న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై దాఖలైన అభ్యర్థనలపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ చేపట్టింది. ఆ పిల్స్ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కమీషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీల అనుమతి లేకుండానే అక్టోబర్ 2025 నుంచి ఆగస్టు 2026 మధ్య కాలంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 14 నిర్ణయాలను తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలపై సుప్రీంలో పిల్ దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. పిల్స్‌పై వివరణ ఇవ్వాలని కోరుతూ జ్ఞానేశ్, సందూ, జోషి, ఈడీ డైరెక్టర్ జనరల్ సీమాఖన్నా, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ మానేశ్ గార్గ్‌లను కోరింది. సంధూ, జోషి అనుమతి లేకుండానే సీఈసీ జ్ఞానేశ్ నిర్ణయాలు తీసుకున్నారని, మార్గదర్శకాలను మార్చేశారని, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారని రాకేశ్ కుమార్ సింగ్, శైలేంద్ర మణి త్రిపాఠిలు తమ పిల్స్‌లో ఆరోపించారు.
సీఈసీ విధులను అడ్డుకోవాలంటూ సీనియర్ న్యాయవాది వికాశ్ సింగ్ చేసిన అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. కేవలం వార్తా కథనాల ఆధారంగా ఎన్నికల సంఘం వివరణ లేకుండా ఎటువంటి ఆదేశాలను ఇవ్వబోమని సుప్రీం పేర్కొన్నది. సీఈసీ విధులను కూడా అడ్డుకోలేమని కోర్టు చెప్పింది. అక్రమ రీతిలో సర్ సమయంలో ఓటర్లను డిలీట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.