శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఏది అంటే రకరకాల జవాబులు వినిపిస్తాయి.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని ఒకరు అంటారు. వినిపించకపోతే, మాట కూడా రాదు కాబట్టి…
చెవులే మేలని ఇంకొందరి వాదన. ఒక్కో అవయవానికీ ఒక్కో సమర్థన. ఆఖరికి మనం పనికిరాదు అనుకునే
అపెండిక్స్‌కి కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయని ఇటీవలి పరిశోధనలు కొన్ని చెబుతున్నాయి. మరి పేగుల సంగతేంటి? తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఇవే కీలకం అని తెలుసు. అందుకోసం రకరకాల రసాయనాలు ఊరతాయనీ చదువుకున్నాం. అదంతా చాలా సాధారణమైన ప్రక్రియ అని మన భావన. నిజానికి మన శక్తికి, సత్తువకు అదే కీలకం.మరో ముఖ్యమైన విషయం! గట్ బ్యాక్టీరియా అని పిలుచుకునే మన జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియానే…
మన రోగనిరోధకశక్తికి కీలకం అని పరిశోధనలు చెబుతున్నాయి. మన ఆరోగ్యం నుంచి తెలివితేటల వరకూ చాలాఅంశాలు ఈ గట్ బ్యాక్టీరియా మీదే ఆధారపడి ఉన్నాయని నమ్ముతున్నారు. ఎవరి ఒంట్లో అయినా అనారోగ్యం వల్లనో, యాంటీ బయాటిక్స్ వల్లనో గట్ బ్యాక్టీరియా దెబ్బతిన్నా… అసలు వారి ఒంట్లోనే అలాంటి బ్యాక్టీరియా బలహీనంగా ఉన్నా ఇతరుల నుంచి దాన్ని ఎక్కించే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ముందుముందు ఈ పద్ధతి మరింత ప్రచారంలోకి వచ్చేస్తుందని నమ్ముతున్నారు. ఇంతకీ ఏమిటీ గట్ బ్యాక్టీరియా? దీనివల్ల ఉపయోగాలేంటి? అది అస్తవ్యస్తమైతే తలెత్తే సమస్యలు ఏముంటాయి?… లాంటి విషయాలను వివరించే ప్రయత్నమిది!
ఓఅనూహ్యమైన సవాలుకు… అనుకోని జవాబు తడితే ‘గట్ ఫీలింగ్’ అంటాం. ఎవరన్నా కష్టాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యంతో ఉంటే… వాళ్లకు ‘గట్స్’ ఉన్నాయి అంటారు. గట్ అంటే గుండెనో, మెదడో కాదు… మన జీర్ణవ్యవస్థ అని తెలియడం ఆశ్చర్యమే. దాని ప్రత్యేకత మనకు కొత్తేమో కానీ, మన పెద్దలకు మాత్రం కాదు! ప్రాచీన వైద్యం, సంప్రదాయాలను పైపైన గమనించినా కూడా… అలవాట్ల నుంచి ఆహార పదార్థాల వరకూ జీర్ణవ్యవస్థకు అనుకూలమైన సూచనలే కనిపిస్తాయి.
శరీరంలో మరో లోకం!
