కారేపల్లి, ఆగస్టు 01 : విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన వడ్డే ఉమా(45) తన భర్త రమేష్ తో కలిసి గ్రామ సమీపంలోని వ్యవసాయ భూమిలో పనులు చేసేందుకు వెళ్లింది. మధ్యాహ్న సమయంలో భర్త భోజనానికి ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న ఉమా వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా విద్యుత్ మోటార్ వైరు తగిలిందిది. ఈ ప్రమాదంలో కరెంట్ షాక్ కు గురైన ఉమా బావిలో పడింది. భోజనానికి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన రమేష్ కు తన భార్య ఉమ ఎంతసేపటికి కనిపించలేదు. దీంతో బావిలో చూడగా మృతి చెంది నీళ్లలో తేలాడుతూ కనిపించింది. స్థానికులు, బంధువుల సహాయంతో మృతదేహాన్ని బావిలో నుండి వెలికి తీశారు. ఉమాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన మహిళ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.