– ఈఎంసీ 23వ డివిజన్లో అందుబాటులో లేని పోలింగ్ కేంద్రం
– ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న ఓటర్లు
ఖమ్మం రూరల్, జనవరి 03 : ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇబ్బందుల పాలుకావడం ఆ కాలనీవాసులకు సర్వసాధారణమైంది. ఎన్నికల ముందు నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటు గురించి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అధికారుల ప్రయత్నాలు సఫలం కావడం లేదు. దీంతో అక్కడ కొద్దిమంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవడం పరిపాటిగా మారింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ డివిజన్లో ఇందిరమ్మ కాలనీతో పాటు సత్యనారాయణపురం, సాయి గణేష్ నగర్, జంగాల కాలనీ, రాఘవేంద్ర కాలనీలు ఉన్నాయి. అయితే ఇందిరమ్మ కాలనీకి ఇతర కాలనీలకు మధ్యన బైపాస్ రోడ్డు, జాతీయ ప్రధాన రహదారి ఉంది. గతంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇందిరమ్మ కాలనీ ఓటర్లు ఆయా పోలింగ్ బూత్‌లలో ఉండటం ద్వారా కనీసం వారి పోలింగ్ బూత్‌లు ఎక్కడ ఉన్నాయో తెలవకపోవడంతో పది శాతం మంది కూడా ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
అయితే ఈ దఫా మున్సిపాలిటీ అధికారులు కాలనీవాసులందరినీ 23వ డివిజన్ పరిధిలోకి తీసుకురావడంతో సుమారు 500 మంది ఓటర్లు 23వ డివిజన్ పరిధిలోకి రావడం జరిగింది. ఈ డివిజన్లో మొత్తం 1,700 మంది ఓటర్లు ఉండటంతో మూడు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం అనివార్యమైంది. సత్యనారాయణపురం ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఇప్పటికే అమల్లో ఉండటంతో ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మాణం చేసిన అంగన్వాడీ కేంద్రం భవనంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లయితే ఈ కాలనీవాసులు వందకు వంద శాతం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. మొత్తం మూడు పోలింగ్ కేంద్రాల్లో ఒక పోలింగ్ కేంద్రం ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేయాలని స్థానిక కాలనీవాసులు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. లేనియెడల
ఎన్నికల రోజున ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి సొంత వాహనాలలో ఓటర్లను ప్రలోభ పెట్టి పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని, దీంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదని కాలనీవాసులు వాపోతున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి వృద్ధులు, దివ్యాంగులు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని 23వ డివిజన్ ఇందిరమ్మ కాలనీవాసులు సంబంధిత అధికారులను విన్నవించుకుంటున్నారు. మరి ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా.. ఈసారైనా కాలనీవాసులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.