మనం మాటవరసకు బ్యాక్టీరియా అంటున్నాం కానీ, ఆ బ్యాక్టీరియాతోపాటు ఫంగస్, వైరస్‌లాంటి రకరకాల సూక్ష్మజీవులు ఉండే మరో ప్రపంచం ఈ గట్. ఓ అంచనా ప్రకారం మన శరీరంలో కణాల కన్నా… ఈ బ్యాక్టీరియా సంఖ్యే ఎక్కువ. గొంతు నుంచి, మలద్వారం వరకు సాగే జీర్ణప్రక్రియలో అడుగడుగునా ఈ సూక్ష్మజీవులు ఉంటాయి. కాకపోతే పెద్దపేగులలో వీటి సంఖ్య అధికం. ఇంకా చెప్పాలంటే అక్కడ ఉండే ‘సెసమ్’ అనే చోట ఇవి అధికంగా ఉంటాయి. ఈ పెద్దపేగులోని గట్ బ్యాక్టీరియా చాలా వైవిధ్యమైనది, కీలకమైనదీ కూడా! పెద్ద పేగులలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులలో మాత్రమే మనగలిగే బ్యాక్టీరియా అక్కడ పెరుగుతుంది. పీచు ఏమాత్రం లేని దృఢమైన పదార్థాలను విడగొట్టేందుకు, ఆహారంలోని పోషకాలను శరీరానికి అందించేందుకు ఈ బ్యాక్టీరియా చాలా కీలకం. ఇదే బ్యాక్టీరియా పెద్ద పేగులను దాటి వెళ్తే మాత్రం, సమస్యే! ఎందుకంటే తనది కాని వాతావరణంలో అవి ఇన్ఫెక్షన్ కలిగించగలవు.
లోకంలోకి వస్తూనే…
బయటి ప్రపంచానికి చెందిన సూక్ష్మజీవులలో కొన్ని మనకు మేలుచేస్తాయి. అవే గట్ బ్యాక్టీరియా. మరి ఆ సూక్ష్మజీవులు మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి అన్నది ఆసక్తికరం! తల్లి కడుపులో ఉన్నప్పుడు… ఆ శిశువులో గట్ బ్యాక్టీరియా ఉంటుందా లేదా అన్న విషయం మీద చాలా వాదనలు ఉన్నాయి. పొట్టలో ఉన్న శిశువులో ఇది ఉండదనే చాలా పరిశోధనలు చెబుతున్నాయి. శిశువు, తల్లి కడుపు నుంచి బయటకు వచ్చే మార్గంలో కొంత బ్యాక్టీరియా తనలోకి చొచ్చుకువెళ్తుంది. ఇది గట్ బ్యాక్టీరియా ఉనికికి ఆరంభం. ఇక్కడ ఓ చిన్న విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. చాలామంది వైద్యులు, గర్భిణులు అవసరం లేకపోయినా సిజేరియన్ వైపు మళ్లుతున్నారు. దీనివల్ల తొలిదశలో బిడ్డకు దక్కే గట్ బ్యాక్టీరియా తనకు అందడం లేదట. అదే సమయంలో, ఆసుపత్రిలో ఉండే ఇతరత్రా సూక్ష్మజీవులు తనలోకి వెళ్లడం వల్ల… పిల్లలు తొలి రోజుల్లోనే రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడుతున్నది. ఇక పసిపిల్లలకు గట్ బ్యాక్టీరియా అందే రెండో మార్గం… తల్లిపాలు. వాటి నుంచి దూరం చేసినా కూడా పిల్లల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత మూడేళ్లూ… పిల్లలు తాము తినే ఆహారం, ఉండే పరిసరాల నుంచి గట్ బ్యాక్టీరియాను, పేగులలోకి పోగు చేసుకుంటారు.
లెక్కలేనన్ని లాభాలు
మొదట్లోనే చెప్పుకొన్నట్టు గట్ బ్యాక్టీరియా ఎంత మేలు చేస్తుందన్నది, ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంతోనే స్పష్టం అవుతుంది. బి6, బి12, విటమిన్-కె లాంటి కొన్ని విటమిన్లను మనం అంతగా పట్టించుకోం. అవి మనకు చాలా స్వల్పంగా దక్కుతాయి కూడా. కానీ ఈ విటమిన్ల లోపం ఏర్పడితే మాత్రం, వాటి నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సూక్ష్మ పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది గట్ బ్యాక్టీరియా. మన కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే పైత్యరసాన్ని (బైల్) జీర్ణవ్యవస్థకు అనుగుణంగా విడగొట్టడంలో కూడా గట్ బ్యాక్టీరియాది కీలకపాత్ర. ఇందులో లోపం జరిగితే ఒంట్లో పైత్యరసం పేరుకుపోవడం దగ్గర నుంచి కాలేయం పనితీరు దెబ్బతినడం వరకు రకరకాల సమస్యలు వస్తాయి.
