నల్లగొండ, అక్టోబర్ 17: గతంతో పోలిస్తే ఈ సారి వైన్స్ టెండర్లు తగ్గాయి. టెండర్లు వేసేందుకు ఈసారి వ్యాపారులు పెద్దగా అసక్తి చూపకపోవటంతో గతంలో కంటే బాగా తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం నాటికి మొత్తం దరఖాస్తులు 4,613 మాత్రమే వచ్చాయి. జిల్లాలో మొత్తం 154 వైన్ షాప్‌లు ఉండగా గత ఏడాది 7057 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ సారి అదే రెండు సంవత్సరాల గడువుతో పాటు రూ.3 లక్షల రుసుము పెంచడంతో వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. శనివారం నాటికి సాధ్యమైనంత వరకు ఎక్కువగా వేయటంతో ఒక్కరోజే దరఖాస్తులు వచ్చాయి.
సూర్యాపేట జిల్లాలో తగ్గిన ఆదాయం
సూర్యాపేట, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా లో మద్యం షాపులకు అనుకున్న స్థాయిలో టెండర్లు పడలేదు. గత టెండర్ల సమయంలో 4338 టెండర్లు దాఖలు కాగా ఈ సారి గడు వు ముగిసే సమయానికి 93 షాపులకు గాను దాదాపు 1800లు తగ్గి కేవలం 2500 దరఖాస్తులు రావడం గమనార్హం. ప్రభుత్వం జిల్లా నుంచి డిపాజిట్ల రూపంలో ఈ సారి 100 కోట్లు రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుండగా 12 కోట్ల వరకు తగ్గినట్లే. దీనంతటికీ కొంతమంది అక్రమార్కులు కుట్రపన్ని సిండికేట్‌గా ఏర్పడి తక్కువ మంది టెండర్లు వేసేలా చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
టెండర్లు తక్కువ…
గతంతో పోలిస్తే దాదాపు 50శాతం టెండర్లు నమోదయ్యాయి. మద్యం వ్యాపారులు కొందరు జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి అండతో మాఫియాగా మారి టెండర్లు ఎక్కువగా వేయకుండా కట్టడి చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాడు ఒక్కో టెండర్ తోపాటు డిపాజిట్ రూ.2 లక్షల చొప్పన జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ.86.76 కోట్ల ఆదాయం రాగా ఈసారి ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు డిపాజిట్‌ను రూ.3లక్షలకు పెంచి వంద కోట్ల వర కు వస్తుందని అంచనాలు వేసింది.గడువు ముగిసే శనివారం రాత్రి 9 గంటల సమయానికి 2400 టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ.75 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. గతేడాదితో పోలిస్తే దాదాపు రూ.12 కోట్లు తగ్గినట్లే.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,647 దరఖాస్తులు
కాంగ్రెస్ సర్కార్‌కు మద్యం దుకాణాల పంట పండింది. ప్రభుత్వానికి దరఖాస్తుల ద్వారా మస్తు ఆదాయం వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి 8గంటల వరకు 2647 దరఖాస్తులు అందాయి. అంటే ఒక్క జిల్లాలోనే.. ఒక్క దరఖాస్తులపైనే రూ. 79కోట్ల 41లక్షల ఆదాయం సర్కారు ఖాతాలో జమ అయ్యింది. గత ఎక్సైజ్ సం వత్సరంతో పోలిస్తే ఈ సారి దరఖాస్తులు తగ్గినప్పటికీ ఆదాయంలో మాత్రం పెద్దగా మార్పులు లేవు. 2023-25 ఎక్సైజ్ సంవత్సరంలో 3969 దరఖాస్తులతో రూ. 79.38 కోట్ల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. 2021-23లో 1379 దరఖాస్తులతో రూ.27.58 కోట్లు వచ్చాయి. 2019-21లో 69 దుకాణాలు ఉం డగా, 1620 అప్లికేషన్లతో రూ. 31.40 కోట్ల రెవెన్యూ వచ్చింది. మోటకొండూరులో తక్కువ పోటీ ఉన్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి చెప్పారు.
మూడు రోజుల్లోనే 23వందలు..
జిల్లాలో మొత్తం 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి షాపుల కోసం దరఖాస్తులు స్వీకరించగా, శనివారం ఈ పక్రియ ముగిసింది. షెడ్యూల్ ప్రారంభంలో దరఖాస్తుల స్వీకరణ నెమ్మదించగా.. గత మూడు రోజుల్లోనే భారీ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. శుక్రవారం 687, గురువారం 607 దరఖాస్తులు స్వీకరించారు. చివరి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు క్యూ కట్టారు. రాత్రి వరకు కూడా ఆబ్కారీ అధికారులు దరఖాస్తులను తీసుకున్నారు. దాదాపు వెయ్యి వరకు వచ్చినట్లు తెలుస్తున్నది.