కారేపల్లి, మార్చి 20 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తి ప్రతి మహిళకు ఆదర్శమని ఐద్వా కారేపల్లి మండల నాయకురాలు కేసగాని నీలిమ అన్నారు. గురువారం మండలంలోని గాంధీనగర్లో ఐద్వా ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సభ ఈసం లక్ష్మి అధ్యక్షతన జరిగింది. మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ.. తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం వీరోచితంగా పోరాడి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
నేటికీ సమాజంలో మహిళలు వివక్షకు గురవుతున్నారని, చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని, మహిళలకు అన్ని రంగాల్లో ఆర్థిక చేయుత ఇవ్వాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఉద్యమించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు కె.జ్యోతి, ఎస్.నాగమణి, కె.పున్నమ్మ పాల్గొన్నారు.