ఇంకా ఈ గట్ బ్యాక్టీరియా…
రోగనిరోధకశక్తికి కీలకం: మన శరీరంలో రోగనిరోధకశక్తి ఎక్కడ ఉంటుంది అంటే జవాబు కష్టం. ఎందుకంటే ఒంట్లోని ప్రతి కణమూ… పరాన్నజీవుల మీదా, వైరస్ల మీదా పోరాడుతూనే ఉంటుంది. చర్మం మీద ఏర్పడే చిన్నగాయం చుట్టూ కూడా పెద్ద పోరాటమే జరుగుతుంది. అయితే ఈ ఇమ్యూనిటీలో గట్ బ్యాక్టీరియా పాత్ర ఇంకాస్త కీలకం. నీరు, ఆహారం ద్వారా ఒంట్లోకి ప్రవేశించే సవాలక్ష సూక్ష్మజీవులను ఇది చంపేస్తుంది. జీర్ణవ్యవస్థలోకి చేరిన లేదా ఏర్పడిన ఏ ఇన్ఫెక్షన్ను కూడా… రక్త ప్రసరణలో కలవకుండా అడ్డుకుంటుంది. ఆ మాటకు వస్తే కేవలం జీర్ణవ్యవస్థలో ఏర్పడే సమస్యలే కాదు… శరీరం మొత్తమ్మీదా ఉన్న రోగనిరోధకశక్తికి ఈ గట్ బ్యాక్టీరియానే కీలకం అని నివేదికలు చెబుతున్నాయి. ‘డిస్ బయోసిస్’ లాంటి గట్ సంబంధ సమస్యలు వచ్చినప్పుడు… శరీరంలోని ఇమ్యూనిటీ కూడా తగ్గిపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.
మెదడుకు అదను: మన శరీరంలో ఎక్కడ ఏం జరుగుతున్నదో, ఎక్కడ ఎలాంటి స్పందన ఉండాలో మెదడు నిర్ణయిస్తుందన్న విషయం తెలిసిందే. కాకపోతే గట్ వ్యవస్థకూ, మెదడుకీ మాత్రం చాలా దగ్గరి సంబంధం ఉందంటారు. అవి రెండూ ప్రాణ స్నేహితులు. ఒకరిని ఒకరు గమనించుకుంటాయి. అందుకే గట్ను సెకండ్ బ్రెయిన్ (రెండో మెదడు)గా పిలుస్తారు. ఆశ్చర్యంగా అనిపించినా చిరాకు, కోపం లాంటి చాలా ఉద్వేగాలు మన గట్ బ్యాక్టీరియా మీద ఆధారపడి ఉంటాయట. ఉదాహరణకు మనలో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించే సెరటోనిన్ అనే హార్మోన్‌కీ గట్ బ్యాక్టీరియాకీ సంబంధం ఉందని తేలింది. ప్రో బయాటిక్స్ వాడినప్పుడు… డిప్రెషన్ తగ్గుముఖం పట్టడాన్నీ గమనించారు. ఇక మెదడులో భయం, ఆందోళన లాంటివి ఏర్పడినప్పుడు కడుపులో గడబిడగా, ఆకలి లేకుండా ఉండటం తెలిసిందే. ఈ బంధాన్ని ‘గట్-బ్రెయిన్ యాక్సిస్’ పేరుతో పిలుస్తున్నారు.
