భద్రాచలం, జూన్ 7 : రెండేళ్ల కిత్రం వినాయక నిమజ్జనం సందర్భంగా కొందరు యువకులతో కూడిన రెండు గ్యాంగ్‌ల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణలు ప్రస్తుతం తారాస్థాయికి చేరి.. తాజాగా ఓ నిండు ప్రాణాన్ని తీసేంత వరకూ వచ్చాయి. వారం రోజులుగా ఆ గ్యాంగ్‌ల సభ్యులు ఒకరికొకరు చేసుకుంటున్న వార్నింగ్‌లు.. అందులోని యువకుడిని మట్టుబెట్టేంత వరకూ వెళ్లాయి. ప్రధానంగా నాలుగు రోజుల క్రితం పెల్లుబికిన ఈ వార్‌లో.. రెండు రోజుల క్రితమే ఆ యువకుడిని ఆయుధాలతో అంతం చేసేందుకు ప్రత్యర్థులు ప్లాన్ చేశారు. శుక్రవారం రాత్రే దానిని అమలు చేసేందుకు స్కెచ్ వేశారు.
అది మిస్ కావడంతో రాత్రంతా ఆ యువకుడిని అనుసరించారు. శనివారం ఉదయం ఆ యువకుడు తన ఇంటికి చేరుకున్నాడన్న సమాచారం తెలుసుకున్నారు. వెంటనే వీరూ వెళ్లి అతడిని బయటకు పిలిచారు. పక్కా ప్లాన్‌తో కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. కుటుంబ సభ్యులను, స్థానికులను భయకంపితులను చేసిన ఈ ఘటన భద్రాద్రి జిల్లా భద్రాచలం పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
భద్రాచలంలోని ఏఎస్ఆర్ కాలనీకి చెందిన కణితి సతీశ్(24) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ అదే కాలనీకి చెందిన కొందరు యువకులతో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. అదే భద్రాచలంలోని జగదీశ్ కాలనీకి చెందిన గంజి సాయిరాం ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సుకు కండక్టర్‌గా, క్లీనర్‌గా పనిచేస్తూ మరికొందరు యువకులతో కలిసి ఇంకో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వాహనాలు వచ్చిపోయే విషయంలో ఈ రెండు గ్యాంగ్‌లు ఘర్షణ పడ్డాయి. అప్పటి నుంచి ఈ రెండు గ్యాంగ్‌ల సభ్యులు ఎప్పుడు, ఎక్కడ తారసపడినా పరస్పరం గొడవ పడుతుంటారు.
ఈ క్రమంలో వారం రోజుల క్రితం సాయిరాం గ్యాంగ్‌లోని ఓ యువకుడిని సతీశ్ గ్యాంగ్‌లోని ఓ యువకుడు హెచ్చరించాడు. ఈ విషయాన్ని సాయిరాం గ్యాంగ్‌లోని యువకుడు వెళ్లి సాయిరాంకు చెప్పాడు. దీంతో సాయిరాం వెళ్లి సతీశ్ గ్యాంగ్‌లోని యువకుడికి వార్నింగ్ ఇచ్చాడు. తమ వాడి జోలికొస్తే అంతు చూస్తానంటూ హెచ్చరించాడు. ఈ విషయాన్ని సతీశ్ గ్యాంగ్ యువకుడు తీసుకెళ్లి సతీశ్‌కు చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన సతీశ్.. సాయిరాం పనిచేసే ట్రావెల్స్ కార్యాలయం వద్దకు వెళ్లి సాయిరాంను హెచ్చరించాడు. తమ గ్యాంగ్ యువకుడిని ఎందుకు బెదిరించావంటూ ప్రశ్నించాడు.
తమ కార్యాలయం వద్దే తనను హెచ్చరించడాన్ని అవమానంగా భావించిన సాయిరాం.. తన గ్యాంగ్‌తో కలిసి సతీశ్‌ను అంతం చేసేందుకు ప్లాన్ చేశాడు. శుక్రవారం రాత్రి భద్రాచలం పట్టణ శివారులోని ఓ దాబాలో తన గ్యాంగ్‌తో సతీశ్ ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న సాయిరాం.. అతడి గ్యాంగ్‌ను తీసుకొని సదరు దాబా వద్దకు వెళ్లాడు. వీరి గ్యాంగ్‌ల గురించి తెలిసిన సదరు దాబా యజమాని వెంటనే దాబాను మూసివేసి వీరిని బయటకు పంపాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలోని పెట్రోలు బంకు సమీపంలో ఈ రెండు గ్యాంగ్‌లూ ఘర్షణ పడుతుండడంతో స్థానికులు సమీపంలోని ఎటపాట(ఏపీ పరిధిలోని పీఎస్) పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు వచ్చి రెండు గ్యాంగ్‌లనూ చెదరగొట్టారు.
అక్కడ కత్తులు పడి ఉండడాన్ని చూసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. సాయిరాం గ్యాంగ్‌లోని ఇద్దరు యువకులను కూడా ఆపి.. శనివారం ఉదయమే తమ స్టేషన్‌కు వచ్చి కనిపించి వెళ్లాలని చెప్పి పంపించారు. ఈ క్రమంలో సతీశ్‌ను అంతం చేసేందుకు అప్పటికే ప్లాన్‌తో ఉన్న సాయిరాం గ్యాంగ్ సభ్యులు అతడి కోసం వేట మొదలుపెట్టారు. కొందరు సభ్యులు అనుసరిస్తున్నట్లు గమనించిన సతీశ్.. శుక్రవారం రాత్రంతా తన ఇంటికి వెళ్లలేదు. శనివారం ఉదయమే వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న సాయిరాం తన గ్యాంగ్ సభ్యులతో సతీశ్ ఇంటికి వచ్చాడు. బయటకు పిలిపించి మాట్లాడుతూనే.. అప్పటికే తెచ్చుకున్న కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు.
అడ్డుకోబోయిన సతీశ్ సోదరుడు రమణపై కూడా కత్తులతో దాడి చేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో సాయిరాం గ్యాంగ్ సభ్యులు పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న సతీశ్‌ను, స్వల్పంగా గాయపడిన రమణను స్థానికులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సతీశ్ ప్రాణాలు విడిచాడు. రమణ కోలుకుంటున్నాడు. కాగా.. ప్రధాన నిందితుడు సాయిరాం, అతడి గ్యాంగ్‌లోని 15 మంది సభ్యులు వెళ్లి భద్రాచలం పోలీసుల ఎదుట లొంగిపోయారు. హతుడి సోదరుడు రమణ ఫిర్యాదు మేరకు భద్రాచలం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.