్లో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తుంది. సీవోపీడీ అనే ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారికి ఇవి ఎంతగానో ఉపశమనాన్ని అందిస్తాయి. అలాగే రోజూ ఒక యాపిల్‌ను తింటున్నా కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడేలా చేస్తాయి. కనుక ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక యాపిల్‌ను తప్పనిసరిగా తినాలి.
వారంలో కనీసం 2 సార్లు చేపలను తింటున్నా కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరచడంలో సహాయం చేస్తాయి. అలాగే రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కాస్త పసుపు కలిపి తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇక అల్లం లేదా వెల్లుల్లిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. దీని వల్ల ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తగ్గుతుంది. ఇలా ఆయా ఆహారాలను తరచూ తీసుకుంటుంటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.