హార్మోన్లకు కీలకం: హార్మోన్లు అన్నమాట వినగానే మనకు గ్రంథులే గుర్తుకొస్తాయి. వీటితోపాటు శరీరంలోని వేర్వేరు అవయవాలు హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ మొత్తం వ్యవస్థనూ ‘ఎండోక్రైన్ సిస్టం’ అంటారు. ఇందులో జీర్ణవ్యవస్థే అతి పెద్దది అని తెలియడం ఆశ్చర్యమే. గ్యాస్ట్రిన్, సెక్రెటిన్ లాంటి 50కి పైగా హార్మోన్లు గట్ నుంచే స్రవిస్తాయి. ఆకలి కావడం నుంచి అరుగుదల వరకూ చాలా చర్యలకు అవి కీలకం. అంతేకాదు! ఊబకాయం మొదలుకుని డయాబెటిస్ వరకు ఎన్నో సమస్యలను ఇవి నియంత్రిస్తాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ హార్మోన్ల మీద గట్ బ్యాక్టీరియా ప్రభావం చాలా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
గుండెకు దన్ను: ఎల్‌డీఎల్‌గా పిలుచుకునే చెడు కొవ్వు ఒంట్లో పేరుకుపోతే… అది గుండెపోటుకు దారితీస్తుందని తెలుసు. ఓ 1,500 మంది మీద జరిగిన పరిశోధనలో, గట్ బ్యాక్టీరియా చెడు కొవ్వును తగ్గిస్తుందని తేలింది. అంతేకాదు! గట్ బ్యాక్టీరియా బలహీనంగా ఉన్నవారిలో టీఎంఏఓ అనే ఓ రసాయనం ఉత్పత్తి పెరిగిపోతున్నట్టు గమనించారు. దీనివల్ల రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని గుర్తించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గట్ బ్యాక్టీరియాలో ఉండే Blautia, Faecali తరహా బ్యాక్టీరియా శరీరంలో వాపు (ఇన్ఫ్లమేషన్)ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కీళ్లనొప్పుల నుంచి గుండెజబ్బుల వరకూ, ఎన్నో సమస్యలకు ఈ వాపు ప్రధాన కారణం.
చెప్పుకొంటూ వెళ్తే… గట్ బ్యాక్టీరియా వల్ల చాలా ఉపయోగాలే కనిపిస్తాయి. ఇంకా కొత్తకొత్తవి కనుగొంటున్నారు కూడా! అప్పుడే పుట్టిన పిల్లవాడు సైతం తల్లి పాలను జీర్ణించుకునేందుకు తన గట్‌లో ఏర్పడిన Bifidobacteria అనే సూక్ష్మజీవి మీదే ఆధారపడతాడు. చివరి శ్వాస విడిచాక మన శరీరాన్ని పంచభూతాల్లో కలిపేందుకు కూడా… గట్ బ్యాక్టీరియా మరింత చురుగ్గా పనిచేస్తుంది.
చేజేతులా.. నోట్లోకి విషం!
గట్ బ్యాక్టీరియా ఎంత ఉపయోగమో తేలిపోయింది. రోజురోజుకీ దాని ప్రాధాన్యత నిరూపించే పరిశోధనలు పెరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు గట్ బ్యాక్టీరియా అస్తవ్యస్తం అయిపోవడాన్ని కూడా పెను సమస్యగా గుర్తిస్తున్నారు. దానికి డిస్ బయోసిస్ అని పేరు. ఒక వ్యక్తిలో తాత్కాలికంగానో, శాశ్వతంగానో… రకరకాల కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చు. ఈ పరిస్థితి రావడానికి మనం చేతులారా చేసే తప్పులే ముఖ్య కారణం!
ప్రాసెస్డ్ ఆహారం: ఎలాంటి పీచూ లేకుండా, ఉన్న పీచును కూడా తొలగించేసిన ఆహారంలో పిండి పదార్థం తప్ప మరేమీ మిగలదు. ఇది గట్ బ్యాక్టీరియాకు మేలుచేయదు. పైగా వీటి రంగు, రుచి, వాసన, నిల్వ కోసం జోడించే కృత్రిమ పదార్థాలు కడుపులో ఉన్న బ్యాక్టీరియాను కూడా నాశనం చేసేస్తాయి.
