రామవరం, జూలై 6: ‘మంత్రిని కలిసి మా సమస్యలు చెప్పుకుందామంటే మమ్మల్ని అరెస్టు చేస్తారా?’ అంటూ భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం మాయాబజార్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా గోడును మంత్రికి చెప్పుకునే అవకాశమూ లేదా?’ అంటూ ప్రశ్నించారు. ‘మంత్రికి మా సమస్యను చెప్పుకొని వెళ్దామని వచ్చాం. తీరా మీరు మమ్మల్ని తీసుకొని పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇంటి వద్ద పసి పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇదేమని అడిగితే మాపైనే కోప్పడుతున్నారు.’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి వీకే ఓసీ విస్తరణలో భాగంగా తమకు ఇళ్ల స్థలాల కేటాయింపులోనూ, పునరావాస కల్పనలోనూ తమకు అన్యాయం జరిగిందని చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీ మాయాబజార్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వారికి మద్దతు తెలిపారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. తరువాత కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. పొంగులేటి మంత్రి అయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కోసం కొత్తగూడెంలో వచ్చిన ఆయనను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు మాయాబజార్ మహిళలు తమ ఇళ్ల వద్ద బయలుదేరారు. ఇంతలో కొత్తగూడెం టూటౌన్ పోలీసులు వారి వద్దకు వెళ్లారు. తాము తీసుకెళ్లి అధికారులను కలిపిస్తామని చెబుతూ వాహనం ఎక్కించి తీసుకొచ్చి కొత్తగూడెం టూటౌన్ పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టారు.
వీకే ఓసీ విస్తరణ సందర్భంగా తమను ఖాళీ చేయించినప్పుడు తమకు మరోచోట స్థలం కేటాయించలేదని, కొందరికే కేటాయించారని, ఆ విషయంపై తాము సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేసినప్పుడు పొంగులేటి వచ్చారని, తాము అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ హామీలోనూ కొందరికే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, రెండో జాబితాలో కూడా తమ ఇళ్లు మంజూరు చేయలేదని పేర్కొంటూ మాయాబజార్ మహిళలు కొద్దిరోజులుగా ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయమై ‘మాయాబజార్లో మాయమాయ’ శీర్షికన ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ క్రమంలో ఆదివారం మంత్రి పొంగులేటి కొత్తగూడెం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న విషయాన్ని తెలుసుకున్న మాయాబజార్ మహిళలకు సభా వేదిక వద్దకు వెళ్లేందుకు ఆదివారం ఉదయమే సమాయత్తమవుతున్నారు. ఇంతలో కొత్తగూడెం టూటౌన్ పోలీసులు వెళ్లి వారిని తీసుకొచ్చి పోలీసుస్టేషన్లో కూర్చోబెట్టారు. మంత్రిని కలవాడినికి వీల్లేదని; కావాలంటే ఆర్డీవోనుగానీ, తహసీల్దార్నిగానీ కలిపిస్తామని చెప్పారు. దీంతో ఆ పోలీసులపై సదరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ గోడును మంత్రికి చెప్పుకుందామని వెళ్తున్న తమను ఉదయాన్నే ఎందుకు అరెస్టు చేసి తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఇంటి వద్ద పసిపిల్లలకు వంట కూడా చేయలేదని, వారు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను గంటల తరబడి ఇక్కడెందుకు కూర్చోబెట్టారని, మహిళల సమస్యలను తాము ఎలా పురుష పోలీసులకు ఎలా చెప్పుకోగలమని ప్రశ్నించారు. దీంతో వారిపై సదరు సీఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత మహిళా పోలీసు సిబ్బంది వచ్చిన ఆ మహిళలను సముదాయించారు. మంత్రి పర్యటన ముగిసిన అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట తరువాత ఆ మహిళలను విడుదల చేశారు.