హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం మారిన తర్వాత రైతులను కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. సర్కారు నిర్లక్ష్యం అన్నదాతకు పెను శాపంగా మారింది. అన్ని పంటల కోతలు మొదలైనా కొనే దిక్కులేక రైతన్న అల్లాడిపోతున్నాడు. ధాన్యం కోతలు మొదలైనా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. పత్తి తీత మొదలైనా కొనుగోళ్ల ప్రస్తావన లేదు. మక్కలు చేతికొచ్చినా కొనుగోళ్లలో వేగం లేదు. ఇలా.. ప్రభుత్వ పట్టింపు లేనితనం అన్నదాతను కష్టాల్లోకి నెడుతున్నది. ప్రభుత్వంపై ఆశలు పెట్టుకోకుండా ప్రైవేటుగా అమ్ముకుందామంటే వారు మద్దతు ధరలో సగానికి సగం కోతపెడుతున్నారు. దీంతో తమ పంటలు కొనేదెవరో తెలియక అల్లాడిపోతున్నారు. అమ్ముకునే దారి కనిపించక గగ్గోలు పెడుతున్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని సీఎంతోపాటు మంత్రులందరూ చెప్తూ వచ్చారు. కానీ, ఆ హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ నెల 1 నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే పనిలోనే ఉన్నది. అక్టోబర్ రెండోవారంలో పత్తి కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కానీ టెండర్లే పూర్తికాలేదు. ఇక, మక్కల కొనుగోలు నత్తనడకన సాగుతున్నది.
అరకొరగా ప్రారంభం
అక్టోబర్ 1 నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనునట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అక్టోబర్‌లో 6.89 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకోగా ఇప్పటి వరకు 300 టన్నులు కూడాదాటలేదు. ఇక పత్తి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది. ఇప్పటికే వర్షాలతో దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోయారు. దీనికి తోడు బహిరంగ మార్కెట్లోనూ పత్తికి ధర దక్కడం లేదు. ఈ సీజన్లో 46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 25 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనా.
మక్క రైతులది మరో బాధ
మక్క రైతుల పరిస్థితి మరోలా ఉన్నది. నిరుడు మద్దతు ధరకు మించి పలకగా, ఈసారి ధర భారీగా పడిపోయింది. మక్క రైతుల పక్షాన బీఆర్ఎస్ రంగంలోకి దిగడంతో స్పందించిన సర్కారు కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పింది. ఈ సీజన్లో 6.24 లక్షల ఎకరాల్లో మక్క సాగు కాగా 11.56 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని, ఇందులో 8.66 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు.
కేంద్రంవైపు చూపు
మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రంపై ఆధారపడుతున్నది. కేంద్రం కొనడం లేదంటూ నిందలు మోపుతున్నది. పత్తి, మక్కలతోపాటు సోయాబీన్, పెసర్లు, జొన్నల కొనుగోళ్ల కోసం కూడా కేంద్రంవైపే చూస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే తాము కొనగలమని, లేదంటే కష్టమేనన్న సంకేతాలు పంపిస్తున్నది.
వర్షాలకు తడిసి… కన్నీరు మిగిల్చి
ఈ సీజన్లో పంటలు కోతకొచ్చిన సమయంలో విపరీతమైన వర్షాలు కురిశాయి. దీంతో ధాన్యం, పత్తి, మొక్కజొన్న, పెసర రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆరబెట్టిన ధాన్యం, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం వర్షాలకు తడిస్తే రైతులు గుండెలు బాదుకుంటున్నారు. వర్షాలకు తడిసిన పత్తి నల్లబారుతున్నది. చెట్టుకు గులాబీ పురుగు సోకుతున్నది. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు పత్తిని కొనుగోలు చేయడం లేదు.
ఏ పంటకూ దక్కని మద్దతు ధర
ఈ సీజన్లో ఏ ఒక్క పంటకు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కడం లేదు. మద్దతు ధర క్వింటాలుకు రూ. 2,389గా ఉంటే మార్కెట్లో రూ. 1,700 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక పత్తి ధర రూ. 8,110 ఉండగా మార్కెట్లో రూ. 5-6 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న ధర రూ. 2,400 ఉండగా ప్రైవేటు వ్యాపారులు రూ.1,700-1,900 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా ఏ పంటకూ మద్దతు ధర దక్కక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆరుబయటే తెల్లబంగారం
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట చేతికొచ్చి పది రోజులు దాటినా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో తెల్లబంగారాన్ని నిల్వ చేస్తున్నారు. రాత్రి, పగలు పంట నిల్వల వద్ద కాపాలా కాస్తూ ఎప్పుడు వర్షం ముంచుకొస్తుందోనని బెంబేలెత్తుతున్నారు. సీసీఐ ఆధ్వర్యంలో మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు