హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ).. ప్రస్తుతం అంతర్జాతీయ కంపెనీలు పఠిస్తున్న మంత్రమిది! ఉత్తమ సదుపాయాలు, అత్యున్నత మానవ వనరులు, వ్యాపార అనుకూల విధానాలు పాటించే దేశాలు, రాష్ర్టాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ కార్పొరేట్ కంపెనీలు ఎంచుకున్న మార్గం. ఆయా సంస్థల ప్రధాన కేంద్రాలతో సమానంగా జీసీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇలాంటి జీసీసీలను ఆకర్షించడంలో తెలంగాణ ‘పవర్ హౌస్’గా నిలిచింది. దేశంలో ఏర్పాటవుతున్న జీసీసీల్లో అత్యధికంగా 40 శాతం సంస్థలను ఆకర్షించి అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరు 33 శాతంతో రెండో స్థానానికే పరిమితమైంది. మానవ వనరులను అందించే సంస్థ ‘ఎక్స్‌ఫినో’ తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ వ్యాపార సంస్థలను ఆకర్షించడంలో హైదరాబాద్ టాప్‌లో నిలిచి ‘ది నెక్ట్స్ జెన్ జీసీసీ పవర్ హౌస్’గా మారిందని ప్రశంసించింది. ఒకప్పుడు జీసీసీలను ఆకర్షించడంలో బెంగళూరు ముందుండగా, హైదరాబాద్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. దీనికి మాజీ సీఎం కేసీఆర్ దార్శనికత, కేటీఆర్ చొరవ, బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల కృషే కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో 360 జీసీసీలు
ఇతర దేశాల్లోని ప్రతిభావంతుల సేవలు, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని తక్కువ ఖర్చుతో ఉపయోగించుకోడానికి మల్టీనేషనల్ కంపెనీలు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. వాటినే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ)గా పిలుస్తారు. ఆ కంపెనీలు తమ వ్యాపార వృద్ధికి ఈ కేంద్రాల్లోని మానవ, సాంకేతిక వనరులను వినియోగించుకుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 360కిపైగా జీసీసీలు ఉన్నట్టు ఎక్స్‌ఫినో తెలిపింది. మొత్తం 3.1 లక్షల మంది నిపుణులు ఉద్యోగాలు చేస్తున్నట్టు పేర్కొన్నది. రాష్ట్రంలోని వైట్ కాలర్ వర్క్‌ఫోర్స్‌లో వీరు 14 శాతంగా వెల్లడించింది. తెలంగాణ జీసీసీ ఎకో సిస్టమ్ పాజిటివ్ టాలెంట్ బ్యాలెన్స్ (పీటీబీ) 6,400 మంది ఐటీ నిపుణులు ఉన్నట్టు చెప్పింది. రాష్ట్రంలోని జీసీసీ వర్క్ ఫోర్స్‌లో 33 శాతం మంది మహిళలు ఉన్నట్టు తెలిపింది. గత మూడేండ్లలో దేశానికి వచ్చిన జీసీసీల్లో 40 శాతం హైదరాబాద్ ఆకర్షించినట్టు వివరించింది. బెంగళూరు 33 శాతానికే పరిమితమైనట్టు వెల్లడించింది.
