Mandaadi | తమిళ నటుడు సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి ఏకంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పుడు ఈ బ్లాక్బస్టర్ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘మండాడి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 8, 2026 నుంచి ‘మండాడి’ స్ట్రీమింగ్ కానుంది. తొలుత అక్టోబర్ 9న ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఆ తేదీ కంటే ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించింది.
తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో సినిమా మిస్ అయిన ప్రేక్షకులతో పాటు, సుహాస్ విలనిజాన్ని ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ఆడియన్స్కు కూడా ఇది గుడ్న్యూస్ అని చెప్పొచ్చు. కార్తీ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సర్దార్ 2’ తో పోటీగా థియేటర్లలోకి వచ్చిన ‘మండాడి’ అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ, సంప్రదాయ పడవల పోటీ, స్పోర్ట్స్ అంశాలు, మైండ్ గేమ్స్, యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు మతిమారన్ పుగళేంది ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది.
ముఖ్యంగా సూరి పోషించిన పాత్రకు, కథలోని సంఘర్షణకు మంచి ఆదరణ లభించింది. పెద్ద సినిమాల మధ్య విడుదలైనప్పటికీ ‘మండాడి’ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే కాకుండా భారీ వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో టాలీవుడ్ నటుడు సుహాస్ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు తెలుగులో హీరోగా, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. ‘మండాడి’లో మాత్రం పూర్తిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించాడు. సూరి, సుహాస్ మధ్య సాగే ఈగో వార్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా సుహాస్ తన పాత్రలో చూపించిన విలనిజం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తెలుగులో హీరోగా మెప్పిస్తున్న నటుడు తమిళంలో ఇంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. థియేటర్లలో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘మండాడి’ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుండటంతో సినిమాపై మరోసారి ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 8 నుంచి తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.