ములకలపల్లి, మార్చి 6: ‘నీళ్లు లేక పంటలెండిపోతున్నాయి.. సాగునీళ్లు అందించి మా పంటలను కాపాడండి మహాప్రభో..’ అంటూ వేడుకుంటున్నారు భదాద్రి జిల్లాలోని చండ్రుగొండ, ములకలపల్లి మండలాల రైతులు. ఆరుగాలం శ్రమిస్తూ పంటలు సాగు చేస్తున్నామని, కేవలం సాగునీరు అందని కారణంగా తమ కళ్లముందే అవి మాడిపోతున్నాయి. పొలాలన్నీ నెర్రెలువారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైర్లను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని వాపోతున్నారు. ఎండిపోతున్న పంటలవైపు దీనంగా చూస్తున్నారు. తలలు పట్టుకుంటూ గోడుమంటున్నారు.
భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి, రాజుపేట, గొల్లగూడెం, భగత్‌సింగ్ నగర్, కంపగూడెం, చెవిటిగూడెం గ్రామాలకు చెందిన రైతులు ఇదే మండలంలోని పాములేరు వాగుపై ఆధారపడి ఏటా రెండు పంటలూ సాగు చేస్తుంటారు. కానీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆ వాగులో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో అంతకుమునుపే వేసిన పంటలకు సాగునీరు అందడం లేదు.
ఈ గ్రామాల్లో ప్రధాన యాసంగి పంటలుగా వరి, మొక్కజొన్న, శనగ సాగు చేస్తుంటారు. ఈ యాసంగిలోనూ సుమారు వెయ్యి ఎకరాల్లో రైతులు ఆయా పంటలు వేశారు. అవన్నీ ఇప్పుడు చేతికి వచ్చే దశలో ఉన్నాయి. కానీ.. ఇదే సమయంలో పాములేరు వాగులో నీళ్లు ఇంకిపోతున్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తమ మొరను ఆలకించి తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్నా పెద్దగా స్పందన కన్పించడం లేదు. దీంతో పాములేరు వాగుపై ఎగువన కమలాపురం వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు కాల్వ అవుట్ గేట్‌ను తెరిచి పాములేరు వాగులోకి నీళ్లు వదిలి తమ పంటలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
పాములేరు వాగులో గతంలో ఏడాది పొడవునా నీళ్లుండేవి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వాగు ఎండిపోయింది. మా పంటలకు ఆ వాగు నీరు ఆధారం. నీళ్లు లేక మా పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని కమలాపురం వద్ద పాములేరు వాగుపై నిర్మించిన సీతారామ కాల్వ అవుట్ గేట్‌ను తెరిచి పాములేరులోకి నీళ్లు వదిలి మా పంటలకు అందించాలి.
-బైరు ప్రసాద్, రైతు, ములకలపల్లి
మా గ్రామంలో నుంచి వెళ్తున్న సీతారామ ప్రాజెక్టు కాల్వ నీటిని మా పంటలకు కూడా మళ్లించండి. చెంతనుంచే సీతారామ ప్రాజెక్టు నీళ్లు వెళ్తున్నా మా పంటలకు అందడం లేదు. అందుకని ఆ నీళ్లు అందించైనా మా పంటలను కాపాడాలి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోతే మాకు పెట్టుబడులు కూడా రావు. నష్టపోతాం.
-తాళ్ల వీరభద్రం, రైతు, భగత్‌సింగ్ నగర్, ములకలపల్లి మండలం