ఎర్రుపాలెం, సెప్టెంబర్ 13: ముఖ్యమంత్రి కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. అలాగే, తనను కూడా ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేసేందుకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మండలంలోని తక్కెళ్లపాడులో ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి వంద కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సంద్భంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి జడ్పీ చైర్మన్ కమల్రాజు.. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కమల్రాజు మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలను నమ్మించి ఎమ్మెల్యేగా మూడుసార్లు ఓట్లు వేయించుకున్న భట్టి విక్రమార్క.. ప్రస్తుతం నియోజకవర్గంలో కనిపించని పరిస్థితి నెలకొందని విమర్శించారు. కాగా, తొలుత గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు వారు శంకుస్థాపన చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, దేవరకొండ శిరీష, నరేందర్రెడ్డి, కరివేద వెంకటేశ్వరరావు, బ్రహ్మయ్య, రామకోటేశ్వరరావు, అప్పారావు, కొండేపాటి సాంబశివరావు, బాలరాఘవరెడ్డి, మదన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.