మధిర, జూన్ 25 : మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని మధిర రూరల్ సీఐ మధు అన్నారు. బుధవారం మండల పరిధిలోని దెందుకూరు గ్రామ జడ్పీహెచ్ఎస్లో మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు వాడటం అలవాటు చేసుకున్న వారు అనేక ఇబ్బందులు పడుతారన్నారు.
ఆర్థికంగా నష్టపోవడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. వీటిని సేవించిన వారి మానసిక పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నారు. విద్యార్థులు అలాంటి వారితో కలిసి ఉండటం మంచిది కాదన్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి, సిబ్బంది, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.