EcoKaari | ‘ఇకోకారీ’లో ప్లాస్టిక్‌ను నేలపాలు కానీయరు. సముద్రం చేరనీయరు. రాట్నంపై వడికి దారం తీస్తారు. మగ్గంపై ప్లాస్టిక్ వస్త్రం నేస్తారు. కుట్టు మిషన్‌పై అందమైన బ్యాగులుగా రూపొందిస్తారు. ప్రకృతికి ఇంతకు మించిన ఉపకారం ఉంటుందా?
చిప్స్, నూడుల్స్ ప్యాకెట్లు, శానిటరీ ప్యాడ్ కవర్లు, పాలిథిన్ బ్యాగ్‌లు, ప్యాకింగ్ షీట్స్ ఇలా.. ఎన్ని రూపాల్లో ప్లాస్టిక్ వినియోగంలో ఉందో.. అన్ని రకాలుగానూ పర్యావరణానికి కీడు జరుగుతున్నది. మట్టిలో, సముద్ర జలాల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ పోగుపడుతున్నది. పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ మహమ్మారి నుంచి ప్రకృతిని కాపాడే విషయంలో ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టమని పిలుపునిస్తున్నారు నందన్ భట్.
కాశ్మీర్లో పుట్టి, జమ్మూలో పెరిగి, పుణెలో స్థిరపడిన నందన్ భట్ ఉద్యోగ విధుల్లో భాగంగా సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు. ప్రకృతి అందాలకు పరవశించేవాడు. పచ్చని ప్రకృతిని ప్లాస్టిక్‌తో కలుషితం చేయడం ఆయనను కలచివేసింది. అదే సమయంలో పేద మహిళలు ఉపాధి కోల్పోవడం గమనించాడు. చేనేత వృత్తికి ఆదరణ లేక మగ్గాలు మూలనపడటం అతని దృష్టిని దాటిపోలేదు. చేతి వృత్తులు ఎప్పుడో ఆదరణ కోల్పోయాయి. వీటివల్ల ఎక్కువగా ఉపాధి పొందేది మహిళలే. ఆ మహిళలకు ఉపాధిగా, ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారంగా ఇకోకారీ (Eco Kaari) సంస్థను ప్రారంభించాడు నందన్. ప్లాస్టిక్ సమస్య, చేతివృత్తుల సంక్షోభం.. ఈ రెంటినీ అధిగమించేందుకు పుణెలో ప్రారంభమైన ఇకోకారీ కొత్తదారి పట్టింది.
ఇకోకారీలో పనిచేసే మహిళలు వివిధ ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. వాటన్నిటినీ శుభ్రపరుస్తారు. కుప్పలుగా పోగుపడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని ముక్కలు ముక్కలుగా కత్తిరిస్తారు. చరఖాపై ఒక్కో ముక్కను జతచేస్తూ ప్లాస్టిక్ దారం వడుకుతారు. ఆ దారాన్ని మగ్గంపైకి ఎక్కించి డుర్రీలు నేసినట్టే మందపాటి ప్లాస్టిక్ బట్టనేస్తున్నారు. ఆపై దానిని కావాల్సినట్టుగా కత్తిరించి చిన్నచిన్న పర్సులు, పెద్దపెద్ద బ్యాగులు కుడుతున్నారు. ఆడవాళ్ల అవసరాలకు తగ్గట్టు అనేక రూపాల్లో బ్యాగులు తయారు చేస్తున్నారు. అంతేకాదు ట్రావెల్, స్పోర్ట్స్ బ్యాగులు కూడా తయారు చేస్తున్నారు. ‘ప్లాస్టిక్‌ను పారేయకండి. ప్రాణకోటికి కీడు తలపెట్టకుండా మాకివ్వండి’ అంటున్న ఇకోకారీ సభ్యుల మాట కాదనకుండా ప్రకృతి ప్రేమికులు ప్లాస్టిక్‌ను అప్పగిస్తున్నారు. ఖరీదైన యంత్రాలు లేకుండా, మార్కెటింగ్ వ్యవస్థపై ఆధారపడకుండా ఇకోకారీలో పనిచేసే కార్మికులు ప్లాస్టిక్‌ను అప్‌సైకిల్ చేస్తున్నారు. కొత్తకొత్త డిజైన్లు రూపొందించేందుకు ఈ సంస్థలో రీసెర్చ్ నిపుణులు, డిజైనర్లు, మార్కెటింగ్ గురువులు ఉన్నారు.. వీళ్ల నాయకత్వంలో పేదింటి పుణె మహిళలు అనేక ప్రాంతాల నుంచి సేకరిస్తున్నారు. వాటిని దారంగా మార్చి, బ్యాగులుగా చేస్తున్నారు. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా మద్దతు ఇవ్వాల్సిందే.
Ecokaari1
Ecokaari3
Ecokaari5
Ecokaari7
“Plasticosis | ప్లాస్టిక్ కాలుష్యంతో ‘ప్లాస్టికోసిస్’ వ్యాధి”