కేసీఆర్ పాలన.. కేటీఆర్ చొరవ
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన తర్వాత కేసీఆర్ హయాంలో చేపట్టిన సంస్కరణలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలితంగానే రాష్ర్టానికి జీసీసీలు క్యూ కట్టాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు తమ జీసీసీలను ఏర్పాటు చేసే ముందు ఒక ప్రాంతం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాయి. అక్కడి మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, రాజకీయ స్థిరత్వం, పాలనా విధానాలు, వ్యాపార అనుకూల పాలసీలు, శాంతి భద్రతలు తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే జీసీసీల ఏర్పాటుకు ముందుకు వస్తాయి. భవిష్యత్తులో జీసీసీ మార్కెట్‌ను, ఐటీ విస్తరణను ముందుగానే గుర్తించిన కేటీఆర్.. ఈ దిశగా అడుగులు వేశారు. మానవ వనరుల అభివృద్ధి కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఏర్పాటు చేశారు. ఇందులో ఇస్తున్న శిక్షణ జీసీసీలతోపాటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగార్థులకు ఎంతగానో దోహదపడుతున్నది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద, దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్‌గా రికార్డు సృష్టించిన టీహబ్, టీహబ్ 2.0, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ హబ్ వంటివి కేటీఆర్ ఆలోచనల్లోంచి పుట్టినవే. వీటితో యువత పారిశ్రామికవేత్తలుగా, ఆవిష్కర్తలుగా ఎదగడమేకాకుండా, గ్లోబల్ కంపెనీలకు నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అందుబాటులోకి వచ్చారు. మరోవైపు ప్రభుత్వ పరంగా కేసీఆర్ దార్శనికతతో అనేక వినూత్న పాలసీలు అమల్లోకి వచ్చాయి. పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతి ఇచ్చేలా టీఎస్ ఐపాస్‌ను ఆవిష్కరించారు. ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఐటీ పాలసీలను ప్రకటించారు. ఇందులో భాగంగా 2016, 2021లో పాలసీలను రూపొందించి విజయవంతంగా అమలుచేశారు. మౌలిక సదుపాయాల కల్పన, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేని విధానాలు అవలంబించారు. ఎస్ఆర్డీపీ కింద విస్తృతంగా ఫ్లైఓవర్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, మెట్రో వంటి సదుపాయాలతో హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు, అంతర్జాతీయ విమానాశ్రయానికి గంటలోపే చేరుకునే సౌలభ్యం కలిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ శాఖ పరిధిలో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్‌ను ఏర్పాటు చేసి 10 టెక్నాలజీలను ప్రభుత్వ కార్యకలాపాలకు సమర్థవంతంగా వినియోగించింది.
ఇక తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు కేటీఆర్ స్వయంగా అంతర్జాతీయ కంపెనీలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. పెట్టుబడి అవకాశాలు ఉన్న ప్రతి చోటుకు స్వయంగా తానే వెళ్లి, కంపెనీల ప్రతినిధులతో రోజులపాటు చర్చలు జరిపి, తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించి, పెట్టుబడులు తరలి వచ్చేలా కృషి చేశారు. ఈ చర్యలన్నింటి ఫలితంగా జీసీసీలు రాష్ర్టానికి ‘క్యూ’ కట్టాయి. ప్రపంచంలోని టాప్-5 కంపెనీలు తమ రెండో అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమే కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు, కేటీఆర్ కృషికి నిదర్శనం. హైదరాబాద్‌లో గురువారం జరిగిన జీసీసీ సమ్మిట్‌లో ఐటీ రంగ అభివృద్ధికి కేటీఆర్ చేసిన కృషి గురించి నిర్వాహకులు ప్రత్యేకంగా కొనియాడటం విశేషం. ట్రంప్ అస్తవ్యస్త విధానాలతో, అడ్డగోలు నిబంధనలతో అమెరికన్ కంపెనీలు ఇరకాటంలో పడ్డాయని, జీసీసీల వైపు మొగ్గు చూపుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ కారణంగా అమెరికన్ మార్కెట్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఏర్పడిందని, ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా మలుచుకుంటే తెలంగాణకు మరిన్ని జీసీసీలు తరలివస్తాయని సూచిస్తున్నారు.
మానవ వనరులు, మౌలిక సదుపాయాలే కారణం
‘ఇండియా నెక్ట్స్ జనరేషన్ జీసీసీ పవర్ హౌస్’గా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది. నైపుణ్యం ఉన్న ఉద్యోగులు, అద్భుతమైన మౌలిక సదుపాయాల కారణంగా గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ తెలంగాణ వైపు చూస్తున్నాయి. మేము చేసిన అధ్యయనంలో హైదరాబాద్‌లో జీసీసీల ఏర్పాటుకు పాలసీల రూపకల్పన కీలకంగా మారినట్టు తేలింది.
– కమల్ కరంత్, ఎక్స్‌ఫినో కో ఫౌండర్
రాష్ట్రంలో అత్యున్నతంగా ట్యాలెంట్ పూల్
తెలంగాణలో అత్యున్నత స్థాయిలో టాలెంట్ పూల్, టెక్నాలజీ రంగంలో వృద్ధి కారణంగా జీసీసీలు రాష్ర్టానికి వలస వస్తున్నాయి. మధ్య స్థాయితో పాటు, సీనియర్ లెవల్ ప్రొఫెషనల్స్ అధికంగా ఉండటంతో అంతర్జాతీయ స్థాయి సంస్థలు హైదరాబాద్‌ను తమ జీసీసీలకు అనువైనవిగా భావిస్తున్నాయి.
– ఫ్రాన్సిస్ పదమదన్, ఎక్స్‌ఫినో సీఈవో
నివేదికలోని కీలక అంశాలు