రసాయనాలు: కూరగాయలలో పురుగు మందుల నుంచి నీటిలో క్లోరిన్ వరకూ చాలా రసాయనాలను తెలియకుండానే తీసుకుంటున్నాం. ఇవే కాకుండా మద్యం, పొగాకు లాంటి పదార్థాలూ పొట్టలోని సూక్ష్మజీవులకు హాని కలిగిస్తాయి. వీటివల్ల పేగులలోని pH (క్షారగుణం) బ్యాలెన్స్ కూడా తప్పిపోయి, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
కదలని జీవనశైలి: ఆశ్చర్యంగా అనిపించినా… గంటల తరబడి స్క్రీన్ల ముందు కూర్చునే జీవనశైలి వల్ల గట్ బ్యాక్టీరియా కూడా నిస్సత్తువగా ఉంటుందట. చురుకైన కదలికలు, ఆటలు, శారీరక శ్రమ, వ్యాయామం… గట్ బ్యాక్టీరియా తీరునే మార్చేస్తాయని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు.
రసా(యనా)లు: దాహం వేయగానే నీళ్లు, కొబ్బరినీళ్ల బదులు శీతలపానీయాలు తాగేస్తుంటాం. వీటిలోని రసాయనాలు గట్ బ్యాక్టీరియాను తప్పక దెబ్బతీస్తాయి. వాటి స్థానంలో పండ్లరసాలు తాగి అది ఆరోగ్యకరం అనుకోవడానికీ వీల్లేదు. ఎందుకంటే పీచు ఏమాత్రం లేని పుల్లటి పండ్లరసాలు, పేగుల మీద యాసిడ్ లాగా పనిచేస్తాయి.
కృత్రిమ చక్కెర: ఇప్పుడు చాలా ఇండ్లలో ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ వాడేస్తున్నారు. వాటివల్ల మధుమేహం అదుపులో ఉంటుందని నమ్మకం. నిజానికి వీటివల్ల కలిగే ఇతర దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి… అవి గట్ బ్యాక్టీరియాను దెబ్బతీయడం.ఇవే కాదు… ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, ఎప్పుడూ ఒకే తరహా ఆహారం తినడం లాంటి పరిస్థితుల్లో కూడా గట్ బ్యాక్టీరియా బలహీనంగా మారిపోతుంది.
అశ్రద్ధ చేయకూడని లక్షణాలు!
అజీర్ణం అనేది చాలా సాధారణమైన సమస్య. ఆహారం తీసుకోకున్నా, కొత్త పదార్థం ప్రయత్నించినా, సరిపడనిది తిన్నా, సమయానికి తినకున్నా…. ఇలా సవాలక్ష సందర్భాలలో కడుపులో కొంత అసౌకర్యం సహజం. తీవ్రమైన కడుపునొప్పి వస్తే, అది అపెండిసైటిస్ అనే భయంతో ఎలాగూ డాక్టర్ దగ్గరకు వెళ్తాం. కానీ రోజుల తరబడి కనిపించే కొన్ని సమస్యలను కూడా అశ్రద్ధ చేయకూడదన్నది వైద్యుల మాట. మన గట్ బ్యాక్టీరియా నీరసించడం వల్లే ఈ లక్షణాలు ఏర్పడతాయనీ, వీటిని అశ్రద్ధ చేస్తే పోషకాహారలోపం నుంచి రక్తహీనత వరకూ ఎన్నో ఇతర సమస్యలు రావచ్చనీ హెచ్చరిస్తున్నారు. పొట్ట ఉబ్బరంగా ఉండటం (బ్లోటింగ్), రోజుల తరబడి విరేచనాలు, మలబద్ధకం, కడుపులో సన్నటి నొప్పి, అరగని తేన్పులు… ఇలాంటి సమస్యలు కనుక రెండు మూడు రోజులకు మించి కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. తప్పదు కూడా!
