భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ కొత్తగూడెం గణేశ్టెంపుల్, జూన్ 14: భద్రాద్రి జిల్లాలోనూ సర్కారు బళ్లలో వెతలు తప్పడం లేదు. కాంగ్రెస్ పాలనలో పిల్లల విద్యపై కనీస పట్టింపు కూడా లేకపోయింది. ‘కొత్త సర్కారు వచ్చింది. కొత్త కమిషన్ వేస్తున్నాం. ఇంకేముంది? చదువులమ్మ తల్లి.. పేదింటికి వరమే’ అంటూ రేవంత్ సర్కారు ప్రగల్బాలు పలికింది. కానీ, రెండున్నరేళ్లయినా అవే బడులు, అవే చదువులు. ఎక్కడా మార్పు లేదు. సర్కారు స్కూళ్లలో తాగునీరు సరిగా లేదు. పారిశధ్యం తొలగించేవారు లేరు. యూనిఫాం, బుక్స్ కూడా తగినన్ని రాలేదు. దీంతో విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది.
దీనికితోడు సోమవారం అమావాస్య కావడంతో చాలా మంది విద్యార్థులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో తొలిరోజు విద్యార్థుల హాజరుశాతం తగ్గనుంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1,670 ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది విద్యార్థుల సంఖ్య 1,69,642గా ఉంది. మరి ఈ ఏడాది తగ్గుతారో పెరుగుతారో చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కుబడిగా బడిబాట కార్యక్రమాలు చేపట్టినా అవి ఎంత వరకూ సత్ఫలితాలు ఇస్తాయోనన్నది తేలాల్సి ఉంది. పాఠశాలల్లో సౌకర్యాల లేమి వల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సర్కారు బళ్లకు పంపేందుకు ఆలోచిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి కూడా సమతూకంగా లేదు.
అసలే అరకొర సౌకర్యాలతో ఉన్న జిల్లా విద్యాలయాలకు పెద్దదిక్కులేకపోవడం కూడా పెద్ద సమస్యగానే మారింది. గత ఏడాది ఉద్యోగ విరమణ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టులో ఇప్పటికీ రెగ్యులర్ డీఈవోను నియమించలేదు. ఇన్చార్జి డీఈవోగా ఏడాదిపాటు జడ్పీ సీఈవోనే విధులు నిర్వహించారు. కానీ, తగినంత పరిపూర్ణత చేకూరలేదు. దీంతో పదో తరగతి ఫలితాలు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది డీఈవో పోస్టును నింపినట్టే నింపినా ఫలితం లేకుండాపోయింది. నూతన డీఈవో కూడా జాయిన్ అయి నెలరోజులు సెలవు పెట్టడంతో మళ్లీ డీఈవో పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో ఈ విద్యాసంవత్సర ప్రారంభానికి తగిన సన్నద్ధత లేకుండాపోయింది. జిల్లా కార్యాలయంలో కూడా కోఆర్డినేటర్ల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అవి కూడా భర్తీచేయక పోవడంతో విద్యాశాఖ కార్యాలయం వెలవెలబోతోంది.
వేసవిలో ప్రభుత్వం చేపట్టిన బడిబాట కూడా మొక్కుబడిగా సాగింది. సర్కారు బడుల్లో సౌకర్యాల లేమి కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు ఆయా మండలాల ప్రజాప్రతినిధులతో బడిబాట ర్యాలీ చేసి ఫొటోలు దిగేందుకు పరిమితమవుతున్నారు. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు ఏకంగా పిల్లలకు ఇళ్ల వద్దకు వచ్చి వారిని తమ పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారు.