ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 26:యాసంగి సాగు జోరందుకున్నది. జలాశయాలు, చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరుంది. రెండో పంటలో పూర్తి ఆయకట్టుకు సాగర్ జలాలు విడుదల కానుండడం, బావులు, బోర్ల కింద భూగర్భ జలాలు పెరగడం.. వ్యవసాయానికి నిరంతరాయంగా కరెంట్ సరఫరా అవుతుండడం, పంటల పెట్టుబడి సాయం అందనుండడం వంటి సానుకూల అంశాలతో యాసంగి పనులను రైతులు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఆయా రకాల పంటలు కలిపి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 34 వేల ఎకరాల్లో సాగు పనులు మొదలయ్యాయి. అంతేకాదు, యాసంగి సీజన్ రైతుబంధు సాయం బుధవారం నుంచి రైతుల ఖాతాల్లో జమకానున్నది. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 3,28,491 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందించనుండడంతో కర్షకులు ఆనందంతో సాగులోకి దిగారు.
ఖమ్మం జిల్లాల్లో యాసంగి సాగు జోరందుకున్నది. ఇప్పటి వరకూ 34,666 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగును రైతులు మొదలుపెట్టారు. సాగునీరు, వాతావరణం వంటివి అనువుగా ఉండడంతో అన్నదాతలందరూ సాగు పనుల్లో వేగం పెంచారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో మక్కసాగు భారీగా జరిగే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతం వరిపంట చేతికి రావడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొస్తున్నారు. మరోవైపు పత్తి, మిర్చి ఏరివేత పనులు కొనసాగుతున్నప్పటికీ వరి, అపరాల పంటల స్థానంలో నూతన పంటల సాగుకు రైతులు శ్రీకారం చుడుతున్నారు. దీంతో సోమవారం నాటికి ఆయా రకాల పంటలు కలిపి జిల్లా వ్యాప్తంగా 34 వేల ఎకరాల్లో సాగు పనులు మొదలైనట్లయింది. యాసంగి వరి 3,555 ఎకరాలు, మక్క సాగు 30,193 ఎకరాలు, వేరుశనగ 341 ఎకరాలు, మినుము 58 ఎకరాలు, మిర్చి 311, చెరుకు 22, పొద్దుతిరుగుడు 20, పెసర 75 ఎకరాల్లో సాగవుతున్నాయి. ప్రస్తుతం సాగర్ కాలువ నుంచి సాగునీరు విడుదల అవుతుండడంతో ఆయకట్టు రైతులు వరిసాగు పనులు ముమ్మరం చేశారు.
ప్రస్తుతం జిల్లా రైతాంగం సుమారు 20,641 ఎకరాల్లో వరినారు మడులు పోసుకొని నాట్లు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. చెరువులు, బోరుబావుల్లో సైతం నీరు పుష్కలంగా ఉండడంతో నిరుటికంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం యాసంగి సీజన్లో సైతం పత్తి సాగు చేపట్టేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్‌కు సంబంధించి పత్తి 56 ఎకరాల్లో సాగు కావడం విశేషం. రైతుల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల్లో అవసరమైన అపరాలు, మక్క, వరి విత్తనాలను సిద్ధంగా ఉంచారు. సాగుకు తగ్గట్టుగా ఏ ఒక్క రైతుకూ ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు మార్క్‌ఫెడ్ అధికారులు జిల్లా కేంద్రంలో ఎరువులను నిల్వ చేస్తున్నారు. నెలవారీ అవసరాలకు అనుగుణంగా సొసైటీలకు ఎరువులు తరలిస్తున్నారు.
రేపటి నుంచి యాసంగి రైతుబంధు సాయం..
యాసంగి సీజన్ రైతుబంధు సాయం బుధవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 3,28,491 మంది రైతులకు రూ.363.44 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత సీజన్‌తో పోల్చుకుంటే ఈ ఏడాది అదనంగా మరో 8,556 మంది రైతులకు పంటల పెట్టుబడి సొమ్మును సర్కారు అందించనున్నది. ఈ సంవత్సరం 20వ తేదీ వరకు రెవెన్యూ శాఖ ద్వారా నూతనంగా డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు పథకం వర్తించనుంది. మండలాల వారీగా పరిశీలిస్తే కామేపల్లిలో 11,331 మంది రైతులకు రూ.14.83 కోట్లు, ఖమ్మం అర్బన్‌లో 3,927 మంది రైతులకు రూ.4.18 కోట్లు, రఘునాథపాలెంలో 16,634 మంది రైతులకు రూ.19.13 కోట్లు, ఖమ్మం రూరల్‌లో 18,510 మంది రైతులకు రూ.17.02 కోట్లు, కూసుమంచిలో 18,849 మంది రైతులకు రూ.20.71 కోట్లు, నేలకొండపల్లిలో 19,731 మంది రైతులకు రూ.17.89 కోట్లు, తిరుమలాయపాలెంలో 20,273 మంది రైతులకు రూ.22.17 కోట్లు, బోనకల్లులో 16,950 మంది రైతులకు రూ.18.34 కోట్లు, చింతకానిలో 17,415 మంది రైతులకు రూ.19.07కోట్లు, మధిరలో 18,886 మంది రైతులకు రూ.20.33 కోట్లు, ముదిగొండలో 18,470 మంది రైతులకు రూ.20.13 కోట్లు, ఎర్రుపాలెంలో 15,968 మంది రైతులకు రూ.18.35 కోట్లు, కల్లూరులో 21,322 మంది రైతులకు రూ.21.75 కోట్లు, పెనుబల్లిలో 13,332 మంది రైతులకు రూ.17.27 కోట్లు, సత్తుపల్లి మండలంలో 13,102 మంది రైతులకు రూ.18 కోట్లు, తల్లాడలో 17,341 మంది రైతులకు రూ.18.72 కోట్లు, వేంసూరులో 17,747 మంది రైతులకు రూ.20.31 కోట్లు, కొణిజర్లలో 18,293 మంది రైతులకు రూ.17.14 కోట్లు, సింగరేణి మండలంలో 12,003 మంది రైతులకు రూ.18.24 కోట్లు, వైరా మండలంలో 13,468 మంది రైతులకు రూ.13.38 కోట్లు అందనున్నాయి. వీరితోపాటు నూతనంగా 21 మండలాలకు చెందిన మరో 8,556 మంది రైతులకు రైతుబంధు సొమ్ము అందనున్నది. అయితే నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న రైతులు పట్టాదారు పాసుపుస్తకంతోపాటు బ్యాంక్ ఖాతా పుస్తకం, ఆధార్‌కార్డు నకళ్లను వచ్చే నెల 6లోపు ఆయా గ్రామాలకు చెందిన వ్యవసాయశాఖ విస్తరణ అధికారులకు అందజేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం.విజయనిర్మల సూచించారు.