సరి చేస్తున్నారు…
కొన్ని దశాబ్దాల క్రితం గట్ బ్యాక్టీరియాను సరిచేయడం అనే ఆలోచన వైద్యులకు కూడా కలిగేది కాదు. కానీ దీని ప్రత్యేకత, ప్రభావాన్ని గుర్తించిన తర్వాత జీర్ణవ్యవస్థలో ఏర్పడే లోపాలకు గట్ బ్యాక్టీరియాను బాగుచేయడమే కీలకంగా భావిస్తున్నారు. అందుకోసం ప్రీబయాటిక్, ప్రోబయాటిక్స్ ఉండే రకరకాల సప్లిమెంట్స్ అందిస్తున్నారు. పేగులలో ఉన్న ఇన్ఫెక్షన్లను తొలగించేందుకు ఉపయోగపడే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు సూచిస్తున్నారు. అరుదైన సందర్భాలలో ఒకరి శరీరంలోని గట్ బ్యాక్టీరియాను మరొకరి శరీరంలోకి చేర్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో గట్ బ్యాక్టీరియాను పెంచేందుకు, కడుపులో ఉన్న మొండి ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు ఈ ‘ఫీకల్ ట్రాన్స్‌ప్లాంట్’ పాత్ర చాలా కీలకంగా మారనుంది. ఆ పరిస్థితికి రాకముందే మంచి అలవాట్లు, ఆహారంతో మన గట్ బ్యాక్టీరియాను సంరక్షించుకునే ప్రయత్నం చేద్దాం!
యాంటీ… బయాటిక్స్
శరీరంలో ఏదన్నా సూక్ష్మజీవి చేరితే, దాని మీద శరీరమే పోరాడే ప్రయత్నం చేస్తుంది. చాలా సందర్భాల్లో అది సఫలం అవుతుంది కూడా. ఈలోగా జ్వరం, విరేచనాలు, వాంతులు లాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. కానీ ఈ లక్షణాలను కూడా వ్యాధులుగానే భావిస్తున్నాం. శరీరం కంటే ముందే, ఒంట్లోని సూక్ష్మజీవులను చంపేందుకు ఎడాపెడా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నాం. పరిస్థితి చేజారినప్పుడు మాత్రమే వాడాల్సిన ఈ యాంటీబయాటిక్స్‌ను మెడికల్ షాపు కుర్రాళ్ల సలహాతో కూడా వేసుకుంటున్నాం. దీనివల్ల సదరు బ్యాక్టీరియా, మందులకు కూడా లొంగని పరిస్థితికి చేరుకుంటున్నది. అవి వాడినప్పుడు శరీరంలోని గట్ బ్యాక్టీరియా నశించిపోయే దుస్థితి ఏర్పడుతుంది.
యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు చాలామంది ముఖ్యంగా పిల్లలు, విరేచనాలతో బాధపడటం ఇందుకు స్పష్టమైన సూచన. గట్ బ్యాక్టీరియా నశించడం అంటే దానివల్ల కలిగే లాభాలన్నీ కరిగి, అనర్థాలుగా మారడమే. ఈ విషయాన్నీ ఎన్నో పరిశోధనలు రుజువుచేశాయి. ఓ ప్రయోగం కోసం తేనెటీగలకు యాంటీబయాటిక్ ఉన్న చుక్కలు పట్టించినప్పుడు… కొన్నాళ్లకు వాటిలో ఏకంగా మూడోవంతు చనిపోయి కనిపించాయి. మనుషులలో ఇంత నేరుగా ఫలితం కనిపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో మాత్రం ప్రాణాంతకమే అని గుర్తుంచుకోవాలి!
మాయరోగాలు
మంచి చేసే అలవాట్లు!
…? కె.సహస్ర