ఆ అమ్మ మనస్సుకు గాయమైంది.. పెండ్లి రోజు భర్త తనను, బిడ్డల్ని నిరాదరించాడని మనస్తాపం చెందింది. కడుపున పుట్టిన కన్నబిడ్డలకు మరణ శాసనం రాసి..తానూ తనువు చాలించాలనుకున్నది. క్షణికావేశంలో కన్నబిడ్డల గొంతు నులిమేసింది…కుమారుడు ప్రాణాలు కోల్పోగా, కుమార్తె ప్రాణాపాయస్థితికి చేరుకున్నది. బిడ్డలు చనిపోయి ఉంటారని భావించిన ఆ గృహిణి..ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయవిదారకర ఘటన బోరబండ పెద్దమ్మనగర్ బస్తీలో చోటుచేసుకున్నది. విగతజీవులుగా మారిన సత్యవేణి(33), ఆమె కుమారుడు రుద్రాన్ష్(5)లను చూసి..కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. కొన ఊపిరితో ఉన్న కుమార్తె తన్విక(2) దవాఖానలో చికిత్స పొందుతున్నది.
వెంగళరావునగర్, మార్చి 14: బిడ్డ కాల్లో ముల్లు గుచ్చుకుంటేనే తల్లి మనస్సు తల్లడిల్లుతోంది. ఎన్ని కష్టాలైనా భరించి బిడ్డల్ని బాగా చూసుకోవాలనుకుంటుంది తల్లి. కంటికి రెప్పలా బిడ్డల్ని ప్రాణప్రదంలా చూసుకుని మురిసిపోతుంది మాతృమూర్తి. అలాంటి ఆ అమ్మ మనస్సుకు గాయమై ఆవేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. పెళ్లి రోజున భర్త తనను, బిడ్డల్ని నిరాదరించాడని ఆ ఇల్లాలు భావించి కడుపున పుట్టిన కన్నబిడ్డలకు మరణ శాసనం రాసి..తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. పోలీసుల కథనం ప్రకారం బోరబండలో నివాసం ఉండే మురళీవేణు విద్యుత్తుశాఖ కాంట్రాక్ట్ బేసిస్పై జూనియర్ లైన్మెన్గా పనిచేస్తుంటారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సత్యవేణితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా రుద్రాన్ష్ (5), తన్విక (2) సంతానం కలిగారు.
గత కొంత కాలంగా మురళీవేణు తన తండ్రి కిడ్నీలు పాడవడంతో రెండు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మురళీవేణు, సత్యవేణిల పెళ్లిరోజు. మీరు రోజూ కుటుంబానికి తగిన సమయం ఇవ్వడం లేదు. మీతో, పిల్లలతో కలిసి ఈ రోజంతా సంతోషంగా గడుపుదామని ఆ ఇల్లాలు భర్త వేణును కోరింది. తండ్రికి డయాలసిస్ చేయించాల్సి ఉందని..దవాఖానాకు తీసుకెళ్లాలని..మరో రోజు తప్పక ఉంటానని అతను చెప్పినా ఆమె వినలేదు. తమ కుటుంబాన్ని పట్టించుకోకుండా భర్త నిరాదరిస్తున్నాడని కన్నీళ్ల్లు పెట్టుకుంది. భర్త దవాఖానాకు వెళ్లాక బిడ్డలు రుద్రాన్ష్, తన్వికల గొంతు నులిమేసింది ఆ తల్లి.
ఐదేళ్ల కుమారుడు రుద్రాన్ష్ అమ్మ చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. రెండేళ్ల తన్విక గొంతు నులిమినప్పుడు అమ్మ చేతి గాట్లు పడ్డాయి. బిడ్డలు చనిపోయి ఉంటారని భావించిన తల్లి సత్యవేణి ఇంట్లోని ఫ్యానుకు చీరతో తన మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హౌస్కీపింగ్ పని చేసే సత్యవేణి అత్త విధులు ముగించుకుని ఇంటికి చేరుకుంది. ఇంట్లో నుంచి టీవీ శబ్దం గట్టిగా రావడం గమనించి ఇంట్లోకి వెళ్లి చూసి ఆర్తనాదాలు చేస్తూ బయటకు వచ్చింది. ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే సత్యవేణి ఉరికి వేలాడుతూ కనిపించింది. ఐదేళ్ల కుమారుడు రుద్రాన్ష్ చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.
కొన ఊపిరితో కొన్న రెండేళ్ల కుమార్తె తన్వికకు చికిత్స కోసం దవాఖానాకు తరలించారు. కట్టుకున్న భార్య సత్యవేణి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుని తనకు ఇంత అన్యాయం చేస్తుందని భావించలేదని భార్యా, కుమారుడి మృతదేహాలపై పడి మురళీవేణు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతి చెందిన సత్యవేణి, ఐదేళ్ల కుమారుడు రుద్రాన్ష్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ప్రభుత్వ దవాఖానా మార్చురీకి తరలించారు. బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.