శివ్వంపేట, అక్టోబర్ 5: విద్యుత్ సరఫరా సక్రమంగా లేక కోతలు విధించడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని గంగాయిపల్లి గ్రామంలో రైతులు గొల్ల బిక్షపతి యాదవ్, పెద్ద దాసరి రవికి చెందిన ఎండిపోయిన వరి పంటలను ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడగా విద్యుత్ సక్రమంగా అందక పెట్టుబడులు పెట్టినా పంటలు ఎండిపోయాయని, మూడు ఎకరాల వరకు నష్టపోయామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి పంటలను పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదిక అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన సింగరేణి బొగ్గును అమ్ముకుంటూ నాణ్యత లోపించిన బొగ్గుతో విద్యుత్ తయారు చేయడంతో తరచూ లో ఓల్టేజి సమస్యలు ఎదురవు తున్నాయని అన్నారు. దీంతో బోరు మోటార్లు సైతం చెడిపోతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ అందించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కనీసం 6 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందించకపోవడం దుర్మార్గం అన్నారు. పంటలు చివరి దశలో ఉన్నందున నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించాలని, విద్యుత్ సమస్యతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పవన్‌కుమార్ గుప్తా, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, సర్పంచులు ప్రవీణ్‌గౌడ్, నారాయణరావు, బానోత్ కవిత, బీఆర్ఎస్ నాయకులు మర్రి మహేందర్‌రెడ్డి, రాజశేఖర్‌గౌడ్, జగన్‌రెడ్డి, లాయక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.