ఖమ్మం, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; మున్సిపల్ ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థులెవరో తేలిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఒక కార్పొరేషన్, ఏడు మున్సి పాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగిసింది. దీంతో ప్రత్యర్థులెవరో స్పష్టంగా తేలిపోవడంతో ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా.. నేనా అన్నట్లు పోటీలో తలపడేందుకు సిద్ధమయ్యారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద తప్పడం లేదు. చివరివరకు నమ్మకంతో ఉన్నా ఆ పార్టీ ఆశావహులకు టికెట్లు దక్కకపోవడంతో తమ సత్తా ఏమిటో చూపేందుకు బరిలో ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 354 మంది అభ్యర్థులు, అశ్వారావుపేటలో 78, ఇల్లెందులో108, సత్తుపల్లిలో 83, మధిరలో70, కల్లూరులో72, వైరాలో80, ఏదులాపురంలో 109 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ఒక వార్డు ఏకగ్రీవం కాగా.. ఇక ఎన్నికల ప్రచారం రసకందాయంలో పడింది.
పురపోరుకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగిసింది, చివరిరోజు కావడంతో పలు రాజకీయపక్షాల తరఫున నామినేషన్ వేసిన అనేకమంది అభ్యర్థులు పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు డివిజన్లలో తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని చివరివరకు నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశావహులు అనేకమందికి చివరి నిమిషంలో ఆశాభంగం కలిగింది, దీంతో ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చాటాలన్న కోపంతో పలువురు అభ్యర్థులు పార్టీ నాయకత్వం బుజ్జగింపు చర్యలు చేపట్టినా ససేమిరా అంటూ ఎన్నికల బరిలో ఉన్నారు. తమ నామినేషన్లను ఉపసంహరించుకునే ప్రసక్తిలేదంటూ భీష్మించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు పురపాలక సంఘాలు కొత్తగూడెం కార్పొరేషన్లో అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద తప్పలేదు. అలాగే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ మధిర, కొత్తగూడెంలో పోటీ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సైతం కొన్నిచోట్ల ఎక్కువ మంది అభ్యర్థులు టికెట్ ఆశించడంతో పార్టీ నాయకులు ఎన్నికల, నియోజకవర్గ ఇన్చార్జులు రంగంలోకి దిగి సర్దిచెప్పారు.
పార్టీ పరంగా వచ్చే అవకాశాల్లో ప్రాధాన్యమిస్తామని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీకి నామినేషన్ వేసిన అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం నాయకత్వం ఎంత బుజ్జగించినా రెబల్స్ కొనసాగడానికి ఆసక్తి ప్రదర్శించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి పలు వార్డుల్లో కొత్తగూడెంలోని డివిజన్లలో ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తవుతున్నది. సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తికావడంతో ఆయా మున్సిపల్ వార్డులకు కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్లకు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఉపసంహరణ చేయించేందుకు చివరి నిమిషం దాకా తీవ్ర కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఆయా పార్టీల నేతలకు నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో టీఆర్ఎస్, సీపీఎం పార్టీలు కలిసి పోటీ చేస్తుండగా సీపీఐ, కాంగ్రెస్, జనసేన వంటి పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగాయి.
కాంగ్రెస్, సీపీఐ పార్టీకి ఎన్నికల పొత్తు కుదురుతుందని భావించినా ఎవరికి వారే నామినేషన్ వేయడం ఒకరు వేసిన వార్డులో మరొకరు నామినేషన్ ఉపసంహరించుకోకపోవడం వంటి కారణాలతో ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో, కొత్తగూడెం కార్పొరేషన్లో త్రిముఖ పోటీ నెలకొంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 22వార్డులకు 78మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైరాలో మొత్తం 155మంది అభ్యర్థులకు 75మంది ఉపసంహరించుకోగా బరిలో 80మంది నిలిచారు.
కల్లూరులో మొత్తం 130మంది నామినేషన్లు వేయగా 58మంది ఉపసంహరించుకోగా 72మంది బరిలో ఉన్నారు. మధిరలో 70మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏదులాపురం మున్సిపాలిటీలో 241మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 132మంది ఉపసంహరించుకోగా బరిలో 109 మంది నిలిచారు. చివరిరోజు తెల్దారుపల్లి 15వ వార్డు సీపీఎం అభ్యర్థి తమ్మినేని విజయలక్ష్మి తమ నిమినేషన్ను ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి అదే వార్డుకు నామినేషన్ దాఖలు చేసిన తమ్మినేని మంగతాయి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23వార్డులకు 154మంది నామినేషన్లు దాఖలు చేయగా 71మంది ఉపసంహరించుకున్నారు. 83మంది అభ్యర్థులు పలు పార్టీల నుంచి బరిలో ఉన్నారు.