‘బలిపీఠంపై సిద్ధంగా ఉన్న వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియాలంటే తాను బతికి ఉండాలని, అది జరగాలంటే తాను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను చెప్పాలం’టూ సైకో ట్విన్స్, సైకో రవి తరహాలో గేమ్ స్టార్ట్ చేసిన సీఐ శరత్..బలివ్వాల్సిన తొలి వ్యక్తి అప్పటికే చనిపోయినట్టు చెప్పడంతో ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్ అక్కడికి పరుగుపరుగున వెళ్లారు. తల లేని మొండెం.. అదీ రెండు భాగాలుగా ఉండటాన్ని చూసి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.
ఇంత దారుణానికి ఒడిగట్టిన శరత్‌ను ముక్కలు ముక్కలుగా నరుకాలన్న కోపంతో రుద్ర అండ్ టీమ్ మళ్లీ డెన్‌కు తిరిగొచ్చారు. ‘అసలు నువ్వు మనిషివేనా?’ అంటూ పక్కనే ఉన్న ఓ రాడ్‌తో శరత్ ముఖంపై కొట్టాడు రుద్ర. నోటి నుంచి రక్తం చిందింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతూ శరత్ ఇలా మూలుగుతూ అన్నాడు. ‘ఏయ్ రుద్ర.. నేను చనిపోతే.. మిగతా 15 మంది జాడ నీకు తెలియదు. వాళ్లను కాపాడుకోవాలంటే నేను బతికి ఉండాలిరా.. పిచ్చోడా’ అంటూ బాధలోనూ సన్నగా నవ్వాడు శరత్. దీంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకొన్న రుద్ర.. శరత్‌తో ఇలా అన్నాడు. ‘నువ్వు ఏం సాధించాలనుకొన్నావో దాన్ని చెడగొట్టింది నేను. చంపాలనుకొంటే నన్ను చంపు. ప్లీజ్.. ఇక, ఈ మారణహోమం ఆపేయ్. ఆ 15 మందిని ఎక్కడ బంధించావో చెప్పు’ అంటూ శరత్ ముందు ప్రాధేయపడ్డాడు రుద్ర. అంతలోనే బిగ్గరగా నవ్విన శరత్.. ‘ఒరేయ్ రుద్ర.. నేను గేమ్‌స్టార్ట్ చేసేప్పుడే క్లియర్‌గా చెప్పా.. గుర్తుందా..? బంధించిన వాళ్లను రక్షించడానికి నిన్ను పిచ్చి కుక్కలా పరిగెత్తిస్తానన్నా.. ఐదేండ్ల నా నిరీక్షణను నీ కంట రక్తకన్నీరుగా కార్పిస్తానన్నా.. ఇప్పుడు అదే చేస్తున్నా. ఇదంతా వద్దని నువ్వు అనుకొంటే.. ముందు నా క్వశ్చన్ గేమ్‌లో విజయం సాధించు. ఆ తర్వాత వాళ్లను కాపాడుకో. ఇంకో విషయం. ఇప్పుడు ఆల్రెడీ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఒక విషయం నీకు చెప్తా’ అంటూ చెప్పడం ప్రారంభించాడు శరత్. జాగ్రత్తగా వింటున్నారు రుద్ర, రామస్వామి, స్నేహిల్, జయ, శివుడు.
‘తాజాగా బలిచ్చిన వ్యక్తి ఓ అమ్మాయి. పేరు చంద్రమతి. ఇక్కడే నల్లమలలో ఉండేది. మొన్నీమధ్యే పెండ్లయ్యింది. ఎంతో సౌందర్యవతి. సత్యహరిశ్చంద్రుడి సతీమణి చంద్రమతి ఎలాగో ఈమె కూడా అలాగే. ఐ మీన్ అంతటి పతివ్రత. అలనాటి చంద్రమతి మాంగల్యం హరిశ్చంద్రుడికి మినహా ఎవరికీ కనిపించేది కాదు. అయితే, ఈ చంద్రమతి సోయగం బయటివారికే కాదు భర్తకు కూడా దక్కలేదు. దానికి కారణం నేనే. విష్ణుమూర్తి జాతకంలో పుట్టిన వాళ్లు సంభోగంలో పాల్గొంటే పూజకు నిషిద్ధులు అవుతారు. అందుకే, అదే జాతకంలో పుట్టిన చంద్రమతి పెండ్లిని ఆపలేకపోయిన నేను.. భర్తతో కలవడాన్ని మాత్రం ఆపగలిగా. అడవిలో దొరికే ప్రమాదకర చెట్ల పసరును ఇచ్చి అతనికి ఓ భయంకర రోగం వచ్చి మంచాన పడేలా చేశా. అలా చదువులేని చంద్రమతికి భర్తను కాపాడుకోవడానికి