‘ఖమ్మం, కొత్తగూడెంలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఉమ్మడి జిల్లా పరిధిలోని పదికి పది స్థానాల్లో విజయం సాధించే విధంగా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు త్వరగా సభా ప్రాంగణాలకు చేరుకోవాలని కోరారు.
ఖమ్మం, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంతోపాటు కొత్తగూడెంలో ఈనెల 5న జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ప్రజలు త్వరగా సభా ప్రాంగణాలకు చేరుకోవాలన్నారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా పరిధిలోని పాలేరులో సీఎం కేసీఆర్ నిర్వహించిన మొదటి సభ, ఆ తర్వాత జరిగిన సత్తుపల్లి, భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందులో జరిగిన సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయన్నారు. సభా ప్రాంగణాల్లో ఎంతమంది జనం ఉన్నారో, అంతకంటే ఎక్కువ మంది స్థలం లేక బయటే ఉండిపోయారన్నారు. సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారన్నారు. సీఎం కేసీఆర్ సభా ప్రాంగణం నుంచి అడిగిన ప్రతి ప్రశ్నకూ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ధరణి పోర్టల్‌తోపాటు రైతుబంధును తీసివేస్తుందని సీఎం కేసీఆర్ సభాముఖంగా ప్రజలకు వివరించినప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పదికి పది సీట్లు దక్కించుకునే విధంగా తమ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. 75 సంవత్సరాల చరిత్రలో ఖమ్మం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దకుతుందన్నారు. ఖమ్మానికి మెడికల్ కాలేజీ తీసుకురావాలని గతంలో ఏ ప్రభుత్వమూ భావించలేదన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాడు మంత్రిగా కొనసాగినప్పుడు ఖమ్మం నగరంలో నీటి ఎద్దడి ఉండేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపానన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ఒక్క రఘునాథపాలెం మండలంలోనే రూ.253 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నాయకులు ఆర్జేసీ కృష్ణ, జహీర్‌అలీ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, పగడాల నాగరాజు, చింతనిప్పు కృష్ణ చైతన్య, పులిపాటి ప్రసాద్, తాజుద్దీన్, డోకుపర్తి సుబ్బారావు, వెంకరమణ, వెంకన్న పాల్గొన్నారు.
సత్తుపల్లి ప్రజాఆశీర్వాద సభకు విచ్చేసి నూతనోత్తేజాన్ని నింపిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. సభను విజయవంతం చేసిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఖమ్మం నగరం హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి సాధించిందన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కృషితోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలిచినా, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాను ఎప్పుడూ చిన్నచూపు చూడలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పదికి పదికి స్థానాలనూ కైవసం చేసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తున్నదన్నారు.
ఖమ్మం, కొత్తగూడెం సభలను
5న ఖమ్మం, కొత్తగూడెంలో జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన మూడు సభలూ విజయవంతం అయ్యాయన్నారు. మంత్రి అజయ్ రూ.వేల కోట్ల నిధులతో ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు. అభివృద్ధికి కృతజ్ఞతగా ప్రజలు వేలాదిగా సభకు తరలిరావాలన్నారు.
ఖమ్మంలో 5న జరుగనున్న సీఎం కేసీఆర్ సభకు లక్షలాది మంది ప్రజలు కదిలిరావాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రజలు 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.