ఖమ్మం, జూన్ 10: ప్రజలకు సంతృప్తికర పాలన అందించడమే సుపరిపాలన అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజలకు అన్ని సౌకర్యాలతో సుపరిపాలన అందుతోందని అన్నారు. అందుకు ఖమ్మం ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, జిల్లాలో జరిగే అభివృద్ధే నిదర్శనమని అన్నారు. ప్రజలకు పాలనను దగ్గర చేయడంతోపాటు వారి సమస్యలను సత్వరమే పరిషరిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సుపరిపాలన ఉత్సవంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నగరాన్ని ఏడేళ్లల్లో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ అందించిన సుపరిపాలన వల్లే ఖమ్మం అభివృద్ధిలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు.
తెలంగాణ రాక ముందు ఖమ్మం కార్పొరేషన్లో 11 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవని, తెలంగాణ వచ్చాక డివిజన్‌కు ఒకటి 60 ట్రాక్టర్లు ఏర్పాటు చేశామని అన్నారు. రెండేళ్ల క్రితం వరకు రోడ్ల వెంట వ్యర్థాల కుప్పలు కనిపించేవని, ఇప్పుడు ఎక్కడా చెత్త కుప్ప కనిపించడం లేదని అన్నారు. ఇక నుంచి ప్రతి శనివారం రీ థింకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం కేఎంసీ నూతన కార్యాలయంలో సేవలు ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా మంత్రి పువ్వాడ, మేయర్ పునుకొల్లు నీరజ కలిసి కేక్ కట్ చేశారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు షేక్ మక్బుల్, జ్యోతిరెడ్డి, సిబ్బంది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రూ.4 కోట్లతో నూతన షాదీఖానా పనుల శంకుస్థాపనలో మంత్రులు మహమూద్ అలీ, అజయ్
ఖమ్మం నగరంలోని సీక్వెల్ వద్ద ఎకరమున్నర స్థలంలో రూ.4 కోట్లతో నూతన షాదీఖానాను నిర్మిస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే దీనిని పూర్తి చేసి ముస్లిం ప్రజలకు అందిస్తామని అన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి శనివారం నూతన షాదీఖానా నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలో సంక్షేమం కోసం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ ఎంతలా ఆలోచిస్తారో ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్‌తో మంత్రి అజయ్‌కు ఉన్న సాన్నిహిత్యంతో ఖమ్మంలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కోసం అధిక నిధులు తెస్తున్నారని అన్నారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రూ.4 కోట్లతో చేపట్టిన నూతన షాదీఖానా నిర్మాణ పనులు వెంటనే ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్‌తోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్‌కుమార్, ఫాతిమా జోహారా, ఆదర్శ్ సురభి, కర్నాటి కృష్ణ, ఆలియా షౌకత్ అలీ, షేక్ మక్బుల్, తాజుద్దీన్, షకీనా, ఖమర్, మహిబ్ అలీ, సలీం, ముజాయిద్, మజీద్, ముక్తార్, షంషుద్దీన్, ఖాసీం, సలీం, శీలంశెట్టి వీరభద్రం, రవికుమార్ పాల్గొన్నారు.