జాతరకు వెళ్లినట్లుగా ఉదయం నుంచే జనం వరుసబెట్టి పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. దేశాలు, నగరాలు, పట్టణాలకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, చదువుల నిమిత్తం వెళ్లిన వారు సైతం తమ తమ స్వగ్రామాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు తమకు కేటాయించిన బూత్‌ల వద్ద బారులుతీరి ఓట్లు వేశారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, వీల్ చైర్ల సాయంతో ఓట్లు వేశారు.
కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతీ యువకులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, బానోతు మదన్‌లాల్, లింగాల కమల్‌రాజు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.