లండన్: పసివయసులోనే 64 గళ్ల ఆటపై మక్కువ పెంచుకుని ఆటలో అద్భుతాలు సృష్టిస్తున్న బోదన శివానందన్, శ్రేయస్ రాయల్ బ్రిటన్ గడ్డపై సత్తాచాటారు. 122 ఏండ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక బ్రిటీష్ చెస్ చాంపియన్‌షిప్స్‌లో భారత సంతతికి చెందిన ఈ ఇద్దరు చెస్ ప్లేయర్లూ.. తమ విభాగాల్లో టైటిళ్లు గెలిచి ఔరా అనిపించారు. సుమారు 1,750 మంది ప్లేయర్లు పాల్గొన్న ఈ టోర్నీలో 11 ఏండ్ల బోదన.. మహిళల విభాగంలో చాంపియన్‌గా నిలువగా ఓపెన్ కేటగిరీలో17 ఏండ్ల శ్రేయస్ విజయం సాధించాడు. ఆదివారం ఉత్కంఠగా జరిగిన ర్యాపిడ్ చెస్ ప్లేఆఫ్స్‌లో బోదన.. ఐర్లాండ్‌కు చెందిన 14 ఏండ్ల త్రిషా కన్యమరలను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆ చిన్నారి బ్రిటన్ యంగెస్ట్ ఉమెన్స్ చెస్ చాంపియన్‌గా సరికొత్త రికార్డులు సృష్టించింది.
నార్త్ వెస్ట్ లండన్‌లో నివసిస్తున్న బోదన.. కోవిడ్ సమయంలో చెస్ నేర్చుకుంది. ఇప్పటికే యూకే ఓపెన్ ఉమెన్స్ బ్లిట్జ్ చాంపియన్ గెలవడంతో పాటు బ్రిటీష్ ఉమెన్స్ ర్యాపిడ్ విజేతగా నిలిచి సత్తాచాటింది. తాజాగా క్లాసికల్ ఫార్మాట్లోనూ ఆమె టైటిల్ గెలవడం గమనార్హం. ఇక ఓపెన్ విభాగంలో శ్రేయస్.. తొమ్మిది రౌండ్ల తర్వాత బ్రిటన్‌లో అగ్రశ్రేణి గ్రాండ్మాస్టర్లను దాటుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన నిలిచి విజేతగా నిలిచాడు. 15 ఏండ్ల వయసులోనే ఇంగ్లండ్‌లో అతిపిన్న గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపుపొందిన అతడు.. పుట్టింది బెంగళూరులోనే. ఎనిమిదేండ్ల క్రితం శ్రేయస్ తల్లిదండ్రులు లండన్‌లో స్థిరపడ్డారు.