ఖమ్మం, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలో జరుగనున్న పార్లమెంట్, ఖమ్మం- వరంగల్- నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ జాబితాను సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లందరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఖమ్మం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1,456 పోలింగ్ కేంద్రాల పరిధిలోని 12,16,832 మంది ఓటర్లు ఉన్నారని, జాబితాలో సమ్మరీ రివిజన్లో భాగంగా ఒక్క నెలలో 23,124 చేర్పులు జరిగాయన్నారు. ఇదే జాబితాలో 20,435 మందిని వివిధ కారణాలతో ఓటర్లను తొలగించామన్నారు. జాబితాలో 18- 19 ఏళ్ల వయస్సు ఉన్న యువ ఓటర్లు 37,740 మంది ఉన్నారన్నారు. జాబితాలో అభ్యంతరాలపై త్వరలో అన్ని రాజకీయ పార్టీల నుంచి సూచనలను తీసుకుంటామని, పార్టీల ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిష్కరిస్తామన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులందరూ ఈనెల 6లోపు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లానుంచి 87,172 మంది ఓటు హక్కు పొందారని, త్వరలో జరిగే ఎన్నికకు ఇప్పటివరకు 53,464 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఓటు నమోదుకు 31 అక్టోబర్ 2020 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లాలో 107 పోలింగ్ కేంద్రాలు కేటాయిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్, డీపీఆర్వో ఎండీ గౌస్ పాల్గొన్నారు.