ఇల్లెందు/ భద్రాచలం, అక్టోబర్ 18 : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ఇల్లెందు, భద్రాచలంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 37వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయా శిబిరాలను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి, జిల్లా నాయకుడు అబ్దుల్ నబి , జేఏసీ నాయకుడు హీరాలాల్ సందర్శించి, సంఘీభావం తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. పెండింగ్ వేతనాలతోపాటు టైంస్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఐటీడీఏ పీవో.. కార్మికులు ఈ నెల 20వ తేదీల్లో విధుల్లో చేరకుంటే వారిని తర్వాత విధుల్లోకి తీసుకునేది లేదని చెప్పడం సరికాదన్నారు. పీవో బెదిరింపులకు లొంగేది లేదని, కార్మికులను అణగదొక్కి పని చేయించుకోవాలని చూస్తే ఊర్కునేది లేదన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు తాళ్లూరి కృష్ణ, రామకళ, మంగ, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, పద్మ, స్వరూప, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.