Habit Coach with Ashdin Doctor | ‘ నేను ఎంబీయే చేద్దామనుకున్నా. సినిమాల్లో అవకాశం రావడంతో ఎంబీయే కల అలానే ఉండిపోయింది. సినిమాల్లోకి వచ్చి ఉండకపోతే.. ఏం చేయాలో ప్లాన్-బి కూడా సిద్ధం చేసి పెట్టుకున్నా అప్పట్లో’ ..ముంబైకి చెందిన పాడ్‌కాస్టర్, హ్యాబిట్ కోచ్ ఆష్దిన్ డాక్టర్ ప్రశ్నకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సమాధానం ఇది. నిజమే, జీవితం సాఫీగా సాగాలంటే ఒక ప్లాన్‌తో ముందుకు వెళ్లాలి. అది వర్కవుట్ కాకపోతే ప్లాన్- బి తయారుగా ఉండాలి.. ఇదే రకుల్ మాటల అంతరార్థం. అయితే.. లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగడం అనేది మనఅలవాట్ల మీదనే ఆధారపడి ఉంటుందంటున్నారు ఆష్దిన్ డాక్టర్.
‘అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నా, జీవితంలో పైపైకి ఎదగాలన్నా కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి’ .. అని చెబుతుంటారు చాలామంది. ‘కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడమంటే మన అలవాట్లను మార్చుకోవడమే’ అంటారు ఆష్దిన్. పొద్దెక్కేదాకా నిద్రపోవడం మానేయండి. సూర్యుడు రాకముందే మేల్కొని.. కొద్దిసేపు వ్యాయామం చేయండి. కడుపు నిండా తింటున్నారా? అయితే.. ఈరోజు నుంచి ఒక ముద్ద తక్కువ తినండి. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తున్నారా? అయితే.. ఇకపై రోజుకు పది గంటలు శ్రమించండి.. ఇవే ఆష్దిన్ చెప్పే సలహాలు. తను వృత్తిరీత్యా హ్యాబిట్ కోచ్. అలవాట్లే జయాపజయాలు, అలవాట్లే ఆరోగ్య అనారోగ్యాలు. కాబట్టి, అలవాట్లను మార్చుకుంటే జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చన్నది ఆయన సిద్ధాంతం. ‘ఈ రంగంలో సక్సెస్ కాకపోయి ఉంటే ఏం చేసేవారు?’ అంటూ ఆయన సంధించే ప్రశ్న.. ప్రతి మనిషికి ప్లాన్-బి ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది.
‘నిన్ను నువ్వు మార్చుకోవాలనుకున్నా.. కొత్తగా ఏదైనా సాధించాలనుకున్నా ముందుగా మారాల్సింది నీ ఆలోచనా విధానం కాదు.. నీ అలవాట్లు’ అంటారు ఆష్దిన్. ఐదేండ్ల క్రితం ఆష్దిన్ తీవ్ర పని ఒత్తిడికి లోనయ్యారు. సరైన ఆహారం, ఫిట్నెస్, వ్యాయామం, నిద్ర అన్నిటికీ దూరమయ్యారు. ఆరోగ్యం చెడిపోయిన తర్వాతే.. తన తప్పేమిటో అర్థమైంది. పశ్చాత్తాపం మొదలైంది. తన అలవాట్లు మొత్తం మార్చుకున్నారు. ఓ నెలరోజులో, ఆరు నెలలో కాదు.. జీవితాంతం అదే మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఆష్దిన్ ఆరోగ్యంలో, జీవితంలో చాలా మార్పులు తెచ్చింది. కారణాన్ని ఆరాతీశారు మిత్రులు. తను ఫాలో అవుతున్న లైఫ్స్టైస్టెల్ గురించి వివరించారు. వాళ్లకూ అదే సిఫారసు చేశారు. మరింత మందికి చేరవేయాలనే తపనతో హ్యాబిట్ కోచ్ అవతారం ఎత్తారు. పాడ్‌కాస్ట్‌లు ప్రారంభించారు. అలవాట్లను మార్చుకోవడం వల్ల జీవితంలో జరిగే మార్పుల గురించి వివరిస్తూ ఆష్దిన్.. ‘చేంజ్ యువర్ హ్యాబిట్స్.. చేంజ్ యువర్ లైఫ్’ అనే పుస్తకం కూడా రాశారు. ఈ పుస్తకం ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
‘ఆసమ్ 180’ ఆష్దిన్ డిజైన్ చేసిన ఓ మార్పు ప్యాకేజీ. ఓ ఐదు అలవాట్లను ఒక సెట్‌లా రోజూ అనుసరించమని చెబుతారు. మన లక్ష్యానికి అనుగుణమైన కొత్త అలవాట్లను పరిచయం చేస్తారు. మొత్తం 180 రోజులు తు.చ. తప్పక పాటించేలా ప్రాక్టీస్ చేయిస్తారు. ఒక మనిషి ఓ పనిని వరుసగా 40 రోజులు చేస్తే.. ఆ తర్వాత సులభమైపోతుంది. అలాంటిది ఏకంగా 180 రోజులు ఒక టార్గెట్ పెట్టుకొని అలవాట్లను కొనసాగించడం వల్ల జీవితంలో భాగమైపోతాయి. ఇదే కాన్సెప్ట్‌ని ‘ఆసమ్ 180’లో బోధిస్తారు. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, మోటివేషన్ గురువుల ఉపన్యాసాలు తాత్కాలికంగానే పనిచేస్తాయి. ఒకటిరెండు రోజులే ఉత్సాహాన్ని నింపు తాయి. అదే అలవాట్లను మార్చుకుంటే.. జీవితాంతం విజయం మన వెనకాలే నడుస్తుంది. సరికొత్త గెలుపు శిక్షకులు.. హ్యాబిట్ కోచ్‌లు నేర్పించేది, జీవనశైలిలో భాగం చేసేదీ ఆ మార్పునే.
➣ అలవాట్లు మార్చుకోవడం వల్ల మీలో కొత్త శక్తి నిండుతుంది.
➣ వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి.
➣ సృజనాత్మకత, ఉత్పాదకత పెరుగుతుంది.
➣ మీ సమయాన్ని నియంత్రించుకోగలరు.
➣ ఆరోగ్యం, ఫిట్నెస్ మీ గుప్పిట్లో ఉంటాయి.
➣ ఒత్తిడి అసలు మీ జోలికే రాదు.
“Sandeep Maheshwari | ఈ ఢిల్లీ కుర్రాడు ఫొటోలతో కోట్లు సంపాదిస్తూ ఎంతోమందికి రోల్ మాడల్‌గా మారాడు”
“Nikhil Kamath | 14వ ఏటనే బడి మానేసిన కుర్రాడు.. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌కే కింగ్ అయ్యాడు!!”