డబ్బు అవసరపడింది. ఇదే అదునుగా ఆమెను నా యాగానికి వాడుకోవాలనుకొన్నా. ఆమెతో.. తన భర్తను రక్షిస్తానని చెప్పి నమ్మించా. పిచ్చిది నమ్మింది. నాతో వచ్చింది. అలా ఆమెకు తెలియకుండానే ఆమెకు లింగమార్పిడి చేయించా’ అంటూ చెప్తూ పోతున్న శరత్‌ను హీనంగా చూస్తున్నారు అందరూ. ‘ఆపరేషన్ అయ్యాక మెలకువలోకి వచ్చిన ఆ పిచ్చిదానికి విషయం ఈజీగానే అర్థమైనట్టుంది. గొడవ చేసింది. నా ైస్టెల్లో చితకబాదా. నిజానికి ఆమె అందాన్ని నేను కూడా చవిచూడాలనుకొన్నా. అయితే, ఈ యాగంలో పాల్గొనే వ్యక్తులు అగ్ని అంత పవిత్రంగా ఉండాలని చెప్పాగా. అందుకే ఆగిపోయా’ అంటూ శరత్ ఇంకా ఏదో చెప్తూపోతుండగానే రుద్ర అతని చెంపను ఛెల్లుమనిపించాడు. ఇంకా కొట్టబోతుండగా.. ‘రుద్ర.. వెయిట్. మన ఫైటింగ్ తర్వాత చూసుకొందాం గానీ.. ఇప్పుడు ఏంచేసినా చంద్రమతిని మళ్లీ బతికించలేవు. కానీ, ఆమె మాంగల్యాన్ని అంటే ఆమె భర్తను కాపాడగలవు. నేను అడిగే ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఆమె భర్త అడ్రస్‌తో పాటు అతని జబ్బు ఎలా తగ్గుతుందో కూడా చెప్తా’ అంటూ శరత్ డైరెక్ట్ ఆఫర్ ఇచ్చాడు. ఏమీచేయలేక సరేనన్నాడు రుద్ర. శరత్ ప్రారంభించాడు.
మొదటి ప్రశ్న: ‘నేను ‘అవును’ అని చెప్పలేని క్వశ్చన్ అడుగు.. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్..’ రుద్ర ఆన్సర్ చెప్పాడు. ‘రెండో ప్రశ్న.. గుడిలో పూజారులుగా మహిళలు ఎందుకు ఉండరు?.. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. ‘నేను అడిగే మూడో ప్రశ్నకు మూడు సమాధానాలు చెప్తే.. నాలుగు, ఐదో ప్రశ్న అడుగను. ఓకేనా? మై డియర్ రుద్ర’ అంటూ నవ్వాడు శరత్. సరేనంటూ తలూపాడు రుద్ర. ‘ఇంగ్లీష్ వర్ణమాలలో a, e, i, o, u అనే అచ్చులతో ఎండ్ అవని తెలుగు మహిళల మూడు పేర్లు చెప్పు. ఇంగ్లీష్ పేర్లు a, e, i, o, uల్లో ఏ ఒక్క లెటర్‌తో వారి పేర్లు పూర్తికావొద్దు. మృణాల్ ఠాకూర్, పాయల్ రాజ్‌పుత్ అంటూ హీరోయిన్ల పేర్లు చెప్తావేమో.. వాళ్లందరూ నార్త్. నాకు అచ్చమైన తెలుగు వారి పేర్లు కావాలి. అది కూడా పైన ఇచ్చిన కండిషన్ ప్రకారం.. ఓకేనా?? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. వన్, టూ, త్రీ, ఫోర్..’ రుద్ర సమాధానం చెప్పాడు. దీంతో అన్ని ఆన్సర్లను రుద్ర కరెక్ట్‌గా చెప్పడంతో చంద్రమతి భర్త అడ్రస్‌తో పాటు అతని వ్యాధి నయంచేసే మూలికల గురించి చెప్పాడు శరత్. వెంటనే అక్కడి నుంచి బయల్దేరుతున్న రుద్రతో శరత్ ఇలా అన్నాడు. ‘ఏయ్.. రుద్ర. చంద్రమతిని బలివ్వాలనుకొంటే ఎలాగైనా ఇవ్వొచ్చు. అయితే, తలను, మొండాన్ని ఎందుకు వేరుచేశాను? తల నుంచి వేరైన మొండాన్ని మళ్లీ రెండు భాగాలుగా ఎందుకు చేశాను? తెలుసా’ అంటూ భయంకరంగా నవ్వాడు శరత్. దీంతో రుద్ర అండ్ టీమ్ నిశ్చేష్టులయ్యారు. అది పక్కనబెడితే, రుద్ర సమాధానాలు మీరు కనిపెట్టారా?
సమాధానం:
మొదటి అన్సర్: నువ్వు చనిపోయావ్
రెండో ఆన్సర్: స్త్రీలకు నెలసరి సమస్యలు ఉంటాయి. అందుకే
మూడో ఆన్సర్: సూర్యాకాంతం, భాగ్యం, బసవతారకం
(ఈ మూడు పేర్లను రుద్ర చెప్పాడు)
-రాజశేఖర్ కడవేర్గు